స్టాక్ మార్కెట్లపై కరోనా ప్రభావం... అంతర్జాతీయ స్థాయిలో సూచీల పతనం
స్టాక్ మార్కెట్లపై కరోనా వైరస్ ప్రభావం చూపిస్తోంది. ముఖ్యంగా అమెరికా, యూరప్ దేశాల్లో గత కొన్నిరోజులుగా కరోనా కేసులు మళ్లీ అధిక సంఖ్యలో నమోదవుతున్నాయి. ఈ ప్రభావం స్టాక్ మార్కెట్లపై పడింది. అంతర్జాతీయ స్థాయిలో సూచీలు దిగువకు పడిపోయాయి.
ఇదే ప్రభావం భారత మార్కెట్లలోనూ కనిపించింది. సెన్సెక్స్, నిఫ్టీ సోమవారం నుంచే పతనం దిశగా పయనించాయి. కరోనా కేసుల విజృంభణతో అంతర్జాతీయ పరిణామాలను దృష్టిలో ఉంచుకున్న మదుపరులు ప్రాఫిట్ బుకింగ్‌కు మొగ్గు చూపారు. దాంతో గతవారం లాభాలన్నీ సోమవారం ట్రేడింగులో ఆవిరయ్యాయి.
సెన్సెక్స్ 540 పాయింట్లు నష్టపోయి 40,145.50 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం అదేబాటలో నడిచింది. 152.30 పాయింట్ల నష్టంతో 11,778.05 వద్ద స్థిరపడింది. హీరో మోటోకార్ప్, బజాజ్ ఆటో, హిండాల్కో, ఎం అండ్ ఎం, జేఎస్ డబ్ల్యూ స్టీల్ తీవ్రంగా నష్టపోయాయి. హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్, నెస్లే, కోటక్ మహీంద్రా, ఇండస్ ఇండ్ బ్యాంక్, ఎల్ అండ్ టి లాభాల బాటలో నడిచాయి.
కొటక్ మహీంద్రా బ్యాంకుతో చర్చల వార్తల నేపథ్యంలో ఇండస్ఇండ్ బ్యాంకు స్టాక్స్ ఎగిశాయి. టెక్ మహీంద్ర షేర్లు 0.5 శాతం లాభపడ్డాయి. ఏడాది కాలంలో మహీంద్రా గ్రూప్ కంపెనీ ఆదాయం 3.32 శాతం, జూన్ క్వార్టర్‌తో 2.32 శాతం లభపడి రూ.9,371 కోట్లుగా ఉంది. మెటల్ సూచీలు 2 శాతం మేర, ఆటో సూచీ 1 శాతం మేర నష్టపోయింది.