శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By
Last Modified: శనివారం, 27 జులై 2019 (19:41 IST)

కేంద్రం వద్దంటున్నా, ముందుకు వెళ్తున్న సీఎం జగన్.. విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపై వివాదం ఏంటి?

విద్యుత్ కొనుగోలు ఒప్పందాల (పీపీఏల)ను పునఃస‌మీక్షించాలని ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణయంపై రగడ జరుగుతోంది. కేంద్రం వద్దంటున్నా, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ విషయంలో ముందడుగు వేయాలనే నిర్ణయించుకున్నారు. దీంతో, ఏపీ ప్ర‌భుత్వ తీరును కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్‌కే సింగ్.. కేంద్ర హోం మంత్రి అమిత్ షా దృష్టికి తీసుకువెళ్లారు.


ఇప్పుడు ఈ వ్యవహారం మరో మలుపు తిరిగింది. పునఃస‌మీక్ష కోసం జూలై 1న ఏపీ ప్ర‌భుత్వం విడుద‌ల చేసిన జీవో 63కు వ్యతిరేకంగా విద్యుత్ సంస్థలు ఏపీ హైకోర్టును ఆశ్రయించాయి. కోర్టు నాలుగు వారాల పాటు జీవోపై స్టే విధించింది. దీంతో ఈ వ్యవహారంలో తదుపరి ఏ మలుపులు ఉంటాయోనన్నది ఆసక్తికరంగా మారింది.

 
వివాదం ఏంటంటే..
టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు సీఎంగా ఉన్న సమయంలో ఏపీ ప్ర‌భుత్వం వివిధ విద్యుత్ సంస్థ‌ల‌తో ఒప్పందాలు కుదుర్చుకుంది. సౌర‌, ప‌వ‌న విద్యుత్‌ను ప‌లు ప్రైవేటు సంస్థ‌ల నుంచి కొనుగోలు చేసేందుకు వీటిని చేసుకున్నారు. అయితే వీటిలో పెద్ద స్థాయిలో అవినీతి జ‌రిగింద‌ని వైఎస్సార్సీపీ ఆరోపిస్తోంది. మార్కెట్ రేట్లకు మించి అధిక‌ ధ‌ర‌లను ప్రైవేటు సంస్థ‌ల‌కు చెల్లిస్తూ చంద్రబాబు ప్రభుత్వం రాష్ట్ర ఖజానాకు తీవ్ర నష్టం కలిగించిందని వాదిస్తోంది.

 
చంద్రబాబు ప్ర‌భుత్వ తీరు కార‌ణంగా ఏటా రూ. 2,766 కోట్ల నష్టం వ‌స్తోంద‌ని నేరుగా సీఎం జ‌గ‌న్ ఆరోపణలు చేశారు. అవసరం లేకున్నా, కావాల్సిన కంపెనీలతో అధిక రేట్లకు పీపీఏలు చేసుకున్నార‌ని ఆయన అన్నారు. ఆ భారాన్ని మోసే పరిస్థితుల్లో ప్ర‌స్తుతం విద్యుత్ పంపిణీ సంస్థలు లేవని వ్యాఖ్యానించారు. ఆ తర్వాత ఒప్పందాలపై పునఃస‌మీక్ష జ‌రుపుతామ‌ని పేర్కొంటూ ప్ర‌భుత్వం జీవో 63 జారీ చేసింది. అందుకు అనుగుణంగా సంప్ర‌దింపుల క‌మిటీని ఏర్పాటు చేసి ఆంధ్ర‌ప్ర‌దేశ్ సదరన్ ప‌వ‌ర్ డిస్ట్రిబ్యూష‌న్ కంపెనీ( ఏపీఎస్పీడీసీఎల్) త‌రఫున పలు విద్యుత్ సంస్థ‌లకు లేఖ‌లు పంపారు. ఈ లేఖలను స‌వాల్ చేస్తూ విద్యుత్ సంస్థలు హైకోర్టును ఆశ్రయించాయి. అలాంటి అధికారమేదీ ఏపీఎస్పీడీసీఎల్‌కు లేదని వాదిస్తున్నాయి.

 
ససేమిరా వద్దంటున్న కేంద్రం
పీపీఏల పునఃస‌మీక్షను కేంద్ర ప్ర‌భుత్వం స‌సేమిరా వద్దంటోంది. ఇప్ప‌టికే రాష్ట్ర ప్రభుత్వానికి రెండు లేఖ‌లు కూడా రాసింది. తొలుత కేంద్ర విద్యుత్ శాఖ కార్య‌ద‌ర్శి జూన్ 9న తొలి లేఖ రాశారు. ఒప్పందాలను అలాగే కొనసాగించాలని, పునఃస‌మీక్ష పేరుతో స‌మ‌స్య‌లు సృష్టించవద్దని అందులో కోరారు. అయితే, రాష్ట్ర ప్ర‌భుత్వం నిర్ణ‌యం మార్చుకోలేదు. జూన్ 10న జరిగిన కేబినెట్ భేటీలో పీపీఏల పునఃస‌మీక్ష మీద చ‌ర్చించి, నిర్ణ‌యం కూడా తీసుకున్నారు. దీని అమలు దిశగా ఏపీ ప్రభుత్వం అడుగులు వేస్తున్న స‌మ‌యంలోనే జూలై 12న కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్‌కే సింగ్ నుంచి నేరుగా లేఖ వచ్చింది.

 
పీపీఏల ర‌ద్దు ప్ర‌తిపాద‌న పెట్టుబ‌డుల‌కు తీవ్ర ఆటంకం అవుతుంద‌ని ఆర్‌కే సింగ్ ఆ లేఖలో ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. నిర్ణ‌యం మార్చుకోవాల‌ని ఏపీ ప్రభుత్వానికి సూచించారు. అయితే, జ‌గ‌న్ ప్ర‌భుత్వం వెన‌క‌డుగు వేయ‌కుండా, పునఃస‌మీక్ష త‌ప్ప‌ద‌ని స్ప‌ష్టం చేసింది.
 

'దుష్ప్ర‌చారం జరుగుతోంది'
పీపీఏల పునఃస‌మీక్షపై దుష్ర్పచారం జరుగుతోందని ఏపీ ప్రభుత్వ ముఖ్య సలహాదారు అజయ్ కల్లం అన్నారు. ఏపీలో స‌రిపోయేంత విద్యుత్ ఉత్ప‌త్తి జ‌రుగుతోంద‌ని, అందుకే అధిక ధ‌ర‌ల‌కు విద్యుత్ కొనుగోలు చేస్తున్న ఒప్పందాల‌పై పునఃస‌మీక్ష అత్య‌వ‌స‌రమని ప్రభుత్వం భావిస్తోందని ఆయన చెప్పారు. ''దేశ వ్యాప్తంగా ప‌వ‌న, సౌర విద్యుత్ ఉత్ప‌త్తి ధ‌ర‌లు గ‌ణ‌నీయంగా త‌గ్గాయి. కేంద్ర ప్ర‌భుత్వ ఆర్థిక స‌ర్వేలో కూడా ఇదే వెల్ల‌డైంది. 2010 నాటికి రూ.18లుగా ఉన్న సౌర విద్యుత్ యూనిట్ ధ‌ర 2018 నాటికి రూ.2.18 కి ప‌డిపోయిన‌ట్టు కేంద్ర నివేదిక చెబుతోంది. ప‌వ‌న విద్యుత్ కూడా 2017లో దేశంలో యూనిట్ ధర స‌గ‌టు రూ.4.20 నుంచి రూ.2.43 కి త‌గ్గిందని పార్ల‌మెంట్‌లో కూడా చెప్పారు'' అని అజయ్ అన్నారు.

 
ఏపీ ప్ర‌భుత్వ పీపీఏల్లో మాత్రం చాలా వైరుధ్యం ఉందని, 3 వేల మెగావాట్ల ప‌వ‌న విద్యుత్‌ని రూ.4.84కి యూనిట్ చొప్పున కొనుగోలు చేయాలని చేసుకున్న ఒప్పందం న‌ష్ట‌దాయ‌కంగా ఉందని ఆయన చెప్పారు. ఇత‌ర ఖ‌ర్చుల‌తో క‌లుపుకుంటే యూనిట్ ధర రూ.6కి చేరుతోందని తెలిపారు.

 
''థ‌ర్మ‌ల్, హైడ్రో ప‌వ‌ర్ త‌క్కువ ధ‌ర‌కే అందుబాటులో ఉన్న స‌మ‌యంలో అధికంగా ఎందుకు వెచ్చించాలి. అవినీతికి వ్యతిరేకంగా జ‌గ‌న్ స్ప‌ష్టంగా ఉన్నారు. అందుకే గ‌త మూడేళ్ల‌లో జ‌రిగిన పీపీఏలపై పునఃస‌మీక్ష చేయాల‌ని నిర్ణ‌యించారు. ఇలా చేస్తే పెట్టుబ‌డులు రావంటూ జరుగుతున్న ప్ర‌చారంలో వాస్త‌వం లేదు'' అని అజయ్ చెప్పారు. రాష్ట్ర ఆర్థిక ప‌రిస్థితిని దృష్టిలో ఉంచుకుని ప‌రిస్థితిని కేంద్రానికి నివేదిస్తామ‌ని ఆయన తెలిపారు.

 
అసెంబ్లీలోనూ దుమార‌మే..
పీపీఏల పునఃస‌మీక్ష అంశంపై జూలై 19న ఏపీ అసెంబ్లీలో అధికార‌, ప్ర‌తిప‌క్షాల మ‌ధ్య వాదోప‌వాదాలు జ‌రిగాయి. వైఎస్ జ‌గ‌న్, చంద్ర‌బాబుల మధ్య మాట‌ల యుద్ధం సాగింది. పీపీఏల వ్య‌వ‌హారంపై ప్ర‌భుత్వ విధానాల‌ను జ‌గ‌న్ ప‌వ‌ర్ పాయింట్ ప్ర‌జెంటేష‌న్ ద్వారా వివరించారు. విద్యుత్‌ను ప్ర‌భుత్వ‌మే అధిక ధ‌ర‌ల‌కు కొనుగోలు చేయడంతో, ప‌రిశ్ర‌మ‌ల‌కు అది మ‌రింత భారం అవుతోంద‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. పారిశ్రామిక‌రంగం కూడా కుదేల‌వుతోంద‌ని అభిప్రాయపడ్డారు. ప్ర‌భుత్వానికి రెండు డిస్కమ్‌లు ఉన్నాయ‌ని, వాటిలో ఒకటైన స‌ద‌రన్ ప‌వ‌ర్ డిస్ట్రిబ్యూష‌న్ కంపెనీ తీవ్ర ఆర్థిక స‌మ‌స్య‌ల్లో ఉంద‌ని జగన్ అన్నారు.

 
విద్యుత్ కొనుగోలు కార‌ణంగా 2017-18 లెక్క‌ల ప్ర‌కారం వ్యయం రూ.16, 455 కోట్లు ఉంటే రెవెన్యూ మాత్రం రూ.13,609 కోట్లుగా ఉంద‌ని, దాంతో డిస్క‌మ్‌లు దివాళా తీసే స్థితికి చేరుకున్నాయ‌ని జగన్ వివ‌రించారు. 2018-19 లో ప్రభుత్వానికి సబ్సిడీల భారం రూ.4,918 కోట్ల‌కు పెరిగింద‌ని అసెంబ్లీలో చెప్పారు. ఆర్థిక లోటుతో ఉన్న రాష్ట్రంలో ఈ భారం భ‌రించే ప‌రిస్థితి లేద‌న్నారు.

 
'జ‌గ‌న్ కంపెనీలో ఎక్కువ ధ‌ర‌ కాదా..'
ప్ర‌భుత్వ వాద‌న‌ను చంద్ర‌బాబు తోసిపుచ్చారు. క‌ర్ణాట‌క‌లో జగన్ సొంత కంపెనీ అధిక ధరలకు విద్యుత్ అమ్మ‌కాలు సాగిస్తుండగా, ఏపీలో పీపీఏలను ఆయన ఎలా తప్పుబడతారని సండూర్ పవర్ కంపెనీ గురించి ప్రస్తావిస్తూ చంద్రబాబు విమర్శించారు. సౌర విద్యుత్ రేడియేష‌న్ పైనా, పవన విద్యుత్ విండ్ స్పీడ్ పైనా ధరలు ఆధార‌ప‌డి ఉంటాయని, వాటిని ప‌రిగ‌ణ‌నలోకి తీసుకోకుండా త‌మిళ‌నాడు, గుజ‌రాత్ లెక్క‌లు చెప్ప‌డం స‌మంజ‌సం కాద‌ని అన్నారు.

 
త‌ప్పుడు స‌మాచారంతో ప్రజలను ప‌క్కదారి ప‌ట్టించ‌వ‌ద్ద‌ని జగన్‌కు సూచించారు. తమ హయాంలో పీపీఏల‌ను త‌క్కువ ధ‌ర‌కు చేసుకునేలానే ప్ర‌య‌త్నించామ‌ని, రెగ్యులేట‌రీ క‌మిష‌న్ ఆదేశాల‌తోనే ఒప్పందాలు జ‌రిగాయ‌ని చంద్రబాబు చెప్పారు. కేంద్ర ప్ర‌భుత్వ సూచ‌న‌ల‌కు అనుగుణంగానే ఇవన్నీ చేశామని వివరించారు. విద్యుత్ సంస్క‌ర‌ణ‌లు, రెగ్యులేట‌రీ అథారిటీ ఏర్పాటు చేయడం ద్వారా 22.5 మిలియ‌న్ యూనిట్ల‌ లోటు విద్యుత్‌ను అధిగ‌మించామ‌ని, ప్రస్తుతం ఏపీలో విద్యుత్ కోతలు మొదలయ్యాయని చంద్రబాబు అన్నారు.

 
విద్యుత్ కంపెనీల వాద‌న ఇది..
పీపీఏల పునఃస‌మీక్ష దిశగా ఏపీ ప్ర‌భుత్వం విడుద‌ల చేసిన జీవోను స‌వాల్ చేస్తూ విద్యుత్ ఉత్ప‌త్తి సంస్థ‌లు హైకోర్టును ఆశ్ర‌యించాయి. ''పెద్ద మొత్తాలు వెచ్చించి విద్యుత్ ఉత్పాద‌న యూనిట్లు ఏర్పాటు చేశాం. చ‌ట్ట‌బ‌ద్ధంగా పీపీఏలు చేసుకున్నాం. మిగిలిన రాష్ట్రాల‌తో పోలిస్తే ఏపీలోనే టారిఫ్ త‌క్కువ‌గా ఉంది. అయినా, ఇంకా త‌గ్గించ‌క‌పోతే ఒప్పందాలు ర‌ద్దు చేసుకుంటామ‌ని ఏపీఎస్పీడీసీఎల్ బెదిరిస్తోంది'' అని సంస్థల తరఫున న్యాయవాదులు కోర్టుకు తెలిపారు.

 
''విద్యుత్ రెగ్యులేట‌రీ క‌మిష‌న్ ప‌రిధిలో 2015లో జ‌రిగిన ఒప్పందాల‌ను 2019లో మారుస్తామంటే కుద‌ర‌దు. స‌మ‌స్య‌లుంటే రెగ్యులేట‌రీ క‌మిష‌న్ ముందే తేల్చుకుంటాం. ఇలా బ్యాక్ డోర్ ప‌ద్ధ‌తిలో టారిఫ్ త‌గ్గించాలంటూ ఒత్తిడి చేయ‌డం కుద‌ర‌దు. జీవోతో పాటు సంప్ర‌దింపుల క‌మిటీని కూడా సస్పెండ్ చేయాలి’’ అని వాదించారు.

 
'ప్ర‌భుత్వానికి ఆ అధికారం ఉంది'
పీపీఏలపై స‌మీక్ష చేసే అధికారం ప్ర‌భుత్వానికి ఉంద‌ని ఏపీ ప్ర‌భుత్వ అడ్వొకేట్ జ‌న‌ర‌ల్ ఎస్ శ్రీరాం చెబుతున్నారు. ''డిస్క‌మ్‌లు తీవ్ర న‌ష్టాల్లో ఉన్నాయి. రోజుకి రూ.7 కోట్లు న‌ష్టం వస్తోంది. పీపీఏలను స‌మీక్షించే అధికారం ప్ర‌భుత్వానికి, ఏపీఈఆర్సీకి ఉంటుంది. ర‌ద్దు స‌హా ఏ నిర్ణ‌య‌మైనా చ‌ట్టానికి లోబ‌డి ఉంటుంది'' అంటూ ప్రభుత్వ వాదనలను ఆయన వినిపించారు.

 
పీపీఏలను ఏక‌ప‌క్షంగా ర‌ద్దు చేయ‌డం ఉండదని, విద్యుత్ కంపెనీలు త‌మ వాద‌న‌ను ఏపీఈఆర్సీ ముందు వినిపించాలని శ్రీరాం అన్నారు. విద్యుత్ ఉత్ప‌త్తి సంస్థ‌ల‌కు ప్రభుత్వం రాసిన లేఖ‌ల‌ను సంజాయిషీ లేఖ‌లుగా మాత్ర‌మే ప‌రిగ‌ణించాలని పేర్కొన్నారు. కోర్టు ఈ అంశంపై నాలుగు వారాల స్టే విధించి, విచారణను ఆగస్టు 22కు వాయిదా వేసింది.