గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Modified: మంగళవారం, 26 సెప్టెంబరు 2023 (12:00 IST)

ఎస్‌పీ బాలసుబ్రహ్మణ్యం భౌతికకాయం చూడడానికి తమిళనాడులో ప్రజలు ఏం చేశారంటే?

spbalu
ప్రముఖ సినీ నేపథ్య గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మూడో వర్థంతి సెప్టెంబరు 25. 2020లో బాలు చనిపోయినప్పుడు రిపోర్ట్ చేయడానికి చెన్నై వెళ్లిన బీబీసీ ప్రతినిధి బళ్ల సతీశ్ జ్ఞాపకాలు:
 
అది 2020 సెప్టెంబరు 25వ తేదీ. రాత్రి పొద్దుపోయింది. పది గంటలు దాటొచ్చేమో.. చెన్నైలో టి.నగర్‌గా పిలిచే త్యాగరాజ నగర్ నుంచి నగర శివార్ల వైపు వెళ్తున్నాం. సిటీ దాటి శివార్ల వైపు వచ్చాం. చాలా మంది జనం రోడ్ల పక్కన నిల్చుని ఉన్నారు. చీకట్లో స్పష్టంగా తెలియలేదు కానీ, అలా చాలా మంది కనిపించే సరికి బహుశా ఏ ప్రైవేట్ ట్రావెల్స్ బస్ స్టాపో అయ్యుంటుంది. బస్సు కోసం జనాల వెయిటింగ్ అనుకున్నాను. కొంచెం దూరం వెళ్లాక మరో చోట ఇంకొంత మంది జనం కనిపించారు. ఎక్కడ చూసినా రోడ్డు పొడవునా ప్రజలు దేనికోసమో నిరీక్షిస్తున్నట్లుగా కనిపిస్తున్నారు.
 
అంతమంది రోడ్ల మీదకు రావడానికి ఒక కారణం ఉంది. మేం వెళ్తున్న దారిలోనే ఎస్బీ బాలసుబ్రహ్మణ్యం భౌతిక కాయం తీసుకెళ్లే వాహనం కూడా రావాల్సి ఉంది. అప్పటికి ఆ వాహనం మమ్మల్ని దాట లేదు. రాత్రివేళ దారిలో రోడ్లపక్కన నుంచున్న వారంతా బాలసుబ్రహ్మణ్యం చివరి చూపు కోసం వచ్చారని అర్థమైంది. అంతలోనే ఆ వాహనం మమ్మల్ని క్రాస్ చేసింది. కొన్ని కార్లు, మధ్యలో భౌతిక కాయం ఉన్న వాహనం. అద్దాల్లోంచి బాలు కనిపించేలా ఏర్పాటు చేశారు. మాకంటే చాలా ముందే బయల్దేరిన ఆ వాహనం, పోలీసు ఎస్కార్టు ఉన్నా, మాకంటే ఎందుకు వెనుకబడిందో అప్పుడు అర్థమైంది.
 
జనం ఒక్కసారిగా బాలు ఉన్న వాహనం దగ్గరకు వెళ్లారు. నినాదాలు చేశారు. గట్టిగా ఏడ్చారు. కన్నీళ్లు కార్చారు. తమతో తెచ్చుకున్న పూలు చల్లారు. ఆ అద్దాలపై నుంచే వాహనాన్ని తడిమారు. సిబ్బంది వారిస్తున్నా, పోలీసులు వద్దంటున్నా, బండ్లు వేగం పెంచుతున్నా, జనం మాత్రం ఆగలేదు. అంతకుముందు బాలు ఇంటి దగ్గర కూడా అదే పరిస్థితి. సామాన్యుల కోసం పెద్ద లైను. వాటిని కంట్రోల్ చేయడం, సోషల్ డిస్టెన్స్ పాటించేలాచేయడం ఎవరి తరమూ కాలేదు. వచ్చిన వారంతా నివాళి అర్పించి వెళ్తున్నారు.
 
అదుపు చేయాలని పోలీసులు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఓ దశలో చెదరగొట్టారు. అభిమానులు వేరే దారిలోంచి ఇంటి వైపు రాకుండా బారికేడ్లు పెట్టారు. కానీ ఉపయోగం లేదు. వందల మంది, వేల మంది వస్తూనే ఉన్నారు. ఇక జనాన్ని అదుపు చేయడానికే బాలు భౌతిక కాయాన్ని అక్కడి నుంచి సుమారు 50 కిమీ దూరంలో తామరైపాక్కం గ్రామంలో ఉన్న ఫాం హౌస్‌కి తరలించే ప్రయత్నం చేశారు.
 
బాలు ఇంటి దగ్గర నుంచి ఆ వాహనం కదిలినప్పుడు, వెంట పరుగెట్టారు. తమిళ మీడియా సంస్థలన్నీ అప్పటికే తమ వాహనాల్లో ఆ వాహనం ప్రయాణం మొత్తం లైవ్ ఇవ్వడానికి ఏర్పాట్లు చేసుకున్నాయి. మహా అయితే గంట పట్టాల్సిన ప్రయాణం కొన్ని గంటల పాటూ సాగింది. గ్రామాల్లోని ఆడవాళ్లు ఇళ్లల్లోంచి బయటకు వచ్చి తమ పెరట్లోని పూలు తెచ్చి ఆ వాహనం మీద చల్లారు. దేవుడికి దండం పెట్టుకున్నట్టే చేతులెత్తి దండాలు పెట్టారు. బాలును దగ్గరగా చూడడం కోసం ఆ బండి ఎక్కిన వారిని పోలీసులు బలవంతంగా దించాల్సి వచ్చింది.
 
ఆ దారిలో ఒక ఊరి దగ్గర ఆ వాహనం ఎక్కువ సేపు ఆపకపోయే సరికి, ఊరి వాళ్లు ఆ కాన్వాయికి అడ్డంగా నిల్చున్నారు. తమ గ్రామస్తులు నివాళులు అర్పించి, బాలును కడసారి చూసుకున్న తరువాతే కదలనిచ్చారు. ఆ బండికి ముందు పెట్టిన బాలు ఫోటోకి దండం పెట్టుకున్నారు. వందలాది బైకులపై, కార్లలో ఆ కాన్వాయిని అనుసరించారు. నాకు తెలిసినంతలో సాధారణంగా ఏదైనా రాష్ట్ర స్థాయి లేదా దేశ స్థాయిలో జనాదరణ ఉన్న ప్రజా నాయకులు, పెద్ద పేరున్న సూపర్ స్టార్ స్థాయి హీరోలు మరణించినప్పుడు కనిపించే దృశ్యాలు గాయకుడైన బాలు మరణించినప్పుడు చెన్నై నగరంలో కనిపించాయి.
 
ఆ మరునాడు, బాలసుబ్రమణ్యం ఫాం హౌస్ దగ్గర కూడా అదే హడావుడి. చెన్నైకి ఎంత దూరంలో ఉన్నా, జనాన్ని ఆపలేకపోయారు. మిగతా రాష్ట్రాల వారు ఆ జనంలో ఎందరున్నారో తెలియదు. ఎక్కువ మంది తమిళులే. కరోనా సమస్యతో బాలు సన్నిహితులెందరో అక్కడికి రాలేకపోయారు. ఆయన ఆప్తమిత్రుడు భారతీరాజా వచ్చారు. సినిమా వాళ్ల కంటే సామాన్యులే ఎక్కువ ఉన్నారు. ఫాంహౌస్‌లో అంతిమయాత్ర జరిపేప్పుడు, ''వాళ్గ ఎస్పీబీ'' అంటూ నినాదాలు చేశారు. వాళ్గ అంటే జై అని అర్థం. అంత్యక్రియలు జరిగే దగ్గర కార్యక్రమాల కోసం జనాన్ని ఒక పక్కకు తోయాల్సి వచ్చింది. తమిళనాడు స్పెషల్ పోలీసుల గౌరవ వందనాల మధ్య అంత్యక్రియలు ముగిశాయి. శైవ సంప్రదాయానికి చెందిన వారు కాబట్టి పూడ్చారు.
 
తెలుగు రాష్ట్రాల్లో తగ్గింది కానీ చెన్నైలో ఇంకా వాల్ పోస్టర్ల సంస్కృతి ఉంది. ఆయన మరణించిన రోజే, చెన్నైలో ప్రతిచోట బాలసుబ్రమణ్యానికి నివాళి పోస్టర్లు వెలశాయి. ''ఇసై నెల'' అని తమిళులు బాలును ముద్దుగా పిలుచుకుంటారు. అంటే సంగీత చంద్రుడు అని అర్థం. చంద్రముఖి సినిమాలో ఎస్పీ బాలసుబ్రమణ్యం పాడిన సుద్దాల అశోక్ తేజ రాసిన ఒక పాటలో ఇలా ఉంటుంది. ''ముక్కంటీ పాదాలు నేను ముద్దు పెట్టానే.. ముద్దుగా ప్రజల గుండెల్లో నన్నుబెట్టాడే.'' రజినీకాంత్‌ను ఉద్దేశించి రాసింది అయ్యుండొచ్చు కానీ, అది బాలు విషయంలో నిజమేననిపిస్తుంది.
 
ఆయన ఎన్నో భాషల్లో పాటలు పాడారు. అందరూ ఆదరించారు. కానీ తెలుగు, తమిళ, కన్నడిగులకు మాత్రం ఆయన ప్రత్యేకం. ఎందుకంటే బాలు తెలుగు నేలపై పుట్టాడు. తమిళ నేలలో ఒరిగాడు. మళ్లీ జన్మంటూ ఉంటే కన్నడిగునిగా పుడతానన్నాడు. ''ఆ పాట కనరాని చోటు యాడుందే బొమ్మా.. ఈ పాట ఇచ్చింది కూడా ఈశుడే బొమ్మా..''
- బళ్ల సతీశ్
బీబీసీ ప్రతినిధి