గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Modified: మంగళవారం, 23 ఆగస్టు 2022 (20:06 IST)

జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తారా రారా? వస్తే బీజెపీలో చేరతారా లేదా - అభిప్రాయం

ntr - amit shah
జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తారా రారా? వస్తే బీజేపీలో చేరతారా లేదా? కేవలం క్యాంపెయిన్ చేస్తారా లేక తెరవెనక నుంచే కథ నడిపిస్తారా? లేక చివరిదాకా ఊరించి రజనీకాంత్‌లాగ నీరుగారిపోతారా? ఎవరూ ఊహించలేకపోతున్నారు. మొత్తానికి ఇంత పెద్ద ప్రశ్నార్థకం తెలుగు వాళ్ల ముందు ఈ మధ్య ప్రత్యక్షం కాలేదు. కేంద్ర మంత్రి అమిత్ షా హైదరాబాద్‌లో దిగిందే తడవు ఆత్రంగా ఆలయానికి వెళ్లి ఆమ్మవారికి చేసిన పూజలకూ పబ్లిసిటీ రాలేదు. భారీ కాన్వాయ్‌తో హైదరాబాద్ నుంచి మునుగోడు వెళ్లి, అరగంట పాటు కేసీఆర్‌ను, ఆయన కుటుంబపాలనను, కేసీఆర్ మర్చిపోయిన హామీలను ఒకటొకటే వల్లేవస్తూ ఉపన్యాసం ఇచ్చినా, రోటీన్ కవరేజ్ మించిన విశేషం లేదు, విశ్లేషణా లేదు.

 
అమిత్ షా రాకకు కారణమమయిన కోమటి రాజగోపాల్ రెడ్డిని, ఆయన కాషాయ కండువాను కూడా పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు. చివరకు మీడియా బాద్షా 'ఈనాడు' రామోజీ రావుతో ఆయన జరిపిన సమావేశం కూడా అంత పెద్ద సౌండ్ ఇవ్వలేదు. జూనియర్ ఎన్టీఆర్‌తో ఏకాంతంగా అమిత్ షా జరిపిన చిన్న భోజన సమావేశం మాత్రం పెద్ద హాట్ టాపిక్ అయింది. తెలుగు రాష్ట్ర రాజకీయాలలో ఉత్కంఠ భరితమయిన సన్నివేశాలు ఎదురుకాక చాలా సంవత్సరాలయింది. గెలుపు ఓటములు, అఖండ విజయాలు, దారుణ పరాజయాలు , తిట్లూ, చీత్కారాలు తప్ప మరొక విశేషం కనిపించడం లేదు. తెలుగు రాజకీయాలు ఒకవిధంగా స్తబ్దుగా ఉన్నాయి. అవే ముఖాలు, అవే పాత్రలు, అవే థీములు, అవే కుట్రలు, అవే కుతంత్రాలు... మళ్లీ మళ్లీ వచ్చేందుకు సిద్ధమవుతున్నాయి. ఏ ఒక్కరూ ఒక కొత్తదనం తీసుకురాలేకపోయారు. అందుకే ఒక కొత్త నటుడు ప్రవేశం చేయాల్సిన అవసరం ఉందని రెండు రోజులుగా సాగుతున్న చర్చ చెబుతుంది.

 
తెలుగు నాట కొత్తగా ఒక వెండితెర నటుడు కావాలని బీజేపీ నిజంగా భావిస్తూ ఉంది. పవన్ కల్యాణ్‌తో బీజేపీ స్నేహం ఎటుపోతోందో తెలియడంలేదు. రాజకీయ ప్రేక్షకులు కూడా కొత్తదనం కోరుకుంటున్నారు. కుటుంబ పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నామని చెప్పే బీజేపీ ఒక కుటుంబాన్ని వాడుకునేందుకు ఏ మాత్రం వెనకాడకపోయేందుకు కారణం, జూనియర్ ఎన్టీఆర్‌ కొత్తదనం తెస్తాడనే. దీనికి కారణం, పార్టీ అధినేత చంద్రబాబు నాయుడి కుమారుడు లోకేష్, వాళ్ల అంచనాలకు తగ్గట్టు నేతగా పరివర్తన చెందలేక పోవడమే. జూనియర్ ఎన్టీఆర్ మీద తెలుగు దేశం పార్టీ నేతల్లో చాలా మంచి కాన్ఫిడెన్స్ ఉంది. నిజానికి ఆయన్ని బీజేపీ ఎగరేసుకుపోతుందనే భయం కూడా కొందరు వ్యక్తం చేశారు. చంద్రబాబు మేల్కోవాలని కూడా భావిస్తున్నారు.

 
అటువైపు, జూనియర్ ఎన్టీఆర్ కూడా హుందాగా ఉంటూ వస్తున్నారు. ఎన్టీఆర్ నటనా వారసత్వాన్ని బల్లగుద్ది చాటుకున్నా, రాజకీయ వారసత్వం విషయంలో ఆయన చాలా అణకువతో, మెలకువతో ఉన్నారు. ఒక్క మాట మాట్లాడరు. ఒక్క ఆకాంక్ష వెల్లడించరు. అసలు తాను రాజకీయ ప్రపంచంలో లేనట్టే ఉంటున్నారు. ఇదే జూనియర్ ఎన్టీఆర్ ప్రత్యేక ఆకర్షణ. నాలుగు కాసులు వెనకేసుకున్న ప్రతివ్యక్తీ రాజకీయాల్లోకి చొరబడేందుకు కుప్పి గంతులు వేస్తున్న ఈ రోజుల్లో సోషల్ క్యాపిటల్ సమృద్ధిగా ఉన్న ఎన్టీఆర్ ఎప్పుడూ అలాంటి అనుమానం కూడా రానీయలేదు. ఆయన తెలుగుదేశం పార్టీకి ఎందుకు దూరంగా ఉంటున్నారో అందరికీ తెలుసు.

 
"తెలుగుదేశం పార్టీలోకి ఇపుడు ఆయన్ని తీసుకోవడం కష్టం. ఇదెపుడో జరగాల్సి ఉండింది. ప్రాంతీయ పార్టీలలో, పార్టీ ఎవరి చేతిలో ఉంటుందో ఆయనే ఎవరు రాజకీయాల్లో ఉండాలో నిర్ణయిస్తాడు. మా పార్టీ కూడా ఇంతే. తెలుగుదేశం పార్టీలో జూనియర్‌కు కీలక పాత్ర రావడం సాధ్యం కాదు" అని టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఒకరు వ్యాఖ్యానించారు. 2009లో వైఎస్‌ఆర్ వేవ్ సమయంలో జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీకి సహకరించేందుకు రంగంలోకి వచ్చారు. ఆయన క్యాంపెయిన్ తీరు, ఉపన్యాస ధోరణి ఆకట్టుకున్నాయి. ఖాకీ డ్రెస్ వేసుకుని చైతన్యరథం ఎక్కి ఆయన చేసిన క్యాంపెయిన్‌లో చాలామంది 'తాత ఎన్టీఆర్'ను చూశారు.

 
ఆయన క్యాంపెయిన్ శ్రీకాకుళం నుంచి తీరప్రాంతమంతా సాగింది. తెలుగుదేశం కార్యకర్తల్లో ఉత్సాహం నింపింది, ఫ్యాన్స్‌ని రాజకీయాల వైపు మళ్లించింది. మొత్తానికి రాష్ట్రంలో బాగా రాజకీయ కదలిక తీసుకువచ్చింది. అప్పుడే మెగాస్టార్ చిరంజీవి 'ప్రజారాజ్యం' కూడా ఏర్పడింది. బలమైన కాంగ్రెస్‌ను, కొత్త 'ప్రజారాజ్యం' ఉన్నా, టీడీపీ వైపు కూడా జనం చూసేలా చేసింది. దీనితో తెలుగుదేశం చేతులు మారుతుందనే ఊహాగానాలు కూడా మొదలయ్యాయి. ఆయన 'ప్రచార రథం' ప్రమాదానికి గురయినా, పడక మీది నుంచే ఆయన ప్రచారం చేశారు. తర్వాత ఉన్నట్లుండి ఆయన ప్రచారం ఆగిపోయింది. గుడివాడ అసెంబ్లీ సీటు విషయంలో వివాదమొచ్చి ఆయన క్యాంపెయిన్ మానేశాడని చెబుతారు. కాదు, డాక్టర్ల సలహా మేరకు మానేశారని మరికొందరు చెబుతారు. మొత్తానికి అదే ఆఖరుసారి. మళ్లీ రాజకీయాల్లో కనిపించలేదు. కాకపోతే, అవకాశం దొరికినపుడల్లా పత్రికలు ఊహాగానాలు వినిపిస్తూనే ఉన్నాయి.

 
చంద్రబాబు నాయుడి తరఫున 2014 ఎన్నికల్లో క్యాంపెయిన్ చేస్తారని ప్రచారం జరిగింది. తర్వాత కూడా ఆయన రాజకీయాల్లోకి వస్తారని లేదా చంద్రబాబు నాయుడు తీసుకువస్తారని మీడియా రాస్తూనే ఉంది. ఆయన వచ్చింది లేదు, మరొకరు ఆయన తెచ్చింది లేదు. ఇదే విధంగా, ఆయన కూడా తాను రాజకీయాల్లోకి వస్తాననిగానీ రాననిగానీ స్పష్టంగా అనలేదు. వస్తే రావచ్చు, లేదా లేకపోవచ్చు అనే ధోరణిలోనే కామెంట్స్ చేశారు. తెలుగుదేశం పార్టీలో ఉన్నాననిగానీ, లేననిగానీ చెప్పలేదు. రెండు వైపులనుంచి సస్పెన్స్ కొనసాగిస్తున్నారు. అదొక పెద్ద రాజకీయ వ్యూహం. ప్రాంతీయ పార్టీ తరహా కుటుంబ రాజకీయాలకు ఆయన బలయ్యాడని చాలామంది చెబుతారు. ఆయన్ను మళ్లీ తెలుగుదేశం పార్టీ నాయకత్వ స్థాయిలో చూడటం సాధ్యం కాకపోవచ్చేమో. ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో జూనియర్ ఎన్టీఆర్ సమావేశమయ్యారు. అందుకే రచ్చ.

 
తాజా పరిణామాలు
బ్లాక్ బస్టర్, పాన్ ఇండియా మూవీ 'ఆర్ఆర్ఆర్'ను చూసి ఎన్టీఆర్‌ను అమిత్ షా ప్రశంసించకుండా ఉండలేకపోతున్నారని, అందుకే ఆయన్ని కలవాలని కబురు చేశారని, దానికి ఎన్టీయార్ సమ్మతించారని బీజేపీ, మీడియాకు సమాచారం అందించింది. ఇదే నిజమయితే, మరి ఈ సినిమా సక్సెస్ వెనక చాలా మంది హేమాహేమీలున్నారు. తెరమీది రామ్ చరణ్‌ని మర్చిపోతే ఎలా? అమిత్ షా కళాభిమాని అని, ఆయన ఎక్కడకి వెళ్లినా కళాకారులను కలుస్తుంటారని, అందులో భాగమే ఈ సమావేశమని బీజేపీ తెలంగాణ ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి చెప్పారు. ఇందులో రాజకీయమేదీ లేదని అంటూనే, అనువైన సమయంలో అన్ని విషయాలు బయటకొస్తాయని ఆయన ట్విస్ట్ ఇచ్చారు. అయితే, మరొక సీనియర్ నాయకుడు మాత్రం రామచరణ్‌ని కూడా అమిత్ షా కలుసుకోవాలనుకున్నారని, రామచరణ్ అందుబాటులో లేరని చెప్పారు.

 
తెలంగాణ బీజేపీ నేతలెవరూ ’ఒక కళాకారుడితో ఒక కళాభిమాని సమావేశం’ అనేదాని కంటే మరొక మాట బహింరంగంగా చెప్పేందుకు సిద్ధంగా లేరు. అయితే, ఆంధ్రప్రదేశ్ బీజేపీ ప్రధాన కార్యదర్శి ఎస్.విష్ణువర్ధన్ రెడ్డి మాత్రం ఇది రాజకీయ సమావేశమే అన్నారు. కానీ, ఎలాంటి రాజకీయ సమావేశమో ఆయన చెప్పలేదు. "ఎన్టీఆర్ కుటుంబం, 2009లో క్యాంపెయిన్ చేసిన అనుభవం, మంచి వాగ్ధాటి ఉన్న జూనియర్ ఎన్టీఆర్ గురించి బీజేపీకి బాగా తెలుసు. దానికి తోడు తాను రాజకీయాలకు వ్యతిరేకమని జూనియర్ చెప్పలేదు, మనమూ చెప్పలేం. ఆయన మౌనంగా ఉన్నంత మాత్రాన రాజకీయాల్లోకి రారని అర్థం కాదు. రాజకీయాలకు దూరంగా ఉండాలనుకుంటే, ఈ సమావేశానికి వచ్చి ఉండే వారే కాదు. సమావేశానికి వచ్చారంటే ఆయన మోదీ విధానాలను ఆమోదిస్తున్నట్లే లెక్క. ఈ సమావేశంలో కచ్చితంగా జూనియర్ ఎన్టీఆర్‌కు ఒక సందేశం అందే ఉంటుంది. కాబట్టి రాజకీయ ప్రవేశం మీద ఆయన కచ్చితంగా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది" అని విష్ణువర్దన్ రెడ్డి అన్నారు.
 

ఈ హాట్ హాట్ చర్చల్లో ఒక వీడియో క్లిప్ వైరల్ అయింది. అది, ఆంధ్రప్రదేశ మాజీ మంత్రి కొడాలి నానిది. అమిత్ షా-జూనియర్ ఎన్టీఆర్‌లది రాజకీయ సమావేశం కాకపోతే, టైం పాస్ సమావేశమెలా అవుతుందని ఆయన అన్నారు. "అమిత్ షా, ప్రధానిమోదీ వంటి నేతలు ఒక క్షణం కూడా రాజకీయాలను వదిలి పని చేయడమనేది ఉండదు. పార్టీని ఎలా విస్తరించాలనే ధ్యాస తప్ప మరొక ఆలోచన ఉండదు. ఆర్ఆర్ఆర్ సినిమా బాగుంది, స్వీట్లు బాగున్నాయని చెప్పుకునేందుకు అమిత్ షా జూనియర్ ఎన్టీఆర్‌ను కలవరు. ఏం మాట్లాడారో బయటకు రాదుగానీ, ఇది రాజకీయ సమావేశమే" అని నాని అన్నారు.

 
కాగా, టీడీపీ ఒక్కటే భిన్నంగా, సాత్వికంగా స్పందించింది. అమిత్ షా-జూనియర్ ఎన్టీఆర్ సమావేశాన్ని 'అబ్బే ఏముంది అందులో.. అమిత్ షా, ఆర్ఆర్ఆర్ మీద లేటుగా స్పందించా’రన్నట్లు పార్టీ నేత బుద్ధా వెంకన్న అమాయకత్వం నటించారు. "మీటింగ్‌లో ఏముంది, కలిస్తే తప్పేముంది. సినిమా బాగుందని చంద్రబాబు ఎప్పుడో స్పందించారు. లోకేష్ బాబు ట్వీట్ చేశారు. ప్రజలంతా జూనియర్ నటనని ప్రశంసించారు. ఇదీ అంతే" అన్నారాయన. అయితే, రాజకీయ వ్యాఖ్యాత తెలకపల్లి రవి మాత్రం "ఎవరెన్ని చెప్పినా, బీజేపీ అనుకున్నది సాధించింది. రెండు రోజులుగా అమిత్ షా-జూనియర్ ఎన్టీఆర్ సమావేశం గురించి పండితులు, పామరులు చర్చిస్తున్నారు. బీజేపీకి కావలసిందదే. జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావచ్చు, రాకపోవచ్చు. ఇపుడయితే చిన్న సమావేశంతో బీజేపీ పెద్ద మైలేజీ కొట్టేసింది. ఎవరైనా ఎలాంటి మెసేజ్ అయినా తీసుకోవచ్చు. బీజేపీ ఇలాంటి వ్యూహాలలో ఆరి తేరిన పార్టీ. ఏదో జరుగుతున్నదన్నట్లు ప్రత్యర్థుల్లో దడ పుట్టించింది" అని బీబీసీతో అన్నారు.

 
మొత్తానికి మునుగోడులో ఏమవుతుందోగాని, కేంద్ర మంత్రి అమిత్ షా.. ప్రత్యర్థులకు, పార్టీ శ్రేణులకు, కమ్మవారికి, ఫాన్స్‌కి, తెలుగుదేశం నేతలకు, ఆ పార్టీ వ్యతిరేకులకు, వైసీపీ, టీఆర్‌ఎస్‌కు తనదైన భాషలో సందేశం పంపించారు. ఎవరికి తోచినట్లు వాళ్లు దానిని అనువాదం చేసుకోవచ్చు.