ఆదివారం, 8 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Updated : గురువారం, 28 సెప్టెంబరు 2023 (22:51 IST)

ఉజ్జయిని: రక్తమోడుతూ రోడ్డుపై తిరిగిన ఆ బాలిక ఎవరు, అసలేం జరిగింది?

Rape
అత్యాచారానికి గురై సహాయం చేయమంటూ ఓ బాలిక వీధుల్లో తిరిగిన ఘటనకు సంబంధించిన వీడియో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ బాలిక వీధుల్లో తిరుగుతూ ఓ ఇంటిముందు నిలబడ్డ వ్యక్తిని సహాయం కోరగా ఆ వ్యక్తి పక్కకు పొమ్మన్నట్టుగా ఉన్న వీడియోపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. మధ్యప్రదేశ్ లోని ఉజ్జయిని నగరంలో రెండుగంటలపాటు నిస్సహాయంగా తిరిగిన ఈ బాలికకు కొందరు సహాయం చేశారని పోలీసులు స్థానిక మీడియాకు చెప్పారు.
 
బాలిక అత్యాచారానికి గురైనట్టు వైద్యపరీక్షల్లో తేలిందని ఓ సీనియర్ పోలీసు అధికారి చెప్పారు. ‘‘బాలికతో పరిచయం ఉన్న ఐదుగురు వ్యక్తులను ప్రశ్నించాం’’ అని ఉజ్జయిని పోలీసు సూపరింటెండెంట్ సచిన్ శర్మ గురువారం ఏఎన్ఐ న్యూస్ ఏజెన్సీకి తెలిపారు. బాలిక నిస్సహాయంగా, భయంతో బిగుసుకుపోయి ఉందని, తన వివరాలు ఇవ్వలేకపోయిందని చెప్పారు. ఈ బాలిక వయసు ఎంతనే విషయాన్ని పోలీసులు ఇంకా నిర్థరించలేదు. రక్తమోడుతూ రోడ్డుపై తిరుగుతున్న బాలిక ఓ ఇంటిముందు నిలబడ్డ వ్యక్తిని సహాయం కోరడం, అతను పక్కకు పొమ్మన్నట్టు చేయి చూపడం, ఆ బాలిక అక్కడి నుంచి ముందుకువెళ్ళిన ఓ సీసీటీవీ షార్ట్ వీడియో ఈ వారం మొదట్లో ఆన్‌లైన్ కనిపించింది. దీంతో రాజకీయ నాయకులు సహా సామాజిక మాధ్యమాల వేదికగా చాలామంది ఈ సంఘటనను ఖండించారు.
 
ఈ బాలిక ఎక్కడి నుంచి వచ్చింది?
ఈ బాలిక ఎక్కడి నుంచి నడుచుకుంటూ వచ్చిందనే విషయాన్ని తెలుసుకోవడానికి పోలీసులు ఈ సీసీటీవీ ఫుటేజ్ లభించిన వీధిలోని మరో ఫుటేజ్ ను కూడా పరిశీలిస్తున్నారు. బాధిత బాలిక సత్నా నగరానికి చెందినదని పోలీసు సూపరింటెండెంట్ సచిన్ శర్మ తెలిపారు. ఆదివారం నాడు బాలిక కనిపించిన ఉజ్జయినికి ఈ నగరం 700 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ బాలికకు రాహుల్ శర్మ అనే పూజారి సహాయం చేశాడని మీడియా కథనాలు చెపుతున్నాయి. తాను బాలికను చూసినప్పుడు ఆమె రక్తమోడుతూ కనిపించిందని రాహుల్ శర్మ తెలిపారు.
 
‘‘ఆమె మాట్లాడలేకపోతోంది. కళ్ళు వాచిపోయి ఉన్నాయి’’ అని రాహుల్ శర్మ ఎన్డీటీవీకి చెప్పారు. ‘‘తరువాత ఆమె వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నించా. కానీ ఆమె భాష నాకు అర్థం కాలేదు. దీంతో ఆమెకు పెన్ను, పేపరు ఇచ్చాను. కానీ ఏమీ రాయలేకపోయింది’’ అని రాహుల్ శర్మ ది హిందూ వార్తా పత్రికకు తెలిపారు. బాలికకు దుస్తులు ఇచ్చి, పోలీసులకు సమాచారం ఇచ్చానని, వారు ఆ బాలికను ఆస్పత్రికి తరలించారని చెప్పారు.
 
బాలికకు ఆపరేషన్
బుధవారం రాత్రి ఉజ్జయిని పోలీసులు ఓ ప్రకటన విడుదల చేశారు. అందులో బాలిక గాయాలకు చికిత్స జరిగిందని, అలాగే ఆమెకు సర్జరీ కూడా చేశారని మాత్రమే తెలిపారు. ఇతర వివరాలేవీ పేర్కొనలేదు. ఈ విషయంపై ఉజ్జయిని పోలీసు అధికారుల కామెంట్ కోసం బీబీసీ ప్రయత్నించింది. బాలిక పరిస్థితి నిలకడగా ఉందని మధ్యప్రదేశ్ హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా బుధవారం చెప్పారు. ఈ సంఘటనతో ప్రతిపక్షాలు మధ్యప్రదేశ్‌లో మహిళల భద్రతపై అధికార బీజేపీ ప్రభుత్వాన్ని విమర్శించాయి.
 
పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటారని, నిందితులను వదిలే ప్రసక్తే లేదని మధ్యప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు వీడీ శర్మ చెప్పారు. ఈ సంఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకోవాల్సిందిగా తాను ఉజ్జయిని పోలీసులను, మధ్యప్రదేశ్ అధికారులను కోరినట్టు నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ చైర్ పర్సన్ ప్రియాంక్ కనుగు చెప్పారు. బాధితురాలి కుటుంబం ఎక్కడుందో కనుక్కుని వారిని కలిసి నైతికస్థైర్యం అందించేందుకు ప్రయత్నిస్తున్నట్టు పలువురు అత్యాచార బాధితులతో కలిసి పనిచేసిన యాక్టివిస్ట్ యోగితా భయానా బీబీసీతో చెప్పారు.