సోమవారం, 27 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By
Last Modified: సోమవారం, 24 జూన్ 2019 (21:12 IST)

చెన్నై నీటి కొరత... ఏళ్లుగా చెన్నై నగర నీటి అవసరాల కోసం పోరాడుతున్న 'రెయిన్ మ్యాన్'

చెన్నైలో పోయిన గురువారం మధ్యాహ్నం హఠాత్తుగా వర్షం కురిసింది. చెన్నై 'రెయిన్ మ్యాన్'గా పిలిచే డాక్టర్ శేఖర్ రాఘవన్ చిన్న పిల్లాడిలా నవ్వుతూ, బాల్కనీలోంచి చేతులు బయటకు చాచి దోసిలితో చినుకులు పట్టుకున్నారు. ఆ నీటినే తాగి ఆనందించారు.

"ఔను, నాకు సంతోషంగా ఉంది. ఎందుకంటే దాదాపు 200 రోజుల తర్వాత నేను వర్షాన్ని చూస్తున్నాను. ఇంత వాన చివరిసారిగా గత ఏడాది డిసెంబరు 5న కురిసింది. లెక్క ప్రకారమైతే డిసెంబరు చివరి వరకు వానలు పడాల్సింది. కానీ ఈశాన్య రుతుపవనాలు విఫలం కావడంతో డిసెంబరు 5 తర్వాత వర్షాలు కురవలేదు. ఇప్పుడీ వాన అద్భుతంగా అనిపిస్తోంది" అని ఆయన బీబీసీతో చెప్పారు. శేఖర్ చెన్నైలోని 'ద రెయిన్ సెంటర్' వ్యవస్థాపకుడు.
 
"తేలికపాటి జల్లులతో ప్రయోజనం లేదు. సంపులో ఎంతో కొంత నీటిని నిల్వ చేసుకొనేవారికి ఈ వర్షంతో మేలు. కానీ దీనివల్ల భూగర్భ జలాలైతే పెరగవు. ఎందుకంటే వానల్లేక నేల బాగా పొడిబారిపోయింది" అని ఆయన చెప్పారు. చెన్నై సుదీర్ఘకాలంగా ఎదుర్కొంటున్న నీటి కొరతకు పరిష్కారంగా ఆయన చాలా కాలం క్రితమే వర్షపు నీటి నిల్వ (రెయిన్ వాటర్ హార్వెస్టింగ్) విధానాన్ని ప్రాచుర్యంలోకి తీసుకొచ్చారు. దీనివల్లే ఆయనకు 'రెయిన్ మ్యాన్' అనే పేరొచ్చింది.
 
చెన్నైలో నైరుతి రుతుపవనాలతో పెద్దగా వానలు పడవు. ఈ నగరం పూర్తిగా ఈశాన్య రుతుపవనాల పైనే ఆధారపడుతుంది. ఈశాన్య రుతుపవనాల కాలం అక్టోబరు నుంచి డిసెంబరు వరకు ఉంటుంది. 2018లో ఈశాన్య రుతుపవనాలు విఫలం కావడం, నాలుగు జలాశయాలు రెడ్ హిల్స్, శోలవరం, పుండి, చెంబరబాక్కం నిర్వహణలో వైఫల్యం లాంటి కారణాలు ఇప్పుడు చెన్నైలో నీటి సంక్షోభానికి దారితీశాయి.
 
సంక్షోభం ఎంత తీవ్రంగా ఉందంటే- భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. నీటి ట్యాంకులకు సాధారణ పరిస్థితుల్లో కంటే ఇప్పుడు నాలుగింతలు ఎక్కువగా చెల్లించాల్సి వస్తోంది. పాఠశాలల సమయాన్ని కుదించారు. చాలా సంస్థలు ఉద్యోగులను ఇంటి నుంచే పనిచేయాలని చెప్పాయి. "విచిత్రమేంటంటే భూగర్భ జలాలు నిండుకోవడంతో బోర్లలో నీరు లేదుగానీ ఓపెన్ వెల్స్‌లో మాత్రం నీరుంది. ఇంతటి కరవులో కూడా 18-20 అడుగుల్లో నీరు లభిస్తోంది" అని శేఖర్ వ్యాఖ్యానించారు.
 
'ద రెయిన్ సెంటర్‌'లో శేఖర్ బీబీసీకి ఇంటర్వ్యూ ఇస్తుండగా, వర్షపు నీటి నిల్వ విధానం గురించి ఆయనతో మాట్లాడేందుకు సౌమ్య అర్జున్ అనే ఒక యువతి వచ్చారు. తాము నివసించే భవన సముదాయంలో మొత్తం 69 అపార్టుమెంట్లు ఉన్నాయని, ఇందులో 40 అపార్టుమెంట్ల వారు వర్షపు నీటి నిల్వ వ్యవస్థ ఏర్పాటుకు ముందుకొచ్చారని, మిగతా 29 అపార్టుమెంట్ల వారు కూడా త్వరలోనే అంగీరిస్తారనే నమ్మకముందని శేఖర్‌తో సౌమ్య చెప్పారు.
 
ఈ వ్యవస్థ ఏర్పాటుకు రూ.2 లక్షలు ఖర్చవుతుందని భవన సముదాయ నిర్వాహకులు చెప్పారని, ఈ లెక్కన ఒక్కో అపార్టుమెంటుకు సుమారు రూ.3 వేల చొప్పున అవుతుందని పేర్కొన్నారు. రోజూ ట్యాంకర్ ద్వారా 24 వేల లీటర్ల నీళ్లు తెప్పించుకొనేందుకు తాము చెల్లిస్తున్న డబ్బులో ఇది మూడో వంతు లోపేనని తెలిపారు. అపార్టుమెంటులో వాస్తవానికి 35 వేల లీటర్ల నీరు అవసరమని, ట్యాంకరు ద్వారా అందేది అంతకన్నా తక్కువేనని చెప్పారు.
 
"నీటి కొరత పేద, ధనిక తేడా లేకుండా అందరినీ ఒకేలా ఇబ్బంది పెడుతోంది. ధనవంతులకు డబ్బుంటే ఉండొచ్చు కానీ నీళ్లయితే లేవు" అని శేఖర్ వ్యాఖ్యానించారు. పది రోజుల్లో వారాంతంలో భవన సముదాయాన్ని సందర్శిస్తానని ఆయన సౌమ్యతో చెప్పారు. వర్షపు నీటి నిల్వ వ్యవస్థ ఏర్పాటుకు అవసరమైన ప్రాథమిక విశ్లేషణ జరిపేందుకుగాని, సలహా ఇచ్చేందుకుగాని రైన్ సెంటర్ ఎలాంటి రుసుములూ వసూలు చేయరు. ఈ వ్యవస్థను ఏర్పాటు చేసే పనిని ఎవరైనా తమ ఇష్ట ప్రకారం ఎవరికైనా అప్పగించుకోవచ్చు.
 
వాన నీటి నిల్వ వ్యవస్థ ఏర్పాటు విషయమై గత రెండు వారాలుగా చెన్నైలోని వివిధ ప్రాంతాల నుంచి రోజుకు కనీసం పది మంది తమకు ఫోన్ చేస్తున్నారని లేదా కార్యాలయానికి వస్తున్నారని శేఖర్ తెలిపారు. పాతికేళ్ల క్రితం ఈ విధానాన్ని ప్రాచుర్యంలోకి తెచ్చేందుకు ప్రయత్నించినప్పుడు శేఖర్‌కు నేటి పరిస్థితికి పూర్తి భిన్నమైన అనుభవం ఎదురైంది. వర్షాభావం, నీటి కొరతకు శేఖర్ చూపుతున్న పరిష్కారాన్ని ప్రజలు అర్థం చేసుకొనేలా మీడియా కథనాలు అందించే వరకు ఆయన్ను ఎవరూ పట్టించుకోలేదు.
 
శేఖర్ ఆలోచన అప్పటి జయలలిత ప్రభుత్వం దృష్టికి కూడా వెళ్లింది. ఇళ్లను వర్షపు నీటి నిల్వ వ్యవస్థ ఉండేలా నిర్మించుకోవడాన్ని తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. తర్వాత ప్రభుత్వాలు ఈ నిర్ణయాన్ని అమలు చేయడంపై దృష్టి కేంద్రీకరించలేదు. నీటి సమస్యను ఎదుర్కోవడానికి దీర్ఘకాలిక ప్రణాళికలు రచించడం, అమలు చేయడం పట్ల రాజకీయ సంకల్పం కొరవడిందని, సమస్యకు ఇదో ప్రధాన కారణమని శేఖర్ చెప్పారు.
 
నేడు చెన్నై ఎదుర్కొంటున్న సమస్య మనిషి సృష్టించుకొన్న సమస్యేనని ఆయన తెలిపారు. వర్షపు నీటి నిల్వకు చెన్నైలో చెరువులు, కుంటలు లాంటి సంప్రదాయ వనరులు ఎన్నో ఉండేవని చెప్పారు. అనేక చెరువులు, కుంటలు వ్యర్థాలతో నిండిపోయాయని విచారం వ్యక్తంచేశారు. చెరువులు, జలాశయాల్లో సంవత్సరాలుగా పూడిక తొలగించలేదని తెలిపారు.