సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By
Last Updated : బుధవారం, 28 ఆగస్టు 2019 (15:50 IST)

ఒక్క ఛాన్స్ అంటూ అందలమెక్కారు.. ఆంధ్రాను అంధకారంలోకి నెట్టారు : చంద్రబాబు

ఒక్క ఛాన్స్.. తనకు ఒక్క అవకాశం ఇవ్వండంటూ అందలమెక్కిన వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే ఆంధ్రాను అంధకారంలోకి నెట్టారంటూ టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. 
 
అమరావతిపై నెలకొన్న అనిశ్చితి, అమరావతిపై ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ చేస్తున్న వ్యాఖ్యలపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్పందించారు. ఒక్క అవకాశం అంటూ అందలమెక్కి మూడు నెలల్లోనే అంధకారంలోకి నెట్టారని ఆరోపించారు. దీంతో అమరావతి డైలామాలో పడిపోయిందన్నారు.
 
తాను ఉన్నపుడు మిగులు విద్యుత్ ఇస్తే.. ఇపుడు విద్యుత్ కోతలను అమలు చేస్తున్నారని విమర్శించారు. అమరావతి అనే కాన్సెప్టేనే జగన్ మోహన్ రెడ్డి చంపేసే స్థితికి వచ్చారన్నారు. రాజధాని దొనకొండ అంటూ ప్రచారం చేస్తుండటంతో అందరూ ఇపుడు హైదరాబాద్ వలస వెళ్లిపోతున్నారని చంద్రబాబు అన్నారు. 
 
ఇకపోతే, ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో తెలుగుదేశం పార్టీ శాశ్వతంగా ఉండటం చారిత్రక అవసరమన్నారు. కొత్తగూడెం, అశ్వారావుపేట నుంచి వచ్చిన టీడీపీ కార్యకర్తలతో ఆయన మాట్లాడారు. తెలంగాణను పట్టించుకోవడం లేదనే విమర్శలు సరికాదని అన్నారు. 
 
తెలంగాణలో టీడీపీ మరింత పుంజుకునేలా చేస్తామని, ఇక్కడి నాయకులు వెళ్లిపోయారు గానీ కార్యకర్తలు మాత్రం ఎక్కడికి వెళ్లలేదని, కార్యకర్తల నుంచే మళ్లీ నాయకులను తయారు చేస్తామని స్పష్టం చేశారు. తెలుగువాళ్లు ఎక్కడున్నా వాళ్లు బాగుండాలని టీడీపీ కోరుకుంటోందని అన్నారు. ఆరోజు కష్టపడి పని చేశామని, దూరదృష్టితో ఆలోచించామని, నాడు తాము తీసుకున్న నిర్ణయాలతో హైదరాబాద్ బాగా అభివృద్ధి చెందిందని పేర్కొన్నారు.