శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By
Last Updated : శనివారం, 15 జూన్ 2019 (17:22 IST)

ప్రపంచ కప్ 2019, భారత్-పాక్ మ్యాచ్ రోజున వర్షం పడితే ఏంటి పరిస్థితి?

2019 క్రికెట్ ప్రపంచకప్‌లో వర్షానికి కూడా పాయింట్స్ ఇస్తే, ఇప్పుడు టేబుల్‌లో అదే మొదటి స్థానంలో ఉంటుంది. ఏకంగా నాలుగు మ్యాచుల్లో వర్షానిదే ఆధిపత్యం. వర్షం వల్ల మూడు మ్యాచుల్లో ఒక్క బంతి కూడా పడకుండానే ఆట ఆగిపోతే, మరో మ్యాచ్ ఆట మొదలయ్యాక 7.3 ఓవర్ల దగ్గర ఆగిపోయింది. వీటన్నింట్లో భారత అభిమానుల్ని ఎక్కువగా కలవర పెట్టింది మాత్రం భారత్- న్యూజీల్యాండ్ మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దవడమే.

 
నిజానికి ఆ మ్యాచ్‌ ఆగిపోవడానికి వర్షం సగం కారణమైతే, మైదానం సిబ్బంది నిర్లక్ష్యం సగం కారణమని గంభీర్, గంగూలీ లాంటి వాళ్లు అభిప్రాయపడ్డారు. మైదానాన్ని పూర్తిగా కవర్లతో కప్పి ఉంటే, వర్షం ఎక్కువసేపు పడలేదు కాబట్టి మ్యాచ్ జరిగే అవకాశం ఉండేదని వాళ్లు అన్నారు. ఈ నేపథ్యంలో ఐసీసీ నియమాలపైనే చర్చ మొదలైంది.
 
ఎలాంటి సందర్భాల్లో మ్యాచ్‌ను పూర్తిగా రద్దు చేయొచ్చు?
క్రికెట్ రూల్స్ బుక్ ప్రకారం చూస్తే మ్యాచ్ నిర్వహణకు ఏమాత్రం అవకాశం లేని పరిస్థితుల్లో మాత్రమే మ్యాచ్‌ను రద్దు చేయాలి. ఒక వన్డే మ్యాచ్ నిర్వహణ కోసం అధికారికంగా 8 గంటలు కేటాయిస్తారు. ఆ గేమ్ టైంలోగా పరిస్థితులు అనుకూలిస్తే మ్యాచ్‌ను నిర్వహించొచ్చు. ఉదాహరణకు ఇంగ్లండ్‌లో చాలా మ్యాచ్‌లు ఉదయం 10.30 నుంచి 6.30 మధ్యలో జరుగుతున్నాయి. ఒకవేళ మ్యాచ్ మధ్యలో వర్షం పడితే, ఆ మ్యాచ్‌ని ఆపాలా వద్దా అన్న నిర్ణయాన్ని అంపైర్లు సాయంత్రం 6.30 వరకు ఎదురు చూసి తీసుకోవచ్చు.

 
వర్షం పడి ఆగాక పరిస్థితులు అనుకూలంగా ఉంటే గేమ్‌ టైం ముగిసినా కూడా మరో 75 నిమిషాలు ఆటను పొడిగించొచ్చు. కొన్ని సందర్భాల్లో షెడ్యూల్ చేసిన సమయం కంటే రెండున్నర గంటల సేపు ఎక్కువగా కూడా రిఫరీ మ్యాచ్‌ను ఆడించొచ్చు. ఇంతకుముందు జరిగిన అన్ని ప్రపంచ కప్‌లలో కలిపి ఇప్పటిదాకా 9 మ్యాచ్‌లే వర్షం కారణంగా రద్దయ్యాయి. కానీ, 2019 వరల్డ్ కప్‌లో ఇప్పటికే నాలుగు మ్యాచ్‌లు వర్షం వల్ల ఆగిపోయాయి.
 
రిజర్వ్ డే ఎందుకు లేదు?
ఈ ప్రపంచ కప్‌లో గ్రూప్ మ్యాచ్‌లకు రిజర్వ్ డే ను కేటాయించకపోవడంపై ఐసీసీ విమర్శలను ఎదుర్కొంటోంది. దానిపై ఐసీసీ చీఫ్ డేవ్ రిచర్డ్‌సన్ మాట్లాడుతూ వర్షం వల్ల రద్దయిన ప్రతి మ్యాచ్‌కూ రిజర్వ్ డేను కేటాయించడం ప్రాక్టికల్‌గా సాధ్యం కాదని, దాని వల్ల టోర్నమెంట్ నిర్వహించే వ్యవధి, వ్యయం అన్నీ పెరిగిపోతాయని చెప్పారు. ఇప్పుడు గ్రూప్ మ్యాచుల్లో సెకండ్ ఇన్నింగ్స్ మొదలయ్యే లోపే మ్యాచ్ ఆగిపోతే దాన్ని డ్రాగా ప్రకటిస్తారు. అదే రెండో ఇన్నింగ్స్‌లో ఆగిపోతే డక్ వర్త్ లూయిస్ పద్ధతిలో విజేతను నిర్ణయిస్తారు.

 
కానీ, సెమీ ఫైనల్స్, ఫైనల్స్‌కు మాత్రం రిజర్వ్ డే ఉంది. అంటే, మ్యాచ్ వర్షం వల్ల రద్దయితే మరో రోజున మ్యాచ్ నిర్వహిస్తారు. ఒక వేళ సెమీఫైనల్ రిజర్వ్ డే రోజున కూడా వర్షం వల్ల ఆట ఆగిపోతే, గ్రూప్‌ స్టేజీలో ఎక్కువ పాయింట్లు ఉన్న జట్టు ఫైనల్‌కు వెళ్తుంది. ఒకవేళ ఫైనల్స్ కూడా రిజర్వ్ డే రోజున రద్దయితే, రెండు జట్లను సంయుక్త విజేతలుగా ప్రకటిస్తారు.
 
ప్రత్యామ్నాయ మార్గాలేంటి?
ఇండోర్ స్టేడియంల తరహాలో క్రికెట్ స్టేడియంపైన కూడా పూర్తిగా కవర్ చేసేలా పైకప్పును నిర్మించాలన్నది ఎక్కువగా వినిపించే సూచన. ఇంగ్లండ్‌లో కొన్ని టెన్నిస్ స్టేడియంలకు అలానే నిర్మించారు. కానీ, క్రికెట్ ప్రపంచ కప్ నిర్వహించే పదకొండు స్టేడియంలకు పై కప్పు నిర్మించడం అనేది ఆర్థికంగా తలకు మించిన భారమవుతుంది.

 
మైదానం మొత్తం కవర్లు పరచడం అనేది మరో సులువైన ప్రత్యామ్నాయం. దీని వల్ల స్టేడియంలో తడి ప్యాచ్‌లు ఏర్పడకుండా చూడొచ్చు. ఇలా చేస్తే వర్షం ఆగిపోయాక వేగంగా మ్యాచ్‌ను మొదలుపెట్టే అవకాశం ఉంటుంది. భారత్ న్యూజీలాండ్ మ్యాచ్ విషయంలో ఇలా చేయలేదు. దానివల్ల పిచ్ మినహా ఇతర ప్రాంతాల్లో మట్టి తడిచిపోయి మ్యాచ్ నిర్వహణ సాధ్యం కాలేదు. కానీ ఇలా గ్రౌండ్ మొత్తం కవర్లు వేయడానికి ఎక్కువమంది సిబ్బంది అవసరమవుతారు. శ్రీలంక, భారత్‌లోని కొన్ని స్టేడియంలు గతంలో ఇదే పద్ధతిని ఉపయోగించి మ్యాచ్‌లను విజయవంతంగా నిర్వహించాయి.

 
ఇంగ్లండ్‌లో మాత్రం ఇలా పూర్తిగా కవర్లు పరచడంపై నిషేధం ఉంది. అలా కవర్లతో స్టేడియంను కప్పడం వల్ల పిచ్ మందగిస్తుందని, బ్యాటింగ్‌కు కష్టంగా మారుతుందని ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు భావిస్తోంది. జూన్ 16న భారత్ - పాకిస్తాన్ జట్ల మధ్య జరగబోయే మ్యచ్‌కు కూడా వర్షం ముప్పు పొంచే ఉంది. ప్రపంచ వ్యాప్తంగా సుమారు వంద కోట్ల మంది చూస్తారన్న అంచనాలున్న ఆ మ్యాచ్‌ కూడా వర్షం బారిన పడితే అభిమానులకు నిరుత్సాహంతో పాటు ఐసీసీకి ఆర్థికంగానూ నష్టం తప్పకపోవచ్చు.