శుక్రవారం, 8 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Modified: మంగళవారం, 17 మార్చి 2020 (18:10 IST)

కరోనావైరస్ అనుమానిత రోగులు ఆసుపత్రుల నుంచి ఎందుకు పారిపోతున్నారు?

నాగ్‌పూర్‌లో మయో అనే హాస్పిటల్ నుంచి మార్చి 14న నలుగురు కరోనావైరస్ అనుమానిత రోగులు పారిపోయారు. పోలీసులు వాళ్లను వెంటనే వెతికి పట్టుకుని, వెనక్కి తీసుకువచ్చారు. ఆ తర్వాత పరీక్షల్లో వారికెవరికీ కరోనావైరస్ లేదని తేలింది. నాగ్‌పూర్‌లో మాత్రమే కాదు, తెలంగాణలోనూ ఇలా ఓ అనుమానిత రోగి పారిపోయిన ఘటన జరిగింది.

 
నిర్మల్‌లో కరోనా లక్షణాలు ఉన్న ఓ వ్యక్తి హాస్పిటల్ నుంచి పారిపోయారు. ఆ వ్యక్తిని హాస్పిటల్ సిబ్బంది పట్టుకుని చికిత్స కోసం హైదరాబాద్‌కి తరలించారు. బెంగళూరు, ఇండోనేసియా రాజధాని జకార్తాలోనూ ఈ తరహా ఘటనలు జరిగాయి. ఈ ఘటనలన్నీ కొన్ని ప్రశ్నలను రేకెత్తిస్తున్నాయి.

 
అసలు రోగులు ఆసుపత్రుల నుంచి ఎందుకు పారిపోతున్నారు? వైద్యం, ఔషధాలంటే వాళ్లు ఎందుకు భయపడుతున్నారు? వైద్యులను, సైకాలజిస్ట్‌లను బీబీసీ ఇవే ప్రశ్నలు అడిగింది. వాళ్లు ఏం చెప్పారో తెలుసుకునేముందు, నాగ్‌పూర్‌లో అసలేం జరిగిందో మనం తెలుసుకోవాలి.

 
నాగ్‌పూర్‌లో ఏం జరిగింది?
కరోనా వైరస్ సోకిన వ్యక్తి మయో ఆసుపత్రిలో ఉన్నాడని ఓ వదంతి వ్యాపించింది. దీంతో అక్కడున్న ఇతర రోగుల్లో ఆందోళన మొదలైంది. అవకాశం చిక్కగానే, ఆ నలుగురు కరోనా వైరస్ అనుమానిత రోగులు వాళ్ల వార్డు నుంచి పారిపోయారు. టాయిలెట్‌కు వెళ్తున్నామని చెప్పి, వాళ్లు పారిపోయినట్లు ఆసుపత్రి వర్గాలు పోలీసులకు తెలిపాయి.

 
ఆ రోగులను పోలీసులు వాళ్ల వాళ్ల ఇళ్లలోనే గుర్తించారు. ఈ ఘటన తర్వాత ఆ వార్డుకు పోలీసు గస్తీ ఏర్పాటు చేశారు. తర్వాత వచ్చిన నివేదికలో ఆ నలుగురు అనుమానిత రోగులకు కరోనావైరస్ లేదని తేలడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

 
ఎందుకు పారిపోతున్నారు?
తమకు తగినంత సమాచారం ఇవ్వడం లేదన్న ఆందోళన ఆసుపత్రుల్లో చేరినవారిలో ఉంటోందని వైద్య నిపుణులు అంటున్నారు. కరోనా వైరస్ గురించి కొత్త కొత్త సమాచారం బయటకురావడం, అంకెలు రోజురోజుకీ మారుతుండటం వల్ల వాళ్లు బాగా ఆందోళన చెందుతున్నారని అక్షత భట్ అనే సైకాలజిస్ట్ అభిప్రాయపడ్డారు.

 
కరోనా వైరస్ పరీక్షల కోసం ఆసుపత్రులకు తీసుకువస్తున్న వ్యక్తులు పారిపోవడానికి ప్రధానంగా మూడు కారణాలున్నాయని అక్షత చెబుతున్నారు. అవి... తమ వివరాలు బయటకు వస్తాయన్న భయం వారికి ఉంటుంది. వేరే వారు తమపై దాడులు చేయొచ్చని భయపడతారు. కరోనావైరస్ సోకినట్లు తేలితే, తమ కుటుంబాల నుంచి దూరం కావాల్సి వస్తుందని ఆందోళనకు గురవుతుంటారు.

 
కరోనావైరస్ ఇన్ఫెక్షన్‌కు ఔషధాలు లేవు కాబట్టి తమపై ప్రయోగాలు జరుగుతాయేమోనన్న సందేహం వారికి ఉంటుంది. ''వైద్యులు సూచిస్తే తప్పకుండా పరీక్షలు చేయించుకోవాలి. ఎందుకంటే, మీ కారణంగా వేరేవాళ్లు ఇన్ఫెక్షన్ బారినపడొచ్చు. ఇతరుల గురించి కూడా ఆలోచించాలి. పరీక్ష చేయించుకుంటే, మనకున్న భయం కూడా పోతుంది'' అని అక్షత భట్ అన్నారు.

 
క్వారంటైన్‌ గురించి ప్రజలకు అవగాహన అవసరం
ప్రజల్లో ఆందోళనకు ప్రభుత్వం కూడా కొంత వరకూ కారణమని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ మహారాష్ట్ర విభాగం అధ్యక్షుడు అవినాశ్ భోండ్వే అన్నారు.

 
''క్వారంటైన్‌ అంటే ఏంటి? అక్కడం ఏం చేస్తారు? ప్రాణాలు కాపాడుకునేందుకు అది ఎంత ముఖ్యం? వీటన్నింటినీ ప్రజలకు తెలియజేయడంలో ప్రభుత్వం విఫలమైంది. ప్రాణాలకు ప్రమాదం ఉన్నందుకే వారిని విడిగా ఉంచుతున్నామని వాళ్లకు విడమర్చి చెప్పాలి'' అని ఆయన అభిప్రాయపడ్డారు. మహారాష్ట్ర వైద్య మంత్రి రాజేశ్ టోపే మాత్రం ఈ వ్యాఖ్యలతో విభేదించారు.

 
''కరోనా వైరస్ గురించి ప్రజలకు సమాచారం ఇవ్వడంలో ప్రభుత్వం ఎక్కడా విఫలం కాలేదు. క్వారంటైన్‌లో ఉంచిన ప్రజలకు అన్ని వసతులూ అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది'' అని ఆయన అన్నారు. ''ఆసుపత్రుల నుంచి పారిపోతున్న వ్యక్తులు తాము పూర్తి ఆరోగ్యంతో ఉన్నామని అనుకుంటున్నారు. అయితే, లక్షణాలేవీ బయటికి కనిపించకపోయినా, వారికి ఇన్ఫెక్షన్ ఉండొచ్చు. ప్రభుత్వం వారిని అక్కడ ఊరికే ఉంచట్లేదన్న విషయం గుర్తించాలి'' అని ఆయన అన్నారు.

 
క్వారంటైన్‌లో ఉండటం విసుగ్గా అనిపించవచ్చని, కానీ ప్రభుత్వం వారికి అన్ని సదుపాయాలూ కల్పిస్తోందని టోపే అన్నారు. ''అనుమానిత రోగులకు టీవీ, దినపత్రికలు, ఆహారం లాంటి అన్ని సదుపాయాలూ అందేలా చూస్తున్నాం. మా మాట వినకుండా, పారిపోదామని ప్రయత్నించేవారిని అడ్డుకునేందుకు భద్రత కూడా ఏర్పాటు చేస్తున్నాం'' అని ఆయన చెప్పారు.