త్వరలో వంట గ్యాస్ బాదుడు .. పచ్చజెండా ఊపడమే తరువాయి...
దేశంలో పెట్రోల్, డీజల్ ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. త్వరలోనే మరోమారు వంట గ్యాస్ బాదుడు తప్పేలా కనిపించడం లేదు. దీనికి అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు, సహజవాయు ధరల్లో ఇప్పట్లో అదుపులోకి వచ్చే పరిస్థితి కనిపించడంలేదు. ఈ క్రమంలో బుధవారం పెట్రోల్ ఒక లీటరుపై 36 పైసలు, డీజిల్ ఒక లీటరుపై 38 పైసలు పెరిగింది. ఇప్పుడు గ్యాస్ ధరను కూడా పెంచేందుకు చమురు కంపెనీలు సిద్ధమయ్యాయి. వచ్చే వారం సిలిండరుపై రూ.100 వరకు పెంచేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.
అంతర్జాతీయ మార్కెట్లో ధరలు పెరిగినందునే తాము పెంచాల్సి వస్తోందని చమురు, సహజవాయు కంపెనీలు తమ చర్యను సమర్థించుకుంటున్నాయి. నష్టాన్ని భర్తీ చేసుకోవాలంటే ధర పెంపు తప్పదని అంటున్నాయి. గత జులై నుంచి ఇప్పటివరకు రూ.90 వరకు పెరిగిన సిలిండర్ ధర... ఈసారి మరో రూ.100 వరకు పెరగడం అంటే సామాన్యుడి నెత్తిన మరింత భారం పడినట్టే. మరోవైపు, ఈ ధరల పెరుగుదలపై కేంద్రం నిమ్మకునీరెత్తినట్టు వ్యవహరిస్తోంది. ఈ ధరల పెరుగుదలతో తమేకం సంబంధం లేదన్నట్టుగా ఉంటుంది.