శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 11 మార్చి 2020 (12:56 IST)

కరోనా వైరస్ దెబ్బకు పెట్రోల్ ధరలు కూడా తగ్గాయి...

ప్రపంచాన్ని కరోనా వైరస్ వణికిస్తోంది. ఈ వైరస్ దెబ్బకు ఇపుడు పెట్రోల్ ధరలు కూడా కిందికి దిగివస్తున్నాయి. ఈ వైరస్ వ్యాప్తి కాకముందు లీటరు పెట్రోల్ ధర రూ.80దాకా ఉండేది. ఇపుడు లీటరు పెట్రోల్ ధర రూ.70కి చేరింది. దేశంలోని అన్ని ప్రధాన మెట్రో నగరాల్లో ఈ ధరల తగ్గుదల ప్రధానంగా కనిపిస్తోంది. 
 
కరోనా వైరస్ ప్రభావం కారణంగా క్రూడ్ ఆయిల్ ధరలు తీవ్రంగా పతనమైన విషయం తెల్సిందే. ముఖ్యంగా, గత సోమవారం ఈ పరిస్థితి స్పష్టంగా కనిపించింది. ఫలితంగా సోమవారం ప్రపంచ స్టాక్ మార్కెట్లన్నీ కుప్పకూలిపోయారి. దీన్ని బ్లాక్ మండేగా పేర్కొన్నారు. 
 
ఈ నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడ్ ఆయిల్ ధరలు కూడా గణనీయంగా తగ్గాయి. దీనికితోడు సౌదీ అరేబియా, రష్యా దేశాల మధ్య ధరల యుద్ధం కారణంగా ముడి చమురు రేట్లు ఫిబ్రవరి 2016 నుంచి కనిష్ట స్థాయికి పడిపోయాయి. ఈ పరిణామాలతో ఇంధన ధరలు బాగా తగ్గిపోయాయి. 
 
ఫలితంగా, దేశ రాజధాని నగరమైన ఢిల్లీలో పెట్రోలు, డీజిల్ ధరలు తగ్గాయి. పెట్రోల్‌ లీటరుకు 2.69 రూపాయలు, డీజిల్‌ లీటరుకు 2.33 రూపాయలు చొప్పున తగ్గింది. దీంతో ఢిల్లీలో బుధవారం లీటర్ పెట్రోల్ ధర రూ.70.29, డీజిల్ లీటరు ధర రూ.63.01గా నిలిచింది. అలాగే, ముంబైలో పెట్రోల్ లీటరుకు 75.99 రూపాయలకు, డీజిల్ లీటరుకు 65.97 రూపాయలకు అమ్ముడవుతోంది.
 
ఇక మెట్రో సిటీ అయిన చెన్నైలో ఒక లీటరు పెట్రోల్ ధర లీటరుకు 73.02 రూపాయలు కాగా, డీజిల్ ధర ఇప్పుడు లీటరుకు 66.48 రూపాయలు. బెంగళూరులో ఇప్పుడు పెట్రోల్ రూ.72.70, డీజిల్ రూ.65.16 కు అమ్ముడవుతోంది. హైదరాబాద్‌లో పెట్రోల్ పంపుల్లో పెట్రోల్‌కు రూ.74.72, డీజిల్‌కు రూ.68.60 వసూలు చేస్తున్నారు. అంతర్జాతీయ పోకడలతో ఫిబ్రవరి 27 నుంచి ఇంధన ధరలు తగ్గుతున్న విషయం తెల్సిందే.