గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఠాగూర్

నాసిక రకం ప్రెజర్ కుక్కర్లు : అమెజాన్‌కు అపరాధం

Amazon
బీఎస్ఐ ప్రమాణాలకు తగినట్టుగా లేని ప్రెజర్ కుక్కర్లను విక్రయించినందుకు ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్‌కు కేంద్ర వినియోగదారు పరిరక్షణ ప్రాధికార సంస్థ (సీసీపీఏ) లక్ష రూపాయల అపరాధం విధించింది. 
 
అలాగే, ఈ కుక్కర్లను కొనుగోలు చేసిన 2,265 మంది వినియోగదారుల నుంచి వాటిని వెనక్కి తీసుకుని, వారికి డబ్బులు తిరిగి ఇచ్చేయాలనీ అమెజాన్‌కు ఆదేశాలు జారీచేసింది. నాణ్యతా ప్రమాణాలకు విరుద్ధంగా ఉన్న దేశీయ ప్రెజర్‌ కుక్కర్‌లను అమెజాన్‌ ప్లాట్‌ఫాంపై విక్రయించిన వ్యవహారాన్ని సుమోటోగా తీసుకుని సీసీపీఏ చర్యలను ప్రారంభించింది. 
 
దిగ్గజ ఇ-కామర్స్‌ సంస్థలైన అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌, పేటీఎం మాల్‌, షాప్‌క్లూస్‌, స్నాప్‌డీల్‌తో పాటు ఈ ప్లాట్‌ఫామ్‌లపై నమోదైన విక్రయదార్లకు కూడా నోటీసులను జారీ చేసింది. 'కంపెనీ వివరణను పరిశీలించిన తర్వాత 2,265 ప్రెజర్‌ కుక్కర్లు నిర్దిష్ట ప్రమాణాలకు తగ్గట్లుగా లేవని గుర్తించాం. ఈ కుక్కర్‌ల విక్రయం ద్వారా అమెజాన్‌కు కమీషన్‌ రుసుము రూపంలో రూ.6,14,825.41 వచ్చాయ'ని సీసీపీఏ తెలిపింది. 
 
అందువల్ల నాణ్యతా లోపం ఉన్న 2,265 కుక్కర్‌లను కొనుగోలు చేసిన వినియోగదారులందరికీ విషయాన్ని తెలియజేసి, వాటిని వెనక్కి రప్పించాలని అమెజాన్‌కు సూచించామని పేర్కొంది. నిబంధనల పాటింపునకు సంబంధించి 45 రోజుల్లోగా నివేదిక సమర్పించాలనీ ఆదేశించింది. పేటీఎం మాల్‌కు కూడా ఇదే తరహా ఆదేశాలను, జరిమానాను సీసీపీఏ విధించింది.