తెలంగాణ ఆర్టీసీ సమ్మె: జీతాలు ఎక్కువగా ఉంటే అదనపు షిఫ్టులు ఎందుకు చేస్తాం? - మహిళా ఉద్యోగులు

Woman
బిబిసి| Last Modified గురువారం, 10 అక్టోబరు 2019 (21:45 IST)
"నా భర్త పోయాక ఆయన ఉద్యోగం నాకు వచ్చింది. గత 19 సంవత్సరాల నుంచి నేను దీనిపైనే ఆధారపడి ఉన్నాను. నా ఇద్దరు బిడ్డలను ఇదే ఉద్యోగం భరోసాతో చదివించాను. వాళ్లకు పెళ్లిళ్లు చేయాలి ఇంకా. ఇప్పుడు ఆర్టీసీ సంస్థను ఆదుకోండి అని ప్రభుత్వాన్ని కోరితే మీ ఉద్యోగాలు లేవు పోండి అంటే ఎలా? మా కాళ్లకి ముళ్లు గుచ్చుకుంటే పంటితో తీసేస్తా అన్నది ఈ కేసీఆరే కదా. ఇప్పుడు ముళ్లు కాదు కదా.. గునపాలతో మమ్మల్ని కుళ్లపొడుస్తుండ్రు" అని తమ ఆవేదన వ్యక్తం చేశారు షబ్నమ్ అనే ఆర్టీసీ ఉద్యోగిని. షబ్నమ్ ఆర్టీసీలో పని చేస్తున్న దాదాపు 5,100 మంది మహిళా కార్మికులలో ఒకరు.

అయిదో రోజుకు చేరుకున్న సమ్మె గురించి 'బీబీసీ న్యూస్ తెలుగు' మహిళా బస్సు కండక్టర్లతో మాట్లాడి వారి ప్రతిపాదనలు, ప్రభుత్వం వైఖరిపై వారి అభిప్రాయాలను తెలుసుకుంది. ఆర్టీసీలో 5,100 మహిళా ఉద్యోగులు ఉన్నారు. అందులో దాదాపు 4,900 మంది బస్సు కండక్టర్లుగా పని చేస్తున్నారని తెలంగాణ మజ్దూర్ యూనియన్ జాయింట్ సెక్రటరీ ఉష తెలిపారు.


"1996లో తొలిసారి మహిళా కండక్టర్లను తీసుకున్నారు. ఆర్టీసీ నష్టాల్లో ఉందని చెప్పి ప్రైవేటీకరణ చేసేందుకు పన్నాగం చేస్తున్నారు ముఖ్యమంత్రి. దీన్ని వ్యతిరేకిస్తూ మేం సమ్మె చేస్తుంటే ఉద్యోగాలే లేవు అనడం న్యాయమా? మా హక్కుల కోసం మేం పోరాడుతుంటే యూనియన్లే ఉండాల్సిన అవసరం లేదు అంటున్నారు. మరి యూనియన్ లేకుండా ఆనాడు తెలంగాణ ఉద్యమం సాధ్యపడేదా?" అని ఆవేదన వ్యక్తం చేశారు ఉష. "ఎనిమిది గంటల షిఫ్ట్ చేయాల్సి ఉంటుంది కానీ ఆర్ధిక ఇబ్బందుల కారణంగా ఎక్కువ గంటలు పని చేయటానికి కూడా సిద్ధపడుతున్నారు" అని తెలిపారు మరో మహిళా కండక్టర్ కౌసల్య.

"మాకు జీతాలు చాలా వచ్చేస్తున్నాయి అని చెబుతున్నారు. మరి అంత జీతాలు వస్తున్నా నాలాంటి వారు ఎంతో మంది అదనపు షిఫ్టులు చేయాల్సిన అవసరం ఏంటి? అసలు సిటీలో వానపడినా, ట్రాఫిక్‌లో ఇరుక్కుని గంటలు గంటలు షిఫ్ట్ అయిపోయాక కూడా పని చేస్తున్నాం. మా షిఫ్ట్ అయిపోయింది అని డ్యూటీ మధ్యలో నుంచి వెళ్లిపోం కదా. ప్రజల్ని వారి వారి గమ్య స్థానానికి జాగ్రత్తగా చేర్చి వెళ్తున్నాం కదా" అన్నారు కౌసల్య.

''అసలు ప్రైవేటీకరణ అంటున్నారు, మరి ప్రజలకు సబ్సిడీలు అందిస్తున్న బస్ సేవలు ఎలా అందిస్తారు? అని ప్రశ్నించారు మరో మహిళా కండక్టర్ తేజ. "ఆర్టీసీ బస్సులు ఉన్నాయి కాబట్టే ఎంతో మంది ఆడపిల్లలను తల్లిదండ్రులు చదువులకు పంపే పరిస్థితి ఉంది. ఎంతో మంది ఆడవారు బస్సుల్లో సురక్షితంగా ఉద్యోగాలకు వెళ్లగలుగుతున్నారు. ప్రైవేటీకరణ చేస్తే మరో నిర్భయ లాంటి సంఘటన జరగదన్న గ్యారంటీ ఏంటి?" అన్నారు తేజ.

పండగ సమయంలో సమ్మె చేయడం వల్ల ప్రజలను ఇబ్బంది పెడుతున్నారన్న వాదనపై మహిళా కండక్టర్లు మాట్లాడుతూ... ప్రజలను ఇబ్బంది పెట్టడం తమ ఉద్దేశం కాదన్నారు. "మాకూ పండగే కదా. ఇవాళ మేము కూడా పండగ చేసుకోలేదు కదా. ప్రతి ఏడాది దసరా సమయంలో బస్సులకు పూజ చేసి అందంగా అలంకరించి ఉద్యోగాలకు వెళ్లేవాళ్లం. కానీ ఈ సంవత్సరం మా బస్సులకు పూజ కూడా చేసుకోలేకపోయాం. బతుకమ్మ అంటూ ఇంత పెద్దఎత్తున ప్రభుత్వం సంబరాలు జరిపింది ఆడపడుచులకు. మరి మేం ఈ రాష్ట్ర ఆడపడుచులం కాదా?" అని మాలతి ప్రశ్నించారు.

ఆర్టీసీ యూనియన్ల ప్రతిపాదనల్లో మహిళా ఉద్యోగులుగా వారు ప్రతిపాదించింది మెటర్నిటీ లీవ్‌తో పాటు రెండు సంవత్సరాల చైల్డ్ కేర్ లీవ్ అమలు చేయాలి. అలాగే రాత్రి 9 గంటల తరువాత మహిళా కండక్టర్లకు షిఫ్ట్ వేయవద్దని కోరుకుంటున్నట్టు తెలంగాణ మజ్దూర్ యూనియన్ జాయింట్ సెక్రటరీ ఉష తెలిపారు. అయితే ఆర్టీసీ సంస్థ వెనుక మహిళల పాత్ర చాలా కీలకంగా ఉందని చెబుతూనే తమ భవిష్యత్తు కార్యాచరణ వెల్లడిస్తామని తెలిపారు.

దీనిపై మరింత చదవండి :