గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Modified: శనివారం, 16 సెప్టెంబరు 2023 (13:35 IST)

చంద్రబాబు అరెస్టుపై స్పందించిన సీఎం జగన్: ‘నేరం చేస్తే ఎవరికైనా ఒకే శిక్ష పడాలి’

jagan ys
ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టుపై సీఎం వైఎస్. జగన్మోహన్ రెడ్డి స్పందించారు. చట్టం ముందు అందరూ సమానమేనని, నేరం చేసినవారు ఎవరైనా ఒకే రకమైన శిక్ష పడాలని వైఎస్ జగన్ అన్నారు. ఆయన ఇంకా ఏమన్నారో చూద్దాం. ‘‘జీవితమంతా దోపిడీనే రాజకీయంగా మార్చుకొని ఇటీవలే అవినీతి కేసులో సాక్ష్యాలు, ఆధారాలతో అరెస్టయిన ఒక మహానుభావుడి గురించి మీకు చెప్పాలి. దురదృష్టమేంటంటే, ఎన్ని దొంగతనాలు చేసినా, దోపిడీలు చేసినా, వెన్నుపోట్లు పొడిచినా చంద్రబాబును రక్షించుకునేందుకు పలుకుబడి ఉన్న తన దొంగల ముఠా సభ్యులు ఉన్నారు. కానీ, చట్టం ఎవరికైనా ఒక్కటే అని చెప్పేవారు మాత్రం లేరు.
 
ఒక మామూలు వ్యక్తి ఇదే తప్పు చేస్తే ఏ శిక్ష పడుతుందో అధికారంలో ఉన్న వాళ్లకు కూడా అదే శిక్ష పడాలి అనే చెప్పేవారు ఇప్పటివరకు లేరు. ఇప్పుడు చట్టం ఎవరికైనా ఒక్కటే అని చెబితే దొంగలముఠా సభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు. తెలంగాణలో ఓటుకు నోటు కేసులో ఆడియో టేపుల్లో వాయిస్ చంద్రబాబుదే అని ఫోరెన్సిక్ చెప్పినా కూడా, దొంగగా దొరికినా కూడా ఈ విషయాన్ని ఎవరూ ఒప్పుకోరు. ఇప్పుడు పెద్ద మనుషులుగా చెలామణిలో ఉన్న వారిలో ఏ ఒక్కరూ ఈ నిజాన్ని నిర్భయంగా చెప్పడానికి రెడీగా లేరు. ఎందుకంటే బాబు దొంగతనాల్లో వీళ్లూ కూడా వాటాదారులు కాబట్టి. బహిరంగంగా పట్టుబడినా ఎల్లో మీడియా ఈ నిజాలను చూపించదు, వినిపించదు, నోరెత్తదు, మాట్లాడదు. ’’
 
‘‘లేని కంపెనీని సృష్టించి...’’
‘‘మరో ఉదాహరణ... ప్రభుత్వ నిబంధనలు పక్కన బెట్టి ఒక ఫేక్ అగ్రిమెంట్ సృష్టించారు. చివరకు ఆ సీమన్స్ కంపెనీ మాకు రూ. 371 కోట్ల డబ్బు ముట్టలేదని, ఆ అగ్రిమెంటుతో మాకు సంబంధం లేనది లిఖిత పూర్వకంగా చెప్పింది. స్కిల్ స్కామ్ సూత్రధారి, పాత్రధారి చంద్రబాబే అని రాష్ట్ర ప్రభుత్వ సంస్థ కాదు సాక్ష్యాత్ కేంద్ర ప్రభుత్వ సంస్థ ఈడీ ఆధారాలతో చూపించింది. చంద్రబాబు డబ్బును డొల్ల కంపెనీలకు ఎలా మళ్లించారో చెప్పి ఆయనను అరెస్ట్ చేసింది.’’
 
‘‘ములాఖాత్‌కు వెళ్లి పొత్తు పెట్టుకునేదొకరు’’
‘‘ప్రజలకు చెందాల్సిన వందల కోట్ల ఈ ప్రభుత్వ ధనం ఎక్కిడికి పోయింది? చంద్రబాబు నడిపిన కథలో చంద్రబాబును కాక ఇంకెవరిని అరెస్ట్ చేయాలి? అని ఈ రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు ప్రశ్నించరు. నోరెత్తరు. ఎల్లో మీడియాకు ఇవి కనిపించవు. ఇలాంటి వ్యవస్థలో మనం బ్రతుకుతున్నాం. దొంగ వాళ్ల వ్యక్తే కాబట్టి వాళ్లకూ వాటాలు పంచుతాడు కాబట్టి ఈ విషయంలో వీరెవ్వరూ నోరు మెదపరు. బాబు అవినీతిని దాచడానికి అష్టకష్టాలు పడతారు. మరొకరైతే నేరుగా జైలుకు వెళ్లి ములాఖాత్‌లో మిలాఖాత్ చేసుకుని పొత్తు పెట్టుకుని వస్తారు’’ అని నిడదవోలు సభలో వైఎస్ జగన్ ప్రసంగించారు.
 
atchannaidu
‘‘జగన్ మోహన్ రెడ్డి పచ్చి అబద్ధాల కోరు, ఫేక్ ముఖ్యమంత్రి’’-  కింజరాపు అచ్చెన్నాయుడు
నోరు విప్పితే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్ని అబద్ధాలే మాట్లాడతారని తెలుగుదేశం నాయకుడు కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. అవే ఫేక్ మాటలు ఈరోజు నిడదవోలు సభలో మరోసారి జగన్ మాట్లాడారని వ్యాఖ్యనించారు. ‘‘ఈ దేశంలో, ప్రపంచంలో ఏ ఒక్కరిని అడిగినా అవినీతికి పేటెంట్ హక్కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అని ప్రతీ ఒక్కరూ చెబుతారు.
 
తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అధికారాన్ని ఉపయోగించుకొని సెల్ కంపెనీలు పెట్టి అవినీతిని ప్రపంచానికి పరిచయం చేసిన వ్యక్తి... ఇప్పుడు అవినీతి గురించి మాట్లాడితే ఆశ్చర్యం కలుగుతోంది. జగన్ అవినీతిపై 12 సీబీఐ కేసులు, ఈడీ కేసులు నమోదయ్యాయి. జగన్ 40 వేల కోట్ల ఆస్తులను ఈడీ సీజ్ చేసింది. జగన్ 16 నెలలు జైల్లో ఉన్నారని, 45 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర ఉన్న అవినీతి మరక లేని నాయకున్ని అక్రమ కేసులో జైల్లో వేయించారు.
చంద్రబాబు అవినీతి ఆధారాలతో దొరికినప్పటికీ మేం ఎదురుదాడి చేస్తున్నారంటూ పచ్చి అబద్ధం మాట్లాడారు.
 
స్కిల్ డేవలప్‌మెంట్ కేసులో చంద్రబాబు అవినీతికి పాల్పడినట్లు ఏదైనా అధారం ఉంటే చూపండి. వారం రోజులుగా ఈ కేసును తూర్పారా పడుతున్నా ఒక్క ఆధారాన్ని పట్టుకోలేకపోయారు. ఆధారాల్లేకుండా పచ్చి అబద్ధాలు మాట్లాడటాన్ని మేం ఖండిస్తున్నాం. జగన్‌కు రాజ్యాంగంపై విశ్వాసం లేదు. ఓటుకు నోటు కేసులో చంద్రబాబుకు ఎలాంటి సంబంధం లేదంటూ కోర్టు ఆయనకు క్లీన్ చిట్ ఇచ్చింది. అయినా ఆయన పేరును మీరు ప్రస్తావిస్తున్నారు. ఫేక్ కంపెనీ సృష్టించి చంద్రబాబు 13 చోట్ల సంతకం పెట్టారంటున్నారు. ముఖ్యమంత్రిగా, మంత్రిగా ఎన్నో సంతకాలు పెడుతుంటారు.
 
తప్పుడు సమాచారం ఇస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించడం అవమానకరం. అన్యాయంగా స్కిల్ డెవలప్‌మెంట్ కేసు మీరు పెడితే, ప్రపంచంలో ఎవరైనా చూసేలా పబ్లిక్ డొమైన్‌లో ఒక వెబ్‌సైట్‌లో మేం ఆధారాలన్నీ పొందుపరిచాం. మీరెప్పుడైనా మేం చేసిన ఆరోపణలకు ఆధారాలు చూపించారా?’’ అంటూ అచ్చెన్నాయుడు ప్రసంగించారు.