శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఐవీఆర్
Last Modified: మంగళవారం, 17 మార్చి 2020 (15:15 IST)

కరోనా వైరస్ దాచిపెట్టినట్లు తేలితే 6 నెలలు జైలు శిక్ష, ఎక్కడ?

కరోనా వైరస్ ఇపుడు ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. ఆర్థిక స్థితిని కుంగదీస్తోంది. స్వేచ్ఛగా మనిషి బయట తిరగలేని పరిస్థితిని తీసుకొచ్చింది. ఇంటికే పరిమితం చేస్తోంది. ఈ నేపధ్యంలో ఈ వైరస్‌తో ప్రపంచ దేశాలన్నీ యుద్ధం చేస్తున్నాయి. కరోనా వైరస్ మహమ్మారిని నియంత్రించేందుకు ప్రపంచ దేశాలన్నీ శాయశక్తులా ప్రయత్నిస్తున్నాయి. 
 
కరోనా వైరస్‌కు అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తున్నా, కొంతమంది ప్రజల నుంచి సరైన స్పందన రావడంలేదు. వ్యాధి వున్నదని తెలిసినా కొందరు తన స్నేహితులు, బంధువులు, థియేటర్లు, పెళ్లిళ్ల ఫంక్షన్లు.. ఇలా ఎక్కడికిబడితే అక్కడికి వెళ్లి ఇతరులకు కూడా అంటించి వస్తున్నారు. దీనితో కరోనా వైరస్ బాధితుల సంఖ్య రాత్రికి రాత్రే పెరిగిపోతూ వస్తోంది. 
 
కరోనా వైరస్ కట్టడి కోసం పలు దేశాలు కఠినమైన చర్యలు తీసుకుంటున్నాయి. శ్రీలంక సంచలన నిర్ణయం తీసుకుంది. ఎవరికైనా కరోనా లక్షణాలు ఉండి వాటిని దాచిపెట్టినట్లు తేలితే అటువంటి వారికి 6 నెలల జైలు శిక్ష పడుతుందని మార్చి 16న శ్రీలంకకు చెందిన ఓ సీనియర్ పోలీస్ అధికారి వార్నింగ్ ఇచ్చారు.
 
వైరస్ అంటించుకుని విదేశాల నుంచి వచ్చినవారితో తీవ్ర సమస్య ఎదురవుతోందనీ, క్వారంటైన్(నిర్బంధం) కేంద్రాలకు వెళ్లమంటే ససేమిరా అంటున్నారనీ, ఇలాంటి వారి వల్ల కరోనా వైరస్ బాధితుల సంఖ్య పెరుగుతోందని ఆయన చెప్పారు. అందువల్ల వైరస్ వున్నదని తేలితే వెంటనే క్వారంటైన్ కేంద్రాలకు వెళ్లాలనీ, లేదంటే వారిని అరెస్టు చేస్తామని తెలిపారు. కాగా శ్రీలంకలో ఇప్పటివరకూ 18 మందికి కరోనా పాజిటివ్ అని తేలింది.