శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Modified: మంగళవారం, 17 మార్చి 2020 (13:30 IST)

కరోనా వైరస్ వ్యాక్సీన్‌ అభివృద్ధిలో ముందడుగు, ఓ మహిళకు ప్రయోగాత్మకంగా ఇంజెక్ట్ చేసిన శాస్త్రవేత్తలు

కరోనా వ్యాక్సిన్
ప్రపంచవ్యాప్తంగా కరోనావైరస్ కేసుల సంఖ్య పెరుగుతుండడంతో దీనికి వ్యాక్సీన్ తయారీ ప్రయత్నాలు కూడా వేగవంతం అయ్యాయి. అమెరికాలోని పరిశోధకులు ప్రయోగాత్మక కరోనావైరస్ వ్యాక్సీన్‌ తొలి షాట్‌ను ఓ వ్యక్తికి ఇచ్చారు. ప్రపంచం అంతా ఉత్సుకతతో ఎదురుచూస్తున్న, వేగంగా అభివృద్ధి చేసిన కరోనావైరస్ టీకా మొదటి దశ అధ్యయనం ప్రారంభమైందని సీటిల్‌లోని కైజర్ పర్మనెంటె వాషింగ్టన్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ శాస్త్రవేత్తలు తెలిపినట్లు ఏపీ వార్త సంస్థ వెల్లడించింది.

 
ఓ పరీక్షా గదిలో 43ఏళ్ల జెన్నిఫర్ హాలర్ అనే మహిళ ఈ తొలి ఇంజెక్షన్ తీసుకున్నారు. జెన్నిఫర్ ఓ టెక్ కంపెనీలో ఆపరేషన్స్ మేనేజర్‌గా పనిచేస్తున్నారు. ఈ సమాజానికి ఉపయోగపడే పని చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందని, ఇదో అద్భుత అవకాశమని ఇద్దరు బిడ్డల తల్లైన హాలర్ అన్నారు.

 
ఎంఆర్ఎన్ఏ-1273 అని పిలుస్తున్న ఈ ప్రయోగాత్మక వ్యాక్సీన్‌ను నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ (ఎన్ఐహెచ్), మసాచుసెట్స్‌కు చెందిన బయోటెక్నాలజీ కంపెనీ మోడర్నా ఇంక్ సంయుక్తంగా రూపొందించాయి. "కరోనావైరస్‌ను ఎదుర్కోవడానికి మనందరం కలిసి పనిచేయాలి. ఆ అత్యవసర పరిస్థితిని ఎదుర్కొనేందుకు అందరూ తమ వంతు బాధ్యత నిర్వహించాలి" అని కైజర్ పెర్మనెంటె అధ్యయనానికి నేతృత్వం వహించిన డాక్టర్ లిసా జాక్సన్ అన్నారు.

 
అమెరికా ఆర్థిక వ్యవస్థ సంక్షోభం దిశగా పయనిస్తున్నట్లుందని అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. చైనాలో పుట్టి, ప్రబలిన కరోనావైరస్ దీనికి కారణం అని ఆయన అభిప్రాయపడ్డారు. "చూస్తుంటే అలానే ఉంది, స్టాక్ మార్కెట్‌లో, ఆర్థిక వ్యవస్థలో తీవ్రమైన డిమాండ్ నెలకొని ఉంది. దీన్ని అధిగమించగలిగితే, అనూహ్య మార్పులు చూడొచ్చు" అని ఓ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ట్రంప్ అన్నారు.

 
అమెరికా ఆర్థిక వ్యవస్థ సంక్షోభం దిశగా వెళ్తోందా అని అడిగిన ప్రశ్నకు ఆయన ఇలా సమాధానం ఇచ్చారు. కరోనా వ్యాప్తిని నియంత్రించేందుకు రెస్టారెంట్లు, ఇతర వ్యాపార సముదాయాలను మూసి ఉంచారు. ఈ చర్యల వల్ల నిరుద్యోగం పెరుగుతుందని, వినియోగదారుల కొనుగోళ్లు తగ్గాయని, దీనివల్ల ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడుతుందని ఆర్థికవేత్తలు అభిప్రాయపడుతున్నారు.

 
డౌజోన్స్ సోమవారం 3000 పాయింట్లు నష్టపోయింది. అమెరికా స్టాక్ మార్కెట్ చరిత్రలోనే భారీ నష్టాల్లో ఇదొకటి. 21 ఏళ్ల స్పానిష్ ఫుట్‌బాల్ కోచ్ ఫ్రాన్సిస్కో గార్షియా కరోనా వైరస్‌తో మరణించారు. అథ్లెటికో పోర్టాడా అల్టా యువ జట్టుకు 2016 నుంచి ఫ్రాన్సిస్కో మేనేజర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ దేశంలో కరోనావైరస్ బారినపడిన అత్యంత పిన్నవయస్కుడు ఈయనే.

 
"మా కోచ్ ఫ్రాన్సిస్కో మృతిపై ఆయన కుటుంబానికి, స్నేహితులకు మా సంతాపం వ్యక్తం చేస్తున్నాం. ఫ్రాన్సిస్కో, మీరు లేకుండా మేం ఇప్పుడు ఏం చేయాలి? మాకు ఎప్పుడు అవసరమైనా మీరు మా వెంట నిలబడ్డారు. మేం ఇప్పుడు మిగిలిన పనిని ఎలా పూర్తిచేయాలి? ఎలా చేయగలమో మాకు తెలియదు, కానీ మీకోసం మేం సాధిస్తాం. మిమ్మల్ని ఎప్పటికీ మర్చిపోలేం" అని అథ్లెటికో పోర్టాడా అల్టా ఓ ప్రకటనలో తెలిపింది.

 
పాకిస్తాన్‌లో కరోనావైరస్ కేసులు 183కు చేరుకున్నాయి. సోమవారం సింధ్ ప్రాంతంలో 115, ఖైబర్ పక్తుంఖ్వాలో 15 కొత్త కేసులు నమోదయ్యాయి. పాకిస్తాన్‌లో ఒకరోజులో ఇన్ని కేసులు పాజిటివ్ రావడం ఇదే మొదటిసారి. టఫ్తాన్ సరిహద్దుల నుంచి యాత్రికులను వెనక్కి తీసుకురావడమే కేసుల సంఖ్యలో పెరుగుదలకు కారణమైందని సింధ్ అధికారులు వెల్లడించారు.