శనివారం, 9 నవంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By సిహెచ్
Last Updated : సోమవారం, 9 మే 2022 (20:13 IST)

మారుతున్న ధోరణులకు అనుగుణమైన డిజైన్లతోనే ఆర్ధిక స్వావలంబన: చదలవాడ నాగరాణి

Nagarani
మారుతున్న సామాజిక పరిస్థితులకు అనుగుణంగా నూతన చేనేత డిజైన్లను వినియోగదారులకు అందించాలని చేనేత జౌళిశాఖ సంచాలకురాలు చదలవాడ నాగరాణి అన్నారు. ప్రభుత్వ పరంగా అందిస్తున్న శిక్షణ అవకాశాలను సద్వినియోగం చేసుకుని మారుతున్న కాలమాన పరిస్ధితులకు మేరకు వ్యవహరించాలన్నారు. నాగరాణి నేతృత్వంలోని చేనేత జౌళి శాఖ అధికారుల బృందం సోమవారం వివిధ జిల్లాల లోని చేనేత సంఘాలను సందర్శించింది.

 
ఈ సందర్భంగా నాగరాణి మాట్లాడుతూ చేనేత కుటుంబాలు తమ ఆర్ధిక పరిస్ధితులను మెరుగుపరుచుకోవాలంటే ప్రజలు కోరుకుంటున్న డిజైన్లను అందుబాటులోకి తీసుకురావాలన్నారు. ఇందుకోసం నేత ప్రక్రియలో అమలవుతున్న ఆధునిక సాంకేతికను కూడా అందిపుచ్చుకోవాలన్నారు. ముఖ్యమంత్రి చేనేత కార్మికుల సమస్యలు పరిష్కరించే క్రమంలో ఎన్నో పధకాలు అమలు చేస్తున్నారని, కేంద్ర ప్రభుత్వం కూడా రుణాలు మంజూరు చేస్తుందని వాటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

 
చేనేత రంగంలో నూతనత్వాన్ని సాధించే క్రమంలో కార్మికులకు ప్రత్యేక శిక్షణ అందిస్తామని, ఈ క్రమంలో సంఘాలకు అవసరమైన రుణాలు అందించేందుకు బ్యాంకులు సైతం ముందుకు వస్తున్నాయని పేర్కొన్నారు. ఈ సందర్భంగా చేనేత కార్మికుల నేత ప్రక్రియ,  ఉత్పత్తికి సంబంధించిన సమస్యల గురించి పలు సంఘాల ప్రతినిధులు, కార్మికులతో చదలవాడ సంభాషించారు. ప్రభుత్వపరంగా వారి అభివృద్ది కోసం అమలవుతున్న పధకాలను సమీక్షించారు.

 
తన పర్యటనలో భాగంగా కోనసీమ, కాకినాడ, తూర్పు గోదావరి జిల్లాలలోని మురమండ చేనేత సంఘం, ఏడిదలోని భక్తమార్కండేయా సంఘం, పులగుర్త చేనేత సంఘం, పెద్దాపురం చేనేత సంఘాలను సందర్శించారు. చేనేత జౌళి శాఖ ఉప సంచాలకులు ధనుంజయ రావు, కాకినాడ చేనేత జౌళి శాఖ జిల్లా అధికారి మురళీ కృష్ణ, కోనసీమ జిల్లా చేనేత అధికారి సూరిబాబు, ఆప్కో డివిజినల్ మార్కెటింగ్ అధికారి రామకృష్ణ మూర్తి తదితరులు సంచాలకురాలి వెంబడి ఉన్నారు.