శుక్రవారం, 20 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Updated : సోమవారం, 7 నవంబరు 2022 (14:43 IST)

ఏలియన్స్ ఎదురైతే మీరేం చేస్తారు?

మనకంటే తెలివైన జీవులు ఇతర గ్రహాలపై ఎక్కడైనా ఉన్నాయా అని మనిషి నిత్యం అన్వేషిస్తూనే ఉన్నాడు. ఒకవేళ అలాంటి జీవులు తారసపడితే మనిషి స్పందన ఎలా ఉంటుంది? 1980ల నాటి బ్లాక్ బస్టర్ ఈటీ-ది ఎక్స్‌ట్రా టెరెస్ట్రియల్, అనేక స్టార్ ట్రెక్ ఎపిసోడ్‌ల నుంచి ఐజాక్ అసిమోవ్, ఉర్సులా కె.లీ గ్విన్ పుస్తకాల వరకు సైన్స్ ఫిక్షన్ రచయితలు చాలాకాలంగా ఈ ప్రశ్నతో కుస్తీపట్టినవారే. నిజంగా గ్రహాంతరవాసులు కనిపిస్తే వారితో ఎలా వ్యవహరిస్తారమనేది ఇంకా అస్పష్టమే.

 
పాపులర్ కల్చర్‌లో గ్రహాంతరవాసులను మనుషుల కంటే తక్కువ స్థాయిగానే పరిగణిస్తున్నారు. 2009 నాటి 'డిస్ట్రిక్ట్-9' సినిమాలో లక్షల కొద్దీ గ్రహాంతర రొయ్యలు దక్షిణాఫ్రికాలోని మురికివాడలలో కనిపిస్తాయి. నిజ జీవితంలో మనిషి క్రూరత్వానికి, మూర్ఖత్వానికి ఇది నిదర్శనం. గ్రహాంతరవాసులు ఉన్నట్లు ఇంతవరకు ఎక్కడా ఆధారాలు లేవు. అయినప్పటికీ అన్వేషణ ఇంకా సాగుతూనే ఉంది. ఒకవేళ ఏ ఇతర గ్రహంపైనైనా జీవం కనిపిస్తే అది సినిమాల్లో చూపించిన రూపాల్లో కాకుండా సూక్ష్మజీవుల తరహాలోనే ఉండే అవకాశాలున్నాయి.

 
డ్రేక్ సమీకరణం ప్రకారం గణాంకపరంగా చూసుకుంటే మేధస్సు గల గ్రహాంతరవాసులు ఎక్కడో ఒక చోట ఉండే అవకాశాలున్నాయి. మన గెలాక్సీ సువిశాలమైనది కావడం, గ్రహాల మధ్య అపరిమితమైన దూరం ఉండడాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ అన్వేషణ సాగాలి. 'ఇతర గ్రహాలపై జీవం ఉనికిని కనుగొనడం కానీ, ఆ జీవులతో కాంటాక్ట్ ఏర్పరుచుకోవడం కానీ సాధ్యమయ్యే రోజు వరకు అసంభవంగానే అనిపిస్తుంది' బ్రిటన్‌లోని ఓపెన్ యూనివర్సిటీలో స్పేస్ సైన్స్ ప్రొఫెసర్ జాన్ జార్నెకీ చెప్పారు.

 
'ఇది మన సౌర వ్యవస్థకు వెలుపలి గ్రహాల గురించి నాకు గుర్తుచేస్తుంది. ఒక యువ పరిశోధకుడిగా మేం చర్చించుకున్న అంశం ఇది. సౌర వ్యవస్థ వెలుపల గ్రహాలున్నాయని అనుమానించాం. కానీ, సాంకేతికంగా ఇలాంటివి గుర్తించడం చాలా కష్టం' అన్నారు జాన్. సౌర వ్యవస్థకు వెలుపల గ్రహాలున్నట్లు ఇప్పుడు తెలుసు.. అలాంటి గ్రహాలలో కొన్నింటిలో నీరు ఉండడం వల్ల అక్కడ జీవం ఉండే అవకాశాలున్నాయి. కాబట్టే గ్రహాంతరవాసుల కోసం అన్వేషణ ఇంకా కొనసాగుతోంది. మిగిలిందంతా గ్రహాంతరజీవులు మనకు ఎదురవడమే. కాబట్టి గ్రహాంతరవాసులు ఎదురైతే ఎలా ప్రతిస్పందిస్తామని ఆలోచించడం తప్పేమీ కాదు. ముఖ్యంగా గ్రహాంతరవాసులు మనకంటే తెలివైనవారు అని భావించినప్పుడు అందుకు తగ్గట్లుగా ఆలోచించడం భిన్నంగా ఉంటుంది.

 
మానవేతర హక్కులు
గ్రహాంతరవాసులతో మనుషులు మంచిగా వ్యవహరిస్తారనే ఆశ రచయితల్లో కనిపించలేదు. మానవేతర జీవుల రక్షణకు అంతర్జాతీయ చట్టాలు ఉన్నప్పటికీ భూమిపై మానవేతర జీవుల హక్కులు, రక్షణ చరిత్ర ఏమంత గొప్పగా లేదు. రెండో ప్రపంచ యుద్ధం తరువాత 1948లో మానవ హక్కుల సార్వత్రిక ప్రకటనతో అంతర్జాతీయంగా చట్టం చేశారు. అయినప్పటికీ ఆంక్షల విషయంలో తప్ప హక్కుల విషయానికొచ్చేసరికి మనుషులకు కూడా పరిమితులు తప్పడం లేదు.

 
ప్రతి ఒక్కరికీ స్వేచ్ఛ, స్వాతంత్ర్యం, సమానత్వం వంటి హక్కులను కల్పిస్తూ చట్టాలు ఉన్నప్పటికీ ఆచరణలో ఇవన్నీ కాగితాలకే పరిమితమని రాజకీయ తత్వవేత్తలు చెబుతుంటారు. గ్రహాంతరవాసులతో మనం ఎలా ప్రవర్తిస్తామనేది తెలుసుకోవాలనుకుంటే... మన గ్రహంపైనే మానవేతర జీవులతో మనం ఎలా ఉంటున్నామన్నది పరిశీలిస్తే అర్థమైపోతుంది. గొరిల్లాల నుంచి కాకుల వరకు వివిధ జీవులు వివేకాన్ని ఉపయోగిస్తాయని పరిశోధనలు గుర్తించినప్పటికీ… ఈ వివేకం ఆధారంగా వాటికి హక్కులు కల్పించే ప్రక్రియలో జంతు హక్కుల సంస్థలు ఇప్పుడిప్పుడే ముందడుగు వేస్తున్నాయి.

 
అపరిచితమైన గ్రహాంతర జీవులకు కల్పించాలనుకుంటున్న హక్కులు మన చట్టపరమైన, నైతిక పరిధిలో ఎలా ఇముడుతాయన్న కొందరు పరిశీలిస్తున్నారు. కానీ, గ్రహాంతరవాసుల గురించి అంతర్జాతీయంగా బహిరంగ చర్చలు చాలా తక్కువే. 1977లో ఐరాస సర్వసభ్య సమావేశంలో గ్రెనడా ప్రధాని ఎరిక్ ఎమ్ గెయిరీ ఒక అంశం లేవనెత్తారు. ఐక్యరాజ్య సమితి నేతృత్వంలో గ్రహాంతరవాసుల అన్వేషణకు అధికారిక శోధన సంస్థ ఏర్పాటు చేయాలని గెయిరీ సూచించారు. భూమిపై యూఎఫ్‌వోలు కనిపించడం గ్రహాంతరవాసుల ఉనికికి ప్రబల సంకేతమని గెయిరీ భావించేవారు. ఇంతవరకు అలాంటి సంస్థ ఏర్పాటుకు అడుగులు పడలేదు. అంతేకాదు, ఈ ప్రతిపాదన చేసిన తరువాత ఏడాదే ఆయన పదవీచ్యుతులయ్యారు.

 
గ్రహాంతరవాసుల విషయంపై మాట్లాడొద్దంటూ బ్రిటిష్ దౌత్యవేత్తల నుంచి ఆయనపై తీవ్ర ఒత్తిళ్లు కూడా వచ్చాయని చెబుతారు. అయితే, ఇప్పటికీ గ్రహాంతరవాసుల విషయంలో కొన్ని ప్రభుత్వాలు ప్రత్యేక ఆసక్తి చూపుతున్నాయి. 1999లో జర్నలిస్ట్ లెస్లీ కీన్ యూఎఫ్‌వోలకు సంబంధించిన ఫ్రెంచ్ పత్రాలను లీక్ చేశారు. అందులో, కొన్ని వివరించలేని విషయాలను కొందరు జనరల్స్, అడ్మిరల్స్ గ్రహాంతరవాసులుగా విశ్వసించినట్లు ఉంది. ఈ ఏడాది ప్రారంభంలో కూడా అమెరికన్ కాంగ్రెస్ తొలిసారి 'రహస్య ఎగిరే వస్తువుల' గురించి ఏం చేయాలో బహిరంగంగా చర్చించింది. అయితే, అలాంటి 'రహస్య ఎగిరే వస్తువులు' గ్రహాంతర జీవులకు సంబంధించినవని ఎక్కడా ఆధారాలు మాత్రం చర్చకు రాలేదు.

 
లండన్ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్‌లో 'అవుటర్ స్పేస్ లా'లో నిపుణుడైన జిల్ స్టువార్ట్ మాత్రం వీటన్నిటికి భిన్నమైన ఆలోచన వ్యక్తంచేశారు. మన ఈ జీవిత కాలంలో మనుషులు గ్రహాంతరవాసులతో కాంటాక్ట్ ఏర్పాటుచేసుకోలేరని అభిప్రాయపడ్డారు. గ్రహాంతర మేధస్సును మానవాళి ఎలా హ్యాండిల్ చేయాలనే విషయంలో అంతర్జాతీయ ఒప్పందాలు కానీ యంత్రాంగాలు కానీ లేవని యూఎన్ ఆఫీస్ ఫర్ అవుటర్ స్పేస్ అఫైర్స్‌ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నికలాస్ హెడ్మన్ చెప్పారు. అలాంటి ఫ్రేమ్‌వర్క్ భవిష్యత్తులోనూ ఉండబోదని చెప్పలేమని నికలాస్ అన్నారు. అలాంటి వ్యవస్థల నిర్వహణకు ఐక్యరాజ్యసమితి ఉపయోగపడుతుందని.. అయితే, సభ్య దేశాల ఆమోదంతోనే ఏదైనా జరుగుతుందని నికలాస్ అన్నారు.
 
 
ప్రస్తుతం ఉన్న అన్ని అంతర్జాతీయ స్పేస్ లాస్ కూడా మానవ చర్యలకు సంబంధించినవేనని హెడ్‌మన్ చెప్పారు. మొట్టమొదటి అవుటర్ స్పేస్ ఒప్పందం 1967లో బ్రిటన్, సోవియెట్ యూనియన్, అమెరికాల మధ్య ఐరాస ద్వారా జరిగింది. అంతరిక్షంలోని లక్ష్యాలనూ చేరుకోగల ఖండాంతర బాలిస్టిక్ క్షిపణులను అభివృద్ధి చేసిన నేపథ్యంలో ఇలాంటి అవుటర్ స్పేస్ ఒప్పందం ఆ మూడు దేశాల మధ్య కుదిరింది. ప్రస్తుతం ఉన్న అన్ని అవుటర్ స్పేస్ చట్టాలకూ ఇదే ప్రాతిపదిక. భూవాతావరణానికి ఎగువన అంతరిక్షంలోనూ కొత్త అవకాశాలు ఏర్పడడం, కొత్త ఆందోళనలు మొదలవడంతో ఇలాంటి ఒప్పందాలు అవసరమయ్యాయి.

 
ప్రస్తుతం ప్రధానంగా అయిదు అంతరిక్ష ఒప్పందాలున్నాయి. ఇవి అంతరిక్షంలో ఆయుధాల ప్రయోగంపై నిషేధం నుంచి అంతరిక్షంలోంచి ఆయుధ ప్రయోగం చేసే దేశాల వల్ల ఏర్పడుతున్న నష్టం, వ్యర్థాల బాధ్యత వరకు అన్ని అంశాలనూ కవర్ చేస్తుంది. అంతరిక్షంలో మనుషులు ఏం చేస్తారు, ఏమేం చేయొచ్చు... ఆ చర్యల ప్రభావం ఇతర మానవులపై ఎలా ఉంటుందనేదీ ఈ చట్టాల పరిధిలో ఉంది. గ్రహాంతరవాసుల జాడ దొరికితే ఏం చేయాలనే విషయంలో ఒక ఫ్రేమ్‌వర్క్‌ను ఇంటర్నేషనల్ అకాడమీ ఆఫ్ ఆస్ట్రోనాటిక్స్‌కు చెందిన అన్వేషణ బృందం 2010లో స్వీకరించింది. దశాబ్దాలుగా ఈ అంశంపై జరుగుతున్న చర్చల ఆధారంగా దీన్ని రూపొందించారు. గ్రహాంతరాల నుంచి ఏవైనా సంకేతాలు కనుక వస్తే అలాంటివాటి విషయంలో అంతర్జాతీయ సమన్వయం కోసం ఐరాస ఒక ఫోరమ్ ఏర్పాటు చేయాలని ఈ ఫ్రేమ్ వర్క్ సూచించింది.

 
ఫ్లైయింగ్ సాసర్ నేలపై కూలితే ఏం చేస్తారు?
గ్రహాంతరవాసులకు చెందిన ఫ్లయింగ్ సాసర్ భూమిమీద ఎక్కడైనా కూలితే ఏం చేస్తారు? అనేది జిల్ స్టువార్ట్ లేవనెత్తుతున్న ప్రశ్న. ఇలాంటి సందర్భం కోసం అంతర్జాతీయంగా ఎలాంటి ప్రోటోకాల్ లేదని ఆయన చెబుతున్నారు. ఆ ఫ్లయింగ్ సాసర్ ఏ దేశంలో కూలితే ఆ దేశం అప్పటి పరిస్థితులను బట్టి స్పందిస్తుందన్నారు. గ్రహాంతరాల నుంచి భూమిపైకి ఏదైనా జీవి రాగలిగిందంటే దానికి తెలివితేటలు, చైతన్యం ఉన్నాయనే అర్థం.. అలాంటి జీవులను మానవులతో సమానంగా పరిగణించాలి. మానవ హక్కులు వివేకం ఉన్న జీవుల హక్కులుగా పరిణామం చెందాలనే చర్చకు ఇది ఊతమిస్తుంది అంటున్నారు స్టువార్ట్.

 
భూమి మీద కూడా ఇలాంటి వివేకం ఉన్న జీవులు ఉండొచ్చు. వివేకం ఉందని శాస్త్రవేత్తలు చెప్పే ఆక్టోపస్‌లు చైతన్యంగా ఉంటాయా? వాటికి నొప్పి తెలుస్తుందా అనే చర్చ చాలాకాలంగా ఉంది. కొన్ని రకాల శిలీంథ్రాలలకు నేర్చుకునే సామర్థ్యం ఉందని, అవి నిర్ణయాలు తీసుకోవడంలో మేధస్సును ఉపయోగిస్తాయని అధ్యయనాలు సూచిస్తున్నాయి. ఇక గ్రహాంతరవాసుల విషయానికొస్తే.. అవి ఎదురైతే వాటికి ఎలాంటి తెలివితేటలు ఉన్నాయనేది తెలుసుకోవాలని ఫ్లైమౌత్ యూనివర్సిటీ ప్రొఫెసర్ సునా బ్లాక్‌మోర్ అన్నారు.

 
2022లో విడుదలైన డాక్యుమెంటరీ 'మూమెంట్ ఆఫ్ కాంటాక్ట్'లో ఓ సందర్భాన్ని చూపిస్తారు. అందులో.. బ్రెజిల్‌లోని వర్గన్హాలో గ్రహాంతరవాసుల నౌక కూలిపోగా అక్కడ భౌతికమైన నొప్పితో విలవిలలాడుతున్న ఒక అంతుచిక్కని జీవి ఒకటి కనిపిస్తుంది. గ్రహాంతరవాసి నిజంగా భూమిపైకి వచ్చిందా లేదా అనేది పక్కనపెడితే ఇలా ఒక గ్రహాంతరవాసి నొప్పి అనుభవించందంటే... అవుటర్ స్పేస్ నుంచి భూమికి చేరిన జీవికి హక్కులు కల్పించడానికి ఆధారం లభించినట్లే అంటారు బ్లాక్‌మోర్. గ్రహాంతరవాసులు నొప్పి అనుభవిస్తున్నారంటే వారి పట్ల మనుషులకు నైతిక బాధ్యత ఉండాలని, దాని ఆధారంగా, అనుగుణంగా లీగల్ ఫ్రేమ్ వర్క్ రూపొందించాలని బ్లాక్ మోర్ అన్నారు.