శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Updated : శుక్రవారం, 15 మే 2020 (17:05 IST)

అమెరికా ఆరోపణ: ‘కోవిడ్-19పై పరిశోధనలను చైనా హ్యాక్ చేస్తోంది’

కోవిడ్-19పై తమ దేశంలో జరుగుతున్న పరిశోధనలను చైనాతో సంబంధాలున్న హ్యాకర్లు లక్ష్యంగా చేసుకుంటున్నారని అమెరికా అధికారులు చెబుతున్నారు. వ్యాక్సిన్లు, చికిత్స, పరీక్షల విషయంలో తమ దేశ సంస్థలు, బృందాలు చేస్తున్న పరిశోధనలను హ్యాక్ చేసేందుకు ప్రయత్నాలు జరిగాయని అమెరికా దర్యాప్తు సంస్థ ఎఫ్‌బీఐ తెలిపింది.
 
చైనా ప్రభుత్వం సైబర్ గూఢచర్యానికి పాల్పడుతోందని చాలా రోజుల నుంచి అమెరికా ఆరోపణలు చేస్తోంది. అయితే, చైనా ప్రభుత్వం మాత్రం ఈ ఆరోపణలను ఖండిస్తూ వస్తోంది. కరోనావైరస్ సంక్షోభంతో రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. వైరస్ వ్యాప్తిని కట్టడి చేయడంలో మీరు విఫలమయ్యారంటే, మీరు విఫలమయ్యారంటూ అమెరికా, చైనా పరస్పరం ఆరోపణలు చేసుకున్నాయి.
 
జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ సమాచారం ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకూ 43 లక్షలకుపైగా మంది కరోనావైరస్ బారిన పడ్డారు. ఈ ఇన్ఫెక్షన్‌తో అమెరికాలో 83 వేల మంది బలవ్వగా, చైనాలో 4,600 మంది చనిపోయారు. ఎఫ్‌బీఐ, అమెరికా హోంల్యాండ్ భద్రత విభాగానికి చెందిన సైబర్ సెక్యూరిటీ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఏజెన్సీ (సీఐఎస్ఏ) బుధవారం అరుదైన ఓ సంయుక్త హెచ్చరిక జారీ చేశాయి.
 
‘కోవిడ్-19కు సంబంధించి వైద్యం, ఫార్మాసూటికల్, పరిశోధన రంగాల్లో పనిచేస్తున్నవాళ్లు హ్యాకర్లకు ప్రధాన లక్ష్యం’ అనే విషయాన్ని గుర్తించాలని కోరాయి. ప్రజా ప్రయోజనం దృష్ట్యా జారీ చేసిన ప్రకటనగా దీన్ని పేర్కొన్నాయి. కరోనావైరస్‌ను ఎదుర్కొనే విషయంలో విలువైన మేధో సంపత్తిని, ప్రజారోగ్య సమాచారాన్ని అక్రమంగా సంపాదించేందుకు సైబర్ నేరగాళ్లు ప్రయత్నిస్తున్నట్లు గుర్తించామని వివరించాయి.
 
సైబర్ గూఢచర్యానికి పాల్పడుతున్నట్లుగా తమపై వస్తున్న ఆరోపణలను చైనా పదేపదే తోసిపుచ్చుతోంది. కోవిడ్-19 చికిత్స, వ్యాక్సిన్ కోసం పరిశోధనల విషయంలో చైనా చాలా ముందుందని ఆ దేశ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి జావో లిజియన్ ఇటీవల వ్యాఖ్యానించారు. వదంతులు, నిరాధార ఆరోపణలతో తమ దేశాన్ని లక్ష్యంగా చేసుకోవడం అనైతికమని అన్నారు.
 
అమెరికా ఆరోపణల్ని ఎలా అర్థం చేసుకోవాలి?
బీబీసీ సెక్యూరిటీ కరస్పాండెంట్ గార్డన్ కొరెరా విశ్లేషణ
పరిశోధనల విషయంలో ఇతర దేశాల నుంచి ముప్పు ఉందని అమెరికా, బ్రిటన్ మే 5న ఇదివరకే సంయుక్తంగా హెచ్చరికను జారీ చేశాయి. అయితే, అందులో ఏ దేశం పేరునూ నేరుగా ప్రస్తావించలేదు. కానీ, అది చైనా, రష్యా, ఇరాన్‌ల గురించి ఉద్దేశించిన ప్రకటన అని ప్రభుత్వ వర్గాలు సంకేతాలు ఇచ్చాయి.
 
ఇప్పుడు దానికి కొనసాగింపు చర్యగానే, అమెరికా తన కొత్త హెచ్చరికలో ప్రత్యేకంగా ఒక్క చైనా పేరునే ఎత్తిచూపింది. కొత్తగా ఏదైనా జరిగిందా అనే వివరాలు మాత్రం ఈ ప్రకటనలో లేవు. దీనిని బట్టి, అమెరికా-చైనాల మధ్య పెరిగిన ఆందోళనల నేపథ్యంలో దేశీయంగా ప్రజల ఆమోదం కోసమూ, చైనాపై ఒత్తిడి పెంచేందుకూ అమెరికా కదిపిన పావుగానూ ఈ చర్యను కొందరు చూస్తున్నారు.
 
చైనా సైబర్ కార్యకలాపాల అంశం గురించి అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ సోమవారం మాట్లాడారు. ‘‘చైనా విషయంలో కొత్తగా ఏముంది? నేను ఆ దేశం తీరు పట్ల సంతోషంగా లేను. (కరోనావైరస్‌ను) పుట్టినచోటే ఆపగలిగేది. ఆపేయాల్సింది కూడా. ఇప్పుడు వాళ్లు హ్యాకింగ్ చేస్తున్నారని కూడా చెబుతున్నారు. ఇంకా కొత్తగా ఏముంది? మేం నిశితంగా పరిశీలిస్తున్నాం’’ అని ట్రంప్ అన్నారు.
 
చైనా హ్యాకింగ్‌కు పాల్పడుతోందని, మేధో సంపత్తిని దోచుకుంటోందని అమెరికా అధికారులు చాలా కాలం నుంచి ఆరోపణలు చేస్తున్నారు. 2009లో లాక్‌హీడ్ మార్టిన్ ఎఫ్-35 యుద్ధ విమానాలకు సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని చైనాతో సంబంధమున్న హ్యాకర్లు దొంగిలించారని అమెరికా ఆరోపించింది. ఆ తర్వాత కొంతకాలానికే తాము అదే తరహా యుద్ధ విమానాన్ని (షెన్యాంగ్ జే-31) అభివృద్ధి చేస్తున్నట్లు చైనా ప్రకటించింది.
 
నాన్ ట్రెడిషనల్ కలెక్టర్స్ (ప్రలోభాలకో, బెదిరింపులకో లొంగిపోయి సమాచారం ఇచ్చేవారు)ను ఉపయోగించుకుని అమెరికా సంస్థల సాంకేతికతను చైనా దొంగతనం చేస్తోందని అమెరికా నిఘా అధికారులు గతంలో ఆరోపణలు చేశారు. ఏటా రూ.30 లక్షల కోట్లకుపైగా విలువ చేసే మేధో సంపత్తిని చైనా దోచుకుంటోందని అమెరికా నేషనల్ కౌంటర్ ఇంటెలిజన్స్ అండ్ సెక్యూరిటీ సెంటర్ డైరెక్టర్ బిల్ ఎవనినా అన్నారు.