ఆదివారం, 24 సెప్టెంబరు 2023
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 9 నవంబరు 2021 (14:18 IST)

సోనియమ్మను ఎదిరించిన మగాడు జగన్ : కొడాలి నాని

కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని ఎదిరించి నిలబడిన మగాడు వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి అని ఏపీ మంత్రి కొడాలి నాని అంటున్నారు. ఏపీలో పెట్రోల్ ధరలు తగ్గించాలని విపక్ష పార్టీలన్నీ గగ్గోలు పెడుతున్నాయి. వీటిపై మంత్రి కొడాలి నాని స్పందిస్తూ, చంద్రబాబుకు వయసు పెరిగింది కానీ.. బుద్ధి పెరగలేదన్నారు. ఎక్కడైనా సీఎం పెట్రోల్ రేట్లను తగ్గిస్తారా అంటూ ప్రశ్నించారు.
 
చంద్రబాబు హయాంలో పెట్రోల్, డీజిల్‌పై 2 రూపాయల సర్‌ఛార్జీ విధించినట్లు కొడాలి నాని గుర్తుచేశారు. ఎక్కడైనా పెట్రోల్ ధరలను ముఖ్యమంత్రి తగ్గిస్తారా అని ప్రశ్నించారు. టీడీపీకి ఎన్నిసార్లు ప్రజలు బుద్ధి చెప్పినా చంద్రబాబుకు సిగ్గురావడం లేదన్నారు. 
 
మరోవైపు బద్వేలు ఉప ఎన్నికలో బీజేపీని ఓటర్లు పెట్రోల్ పోసి తగులపెట్టారని, ఆ పార్టీకి డిపాజిట్ కూడా దక్కలేదని కొడాలి నాని ఎద్దేవా చేశారు. మరోవైపు స్టీల్‌ప్లాంట్‌పై ఏపీ ప్రభుత్వానికి వారం రోజులు డెడ్‌లైన్ పెట్టిన జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌పైనా మంత్రి కొడాలి నాని విరుచుకుపడ్డారు.
 
అఖిలపక్షాన్ని ఢిల్లీ తీసుకువెళ్లడానికి జగన్‌కు పవన్ డెడ్‌లైన్ పెట్టాడని.. వారం కాదు ఏడేళ్లు డెడ్‌లైన్ పెట్టినా పవన్‌ను జగన్ ఢిల్లీకి తీసుకువెళ్లరని స్పష్టంచేశారు. కావాలంటే పవన్‌కు చెందిన పార్టీలోని నేతలను పంపిస్తే తానే టిక్కెట్లు బుక్ చేయించి ఢిల్లీకి పంపిస్తానని.. దాని కోసం డెడ్‌లైన్లు పెట్టాల్సిన అవసరం లేదని కౌంటర్ ఇచ్చారు. 
 
అదేసమయంలో బీజేపీ రాష్ట్ర నేతలపైనా ఓ రేంజ్ లో నిప్పులు చెరిగారు. బీజేపీ బెదిరింపులకు బయపడడానికి ఇక్కడ ఉన్న సీఎం జగన్ మేక కాదు.. పులి అని అన్నారు. బీజేపీ ఉడత ఊపులకు భయపడేవారు ఎవరూ లేరని స్పష్టం చేశారు. అధికారంలో ఉండగానే సోనియాగాంధీని ఎదిరించి బయటకి వచ్చిన మగాడు జగన్ అని తేల్చి చెప్పారు. వచ్చే ఎన్నికల్లోనూ బీజేపీ, టీడీపీ‌లను ప్రజలు తగులబెడతారని మంత్రి నాని జోస్యం చెప్పారు.