శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Modified: శుక్రవారం, 29 నవంబరు 2019 (16:10 IST)

దక్షిణ భారతీయులంటే బాల్ ఠాక్రేకు ఎందుకు నచ్చదు

ఠాక్రే ట్రైలర్లో దక్షిణ భారతీయులకు వ్యతిరేకంగా ఉపయోగించిన ఒక డైలాగ్‌పై అభ్యంతరం వ్యక్తం చేసిన ప్రముఖ తెలుగు, తమిళ నటుడు సిద్దార్థ "ద్వేషాన్ని అమ్మడం ఆపండి" అంటూ ట్విటర్‌లో ఒక పోస్ట్ చేశారు. ఠాకరే ట్రైలర్‌లో బాల్ ఠాక్రే పాత్ర పోషించిన నవాజుద్దీన్ సిద్దిఖీ "లుంగీ ఉఠావో, పుంగీ బజావో" అంటారు.

 
దీని ద్వారా బాల్ ఠాక్రే దక్షిణ భారతీయులకు వ్యతిరేకంగా ఎంత ఓపెన్‌గా ఉండేవారో సినిమాలో చూపించే ప్రయత్నం చేశారు. ఈ డైలాగ్ మరాఠీ ట్రైలర్‌లో మాత్రమే ఉంది, హిందీ ట్రైలర్‌లో లేదు. బాల్ ఠాక్రేకు దక్షిణ భారతీయులంటే నచ్చదనే విషయంలో ఎలాంటి సందేహం లేదు. కానీ ట్రైలర్‌లో చూపించిన ప్రతి మాట, ప్రతి దృశ్యం వెనక ఎంత నిజముంది?

 
ఠాక్రే సినిమా ట్రైలర్‌లో బాల్ ఠాక్రే జీవితానికి సంబంధించిన కొన్ని రాజకీయ కోణాలు చూపించారు. ఇక చరిత్ర పేజీలను ఎటూ తెరిచాం కాబట్టి అవి ఎంతవరకూ నిజమో, కాదో ధ్రువీకరించుకుందాం. ట్రైలర్‌లో చూపించిన రాజకీయ ఘటనలు అసలు నిజంగా జరిగాయో లేదో కూడా తెలుసుకుందాం. వీటి గురించి తెలుసుకోడానికి మేం బాల్ ఠాక్రేపై 'సమ్రాట్' అనే పుస్తకం రాసిన సీనియర్ జర్నలిస్ట్ సుజాతా ఆనందన్‌తో మాట్లాడాం. ట్రైలర్‌లో చూపించిన దృశ్యాల్లో ఎంత నిజముందని అడిగాం.

 
దక్షిణ భారతీయులంటే ఠాక్రేకు ఎందుకు నచ్చదు?
మొదట నటుడు సిద్దార్థ్‌కు కోపం ఎందుకొచ్చిందో చూద్దాం. ఆయన వాదనలో అర్థం ఉంది. ఎందుకంటే బాల్ ఠాక్రే దక్షిణ భారతీయులకు వ్యతిరేకం అని భావిస్తారు. "1966లో శివసేన స్థాపించడానికి ఎన్నో ఏళ్ల ముందే బాల్ ఠాక్రే 'ద ఫ్రీ ప్రెస్ జర్నల్‌'లో ఒక కార్టూనిస్టుగా పనిచేసేవారు. ఈ జర్నల్‌లో ఆయనతోపాటు కార్టూనిస్ట్ ఆర్.కె. లక్ష్మణ్ కూడా పనిచేసేవారు. ఆయన తర్వాత ప్రముఖ కార్టూనిస్టు అయ్యారు" అని సుజాతా ఆనందన్ చెప్పారు.

 
"బాల్ ఠాక్రే ఎడిటర్‌కు తన కార్టూన్లు పంపించేవారు. కానీ, ఆయన కార్టూన్ల కంటే ఎక్కువగా ఆర్.కె. లక్ష్మణ్ కార్టూన్లకే అక్కడ ప్రాధాన్యం లభించేది. ఎడిటర్ ప్రచురణకు ఎక్కువగా ఆర్.కె.లక్ష్మణ్ కార్టూన్లనే ఎంచుకునేవారు". "అప్పట్లో జర్నలిజంలో దక్షిణ భారతీయుల హవా ఎక్కువగా ఉండేది. దాంతో తమపట్ల పక్షపాతం చూపిస్తున్నారని, ఆర్.కె. లక్ష్మణ్ దక్షిణ భారతీయుడు కావడం వల్ల ప్రాధాన్యం లభిస్తోందని బాల్ ఠాక్రేకు అనిపించేది" అని సుజాత తెలిపారు. తర్వాత ఠాక్రే 1960లో తన సోదరుడితో కలిసి ఆయన 'మార్మిక్' అనే ఒక కార్టూన్ సంబంధిత వీక్లీ ప్రారంభించారు.

 
బాల్ ఠాక్రే ఎప్పుడైనా కోర్టుకు వెళ్లారా?
ట్రైలర్‌లో ఉన్న మిగతా దృశ్యాల విషయానికి వస్తే, అందులో కొన్ని కోర్టు సీన్స్ కూడా కనిపిస్తాయి. వాటిలో ఒకదానిలో ఠాక్రే 1992లో ముంబైలో జరిగిన హిందూ-ముస్లిం ఘర్షణల కేసులో, మరో సీన్లో బాబ్రీ మసీదు విధ్వంసం కేసులో రామమందిరం గురించి మాట్లాడినట్లు చూపించారు. మేం సుజాతా ఆనందన్‌ను ఠాక్రే ఎప్పుడైనా కోర్టుకు వెళ్లారా? అని అడిగాం. ఆమె మాత్రం తనకు తెలిసినంతవరకూ ఠాక్రే ఎప్పుడూ కోర్టుకు వెళ్లలేదని చెప్పారు.

 
1992 అల్లర్ల సమయంలో శ్రీకృష్ణ కమిషన్ కేసు(1992 అల్లర్ల కేసులో) లాంటి వాటిని సుజాత ఆనందన్ కవర్ చేశారు. ముంబయి హైకోర్టులో ఈ కేసు విచారణ ఎప్పుడు జరిగినా బాల్ ఠాక్రే కనిపించేవారు కాదని ఆమె చెప్పారు. ఆయన బదులు శివసేనకు చెందిన నేతలు మధుకర్ సర్పోట్‌దార్, మనోహర్ జోషి కోర్టుకు హాజరయ్యేవారని చెప్పారు.

 
బాబ్రీ మసీదు కేసును గుర్తు చేసుకున్న ఆమె "ఆ కేసుతో బాల్ ఠాక్రే చాలా ఆందోళనకు గురయ్యారు. అయోధ్య నుంచి సమన్లు వచ్చినపుడు దాన్నుంచి బయటపడడానికి ఆయన అన్ని ప్రయత్నాలూ చేశారు" అన్నారు. ఆ కేసులో కూడా తనకు గుర్తున్నంత వరకూ బాల్ ఠాక్రే ఎప్పుడూ కోర్టుకు వెళ్లలేదన్నారు. అన్ని విషయాలూ ఆయన న్యాయవాదులే చూసుకునేవారని తెలిపారు. తన ప్రతినిధులు లేదా మీడియా ద్వారా ప్రకటనలు చేసేవారని సుజాత తెలిపారు.

 
ఠాక్రే మియాందాద్‌తో ఇలాగే మాట్లాడారా?
ఈ సినిమాలో ఠాక్రే లేదా ఆ పాత్ర పోషించిన నవాజుద్దీన్ పాకిస్తాన్ క్రికెటర్ జావేద్ మియాందాద్ బ్యాటింగ్‌ను ప్రశంసించడమే కాదు, సరిహద్దులో సైనికుల త్యాగాల గురించి కూడా మాట్లాడతారు. ఈ సీన్‌ నిజం గురించి అందరికీ తెలుసు. నిజానికి జావేద్ మియాందాద్, బాల్ ఠాక్రే మధ్య బహిరంగ సంభాషణ జరిగింది. వారు మాట్లాడుకున్న సమయంలో మీడియా ముందు బాల్ ఠాక్రే పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా ఒక్క మాట కూడా మాట్లాడలేదు. దేశ జవాన్ల గురించి కూడా ఆయన ఎలాంటి వ్యాఖ్యలూ చేయలేదు.

 
2004లో ఆయన జావేద్ మియాందాద్‌ను తన ఇంటికి ఆహ్వానించారు. అప్పుడు ఠాక్రే కొడుకు మియాందాద్ ఆటోగ్రాఫ్ కూడా తీసుకున్నారు. ఆయన అప్పుడు తనకు ఆట గురించి ఎలాంటి అభ్యంతరాలూ లేవన్నారు. పాకిస్తాన్ ప్రజలు శాంతి కోరుకుంటున్నారని, రాజకీయాలు అన్నిటినీ నాశనం చేస్తున్నాయని చెప్పారు. ఆయన జావేద్ మియాందాద్ ఆటతీరును కూడా ప్రశంసించారు.

 
"ఆ సీన్లో బాల్ ఠాక్రే జావేద్ మియాందాద్‌తో మూసి ఉన్న గదిలో మాట్లాడినట్టు చూపించారు. అలాంటప్పుడు మూసిన గదిలో ఇద్దరి మధ్యా ఎలాంటి సంభాషణ జరిగింది అనేది చెప్పడం కష్టం. కానీ బహిరంగ సంభాషణలో మాత్రం ప్రశంసించడం తప్ప వేరే ఏదీ జరగలేదు" అని సుజాత ఆనందన్ చెప్పారు.

 
ముస్లింలతో థాకరే శత్రుత్వం
ఠాక్రే ముస్లిం వ్యతిరేకి అనే విషయం కూడా ఆసక్తి కలిగించేదే. కానీ 1995 తర్వాత ఆయన తను భారత ముస్లింలకు వ్యతిరేకిని కాదని, పాకిస్తాన్ ముస్లింలకు వ్యతిరేకినని స్పష్టంగా చెప్పారు. "1995లో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చినపుడు ఎంతోమంది ముస్లింలు శివసేనకు ఓటు వేయడం చూసి బాల్ ఠాక్రే ఆశ్చర్యపోయారు".

 
"బాబ్రీ మసీదు విధ్వంసం తర్వాత ముస్లింలు ఆ సమయంలో చాలా అభద్రతా భావంలో ఉన్నారు. కాంగ్రెస్ పట్ల చాలా కోపంగా ఉన్నారు. అందుకే వారికి తమకు వ్యతిరేకంగా ఉన్న శివసేన నుంచే రక్షణ కోరుకోవాలని భావించారు. వినడానికి ఇది వింతగా అనిపించవచ్చు. కానీ ఆ సమయంలో వారి వైఖరి కాస్త ఇలాగే ఉంది" అని సుజాత చెప్పారు.

 
దేవానంద్‌తో స్నేహం, కానీ పోస్టర్ తొలగించారు
ట్రైలర్‌లో మరో సీన్ ఉంది. అందులో దేవానంద్ సినిమా పోస్టర్ తీసేసి, మరాఠీ సినిమా పోస్టర్ పెడుతున్నట్టు కనిపిస్తుంది. కోహినూర్ థియేటర్‌లో జరిగిన ఈ ఘటన హిందీ లేదా వేరే మిగతా భాషల సినిమాలకంటే బాల్ ఠాక్రే 'మీ మరాఠా'కే ప్రాధాన్యం ఇచ్చారనే విషయాన్ని నిరూపిస్తుంది.

 
కానీ దేవానంద్, బాల్ ఠాక్రే మధ్య చాలా సుదీర్ఘ స్నేహం ఉంది. బాల్ ఠాక్రే కార్టూనిస్టుగా ఉన్నప్పటి నుంచి ఆయనకు దేవానంద్ తెలుసు. ఇద్దరూ చాలాసార్లు కలిసి భోంచేసేవారు. ఒకరింటికి ఒకరు వస్తూపోతూ ఉండేవారు. కానీ ఈ ట్రైలర్‌లో చూపించిన సీన్ నిజంగానే జరిగిందా? 1971లో కోహినూర్ థియేటర్‌లో దేవానంద్ సినిమాను తొలగించడానికి ఐదేళ్ల ముందే కొత్త పార్టీగా ఆవిర్భవించడంతో శివసేనకు ఇది మరో కలిసివచ్చే అంశంగా చెప్పచ్చు. 

 
హిందీలు వర్సెస్ మరాఠీలు అనే అంశంపై ఇప్పుడు కూడా అప్పుడప్పుడూ రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. ప్రస్తుతం ఈ ట్రైలర్ వివాదానికి కారణమైంది. కానీ, జనవరి 25న ఠాక్రే సినిమా రిలీజ్ అయిన తర్వాత ఠాక్రే వ్యక్తిత్వాన్ని జనం ఎలా స్వీకరిస్తారు అనేది వేచి చూడాలి.