శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 31 డిశెంబరు 2021 (15:50 IST)

వస్త్రాలపై జీఎస్టీ పెంపు ఇప్పట్లో లేనట్టే... వెనక్కి తగ్గిన కేంద్రం

వస్త్రాలపై వసూలు చేస్తున్న జీఎస్టీ పన్నును 5 శాతం నుంచి 12 శాతానికి పెంచాలని కేంద్రం భావించింది. దీనిపై శుక్రవారం జరిగిన 46వ జీఎస్టీ కౌన్సిల్‌లో చర్చించి నిర్ణయం తీసుకుంటారనే వార్తలు వచ్చాయి. అయితే, వస్త్రాలపై జీఎస్టీని 12 శాతానికి పెంచాలన్న ప్రతిపాదనపై తీవ్ర వ్యతిరేకత వచ్చింది. దీంతో జీఎస్టీ కౌన్సిల్‌లో ఎలాంటి నిర్ణయం తీసుకోకుండానే సమావేశం వాయిదాపడింది. దీంతో ప్రస్తుతం వసూలు చేస్తున్న 5 శాతం జీఎస్టీనే వసూలు చేయనున్నారు. 
 
కేంద్ర విత్తమంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలో ఈ జీఎస్టీ కౌన్సిల్ భేటీ జరిగింది. ఇందులో వస్త్రాలపై వసూలు చేస్తున్న 5 శాతం జీఎస్టీని 2022 నుంచి జనవరి ఒకటో తేదీ నుంచి 12 శాతం పెంచాలని భావించింది. అయితే, దీనిపై దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. 
 
వస్త్రాలపై జీఎస్టీని 12 శాతం పెంచితే పేదలకు వస్త్రాలు భారంగా మారతాయని, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు (ఎంఎస్ఎంఈ) నిబంధనల అమలు భారంగా మారుతుందనే ఆందోళన వ్యక్తమైంది. ప్రధానంగా గుజరాత్, వెస్ట్ బెంగాల్, ఢిల్లీ, రాజస్థాన్, తమిళనాడు రాష్ట్రాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. దీంతో శుక్రవారం జరిగిన జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో వస్త్రాలపై జీఎస్టీ పెంపు అంశంపై ప్రధాన అజెండాగా మారినప్పటికీ ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా సమావేశం వాయిదాపడింది.