శనివారం, 24 ఫిబ్రవరి 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 12 నవంబరు 2021 (08:16 IST)

భగ్గుమన్న బంగారం ధరలు ... రూ.50 వేలకు చేరిన ధర

దేశంలో బంగారం ధరలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో నెలకొన్న పరిస్థితుల కారణంగా ఈ పరిస్థితి ఏర్పడింది. ఫలితంగా హైదరాబాద్‌ నగరంలో బంగారం ధర రికార్డు స్థాయిలో రూ.50 వేలను దాటిపోయింది. 
 
శుక్రవారం ఇక్కడ 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.760 పెరిగి, 50,070 వద్దకు చేరింది. 22 క్యారెట్ల ధర రూ.700 మేర ఎగసి రూ. 45,900 స్థాయిని అందుకుంది. క్రితం రోజు ఈ ధరలు వరుసగా రూ. 49,310, రూ.45,200 స్థాయిలో ఉన్నాయి. 
 
అమెరికాలో ద్రవ్యోల్బణం గత మూడు దశాబ్దాల్లో ఎన్నడూ లేనంతగా ఈ అక్టోబర్‌ నెలలో 6.2 శాతం పెరిగిందన్న వార్తలతో ఇన్వెస్టర్లు పుత్తడి కొనుగోళ్లకు ఎగబడ్డారు. దీంతో ప్రపంచ మార్కెట్లో ఔన్సు పుత్తడి ధర ఐదు నెలల గరిష్ఠ స్థాయి 1,860 డాలర్లకు పెరిగింది. ఈ ఏడాది జూలై 21 తర్వాత పుత్తడి ఈ స్థాయికి చేరడం ఇదే తొలిసారి. 
 
మరోవైపు, బంగారం బాటలోనే వెండి ధర సైతం జోరుగా పెరిగింది. హైదరాబాద్‌లో కేజీ వెండి ధర రూ.1,300 మేర పుంజుకుని, రూ.70,600కు చేరింది. క్రితం రోజు ఇది రూ.69,300గా ఉంది. ప్రపంచ మార్కెట్లో వెండి ఔన్సు ధర 25 డాలర్ల స్థాయిని దాటింది.