గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By మోహన్
Last Updated : బుధవారం, 28 ఆగస్టు 2019 (18:01 IST)

అమరావతిపై జరుగుతున్న రచ్చ... టీడీపీ కీలక నేత ఏమైయ్యాడు..?

అమరావతిపై ఏపీలో నెలకొన్న గందరగోళ పరిస్థితుల్లో అందరి కళ్లు ఆ నేత వైపే ఉన్నాయి. రాజధానిని అమరావతి నుంచి మరో ప్రాంతానికి తరలించేందుకు ఏపీ ప్రభుత్వం దాదాపుగా సిద్ధమైందని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు వ్యాఖ్యలతో దాదాపుగా ఓ స్పష్టత వచ్చింది.

కాగా రాజధాని తరలింపుపై పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టాలని ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ నిర్ణయించింది. దీనిపై ఏపీ ప్రభుత్వం అధికారికంగా నిర్ణయం వెలువరించిన వెంటనే తమ కార్యాచరణ రూపొందించాలని భావిస్తోంది.
 
రాజధానిపై ఇంత రగడ జరుగుతున్న సమయంలో టీడీపీకి చెందిన కీలక నేత, మాజీమంత్రి స్పందించకపోవడం చర్చనీయాంశంగా మారింది. గత ప్రభుత్వంలో అమరావతి నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన ఆ మాజీమంత్రి ప్రస్తుతం ఎక్కడా కనిపించడం లేదు. ఆయనే టీడీపీకి చెందిన మాజీమంత్రి నారాయణ. గతంలో నారాయణ ఎమ్మెల్సీగా ఉన్నారు అయితే 2019 ఎన్నికల్లో నెల్లూరు జిల్లాలో పోటీ చేసి ఘోరంగా ఓడిపోయారు.
 
గతంలో రాజధాని ఏర్పాటు విషయంలో శివరామకృష్ణన్ కమిటీని కాదని నారాయణ కమిటీ ద్వారా చంద్రబాబు ప్రభుత్వం అమరావతిని రాజధానిగా ఎంపిక చేసిందని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ అనేక సార్లు ఎద్దేవా చేశారు. ఈ విషయంపై మాజీమంత్రి నారాయణ మాత్రం ఇప్పటివరకు స్పందించలేదు. 
 
టీడీపీ ప్రభుత్వంలో రాజధాని నిర్మాణం విషయంలో ప్రముఖ పాత్ర పోషించిన నారాయణ ప్రస్తుతం మౌనం వహిస్తుండడం ఏమిటో టీడీపీ శ్రేణులకు అంతుచిక్కడం లేదు. ఒకవేళ రాజధాని విషయమై తాను స్పందిస్తే, పాలక పక్షానికి ప్రత్యేకంగా టార్గెట్‌గా మారుతానని నారాయణ భావిస్తుండవచ్చు. ఈ ఉద్దేశ్యంతోనే ఆయన మౌనంగా ఉన్నారనే చర్చ నడుస్తోంది. ఏపీ నూతన రాజధాని అమరావతిపై మాజీమంత్రి నారాయణ స్పందన ఎలా ఉంటుందో సస్పెన్స్‌గా మారింది.