ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 26 ఆగస్టు 2024 (10:58 IST)

చౌక ధరతో ఆకర్షణీయమైన ప్లాన్ ప్రకటించిన బీఎస్ఎన్ఎల్

bsnl
ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ తమ మొబైల్ వినియోగదారుల కోసం చౌక ధరతో మరో ఆకర్షణీయమైన ప్లాన్‍‌ను ప్రకటించింది. ప్రస్తుతం టెలికాం మార్కెట్‌లో రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్, వోడాఫోన్ ఇండియా వంటి ప్రైవేట్ టెలికా కంపెనీల నుంచి ఉన్న పోటీని తట్టుకునేందుకు వీలుగా బీఎస్ఎన్ఎల్ తమ వినియోగదారుల కోసం ఆకర్షణీయమైన ప్లాన్లను ప్రకటిస్తుంది. 
 
అదేసమయంలో జియో, భారతీ ఎయిర్ టెల్, వీ కంపెనీలు తమ టారిఫ్ రేట్లను గణనీయంగా పెంచేశాయి. దీంతో ప్రభుత్వరంగ టెలికాం ఆపరేటర్ బీఎస్ఎన్ఎల్ అందిస్తున్న ఆఫర్ల పట్ల ఆకర్షితులవుతున్నారు. కస్టమర్ల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఆకర్షణీయమైన ఆఫర్లు ఉండడంతో చాలా మంది కస్టమర్లు బీఎస్ఎన్ఎల్‌లోకి మారుతున్నారు. ముఖ్యంగా నెలవారీగా చౌకైన ప్లాన్లను అన్వేషిస్తున్న కస్టమర్లే లక్ష్యంగా బీఎస్ఎన్ఎల్ సరికొత్త ఆకర్షణీయమైన 30 రోజుల ప్లాన్‌ను పరిచయం చేసింది.
 
బీఎస్ఎన్ఎల్ అందిస్తున్న ఈ సరికొత్త ప్లాన్ ధర రూ.147గా ఉంది. ఈ ప్లానులో వినియోగదారులు ఒక నెలంతా అపరిమిత కాలింగ్ చేసుకోవచ్చు. తక్కువ ఖర్చుతో నెల ప్లాన్‌ను పొందాలనుకునేవారికి ఇది ఆకర్షణీయమైన ఆఫర్‌గా ఉంది. జియో, ఎయిర్ టెల్, వీ వంటి ప్రముఖ టెలికం కంపెనీలేవీ ఇంత సరసమైన ధరకు 30 రోజుల రీఛార్జ్ ప్లాన్‌ను అందించడం లేదు.
 
రూ.147 బీఎస్ఎన్ఎల్ ప్లానులో వినియోగదారులు అపరిమిత కాలింగ్‌తో పాటు డేటా ప్రయోజనం కూడా పొందొచ్చు. కస్టమర్లకు నెలకు 10జీబీ డేటా లభిస్తుంది. దేశంలో ఏ నెట్‌వర్క్‌కు అయినా అపరిమిత లోకల్, ఎస్టీడీ కాల్స్ చేసుకోవచ్చు. అంతేకాదు బీఎస్ఎన్ఎల్ కాలర్ ట్యూన్ సేవలను కూడా పొందొచ్చు. వినియోగదారులు ఎలాంటి అదనపు ఖర్చు లేకుండా కాలర్ ట్యూన్లను సెట్ చేసుకోవచ్చు. పరిమిత డేటాతో అపరిమిత కాలింగ్ కోరుకునేవారికి ఈ ప్లాన్ బాగా నచ్చుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.