బుధవారం, 8 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 15 జులై 2020 (19:15 IST)

చైనా కంపెనీకి భారత్ షాక్? వందే భారత్‌ రైళ్ల తయారీ ప్రాజెక్టు నుంచి ఔట్?

మేకిన్ ఇండియా ప్రాజెక్టులో భాగంగా భారత్ వందే భారత్ రైళ్ళ తయారీ చేపట్టనుంది. ఈ ప్రాజెక్టులో 44 రైళ్లను తయారు చేయనుంది. ఈ ప్రాజెక్టులో భాగంగా, కేంద్ర సర్కారుతో సంయుక్త వెంచర్‌ను కుదుర్చుకోవడానికి బిడ్లు వేసిన ఏకైక విదేశీ సంస్థగా చైనాకు చెందిన సీఆర్‌ఆర్‌సీ కార్పొరేషన్‌ నిలిచింది. 
 
హర్యానా కేంద్రంగా ఓ సంస్థతో కలిసి సీఆర్‌ఆర్‌సీ పయోనిర్‌ ఎలక్ట్రిక్‌ (ఇండియా) ప్రైవేట్‌ లిమిటెడ్‌ పేరిట సంయుక్త వెంచర్‌గా ఉండడానికి టెండర్‌ కోసం ప్రయత్నిస్తోంది. ఇందులో మరో ఆరు భారతీయ సంస్థలు కూడా పోటీ పడుతున్నాయి. 
 
అయితే, చైనాతో గాల్వన్ లోయ వద్ద ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో ఆ దేశానికి చెందిన పలు ప్రాజెక్టులను ఇప్పటికే భారత్ రద్దు చేసింది. అతి ముఖ్యమైన రైల్వే ప్రాజెక్టులో డ్రాగన్ దేశ సంస్థను భాగస్వామిని చేసుకోవడంపై రైల్వే అధికారులు తీవ్రంగా చర్చించిన మీదట, చైనా నుంచి వచ్చిన బిడ్లను పరిశీలనకు తీసుకోకూడదని భావిస్తున్నారు.
 
గత యేడాది డిసెంబరులో చెన్నైకు చెందిన ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ ఈ ప్రాజెక్టు కోసం మూడోసారి గ్లోబల్ టెండర్లను ఆహ్వానించగా దేశంలోని పలు సంస్థలు కూడా బిడ్లు దాఖలు చేశాయి. 
 
వాటిలో భారత్ హెవీ ఎలక్ట్రికల్స్, హైదరాబాద్‌కు చెందిన మేధా గ్రూప్, ఎలక్ట్రోవేవ్స్ ఎలక్ట్రానిక్ ప్రైవేట్ లిమిటెడ్, ముంబైకి చెందిన పవర్ టెక్నిక్స్ ఎక్విప్‌మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కూడా ఉన్నాయి.
 
మూడోసారి ఆహ్వానించిన ఈ టెండర్లలో ఇతర ఏ విదేశీ సంస్థ ఆసక్తి చూపలేదు. అయితే, అంతకుముందు దాఖలు చేసిన టెండర్లకు విదేశీ సంస్థలు అల్‌స్టోమ్, బాంబార్డియర్, టాల్గో, మిత్సుబిషి, సిమెన్స్ బిడ్లు వేశాయి. 
 
ఈ సారి ఆ సంస్థలు బిడ్లు వేయడానికి ముందుకు రాలేదు. గాల్వన్‌ లోయలో ఉద్రిక్తతల పర్యవసానంగా ఈ భారీ ప్రాజెక్టు నుంచి కూడా చైనా కంపెనీని తప్పించాలని రైల్వే భావిస్తోంది.
 
మేక్ ఇన్ ఇండియా, ఆత్మ నిర్భర్ మిషన్లకు అనుగుణంగానే సీఆర్ఆర్సీని బిడ్డింగ్ నుంచి తప్పించాలనుకుంటున్నామని ఓ రైల్వే అధికారి చెప్పారు. ఈ ప్రాజెక్టులో చైనా సంస్థ బిడ్లు దాఖలు చేయడంపై ఆల్ ఇండియా ట్రేడర్స్ సమాఖ్య కూడా అంభ్యంతరాలు తెలిపింది. 
 
రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ కు లేఖ రాసి... మేక్ ఇన్ ఇండియా నినాదంతో ఈ ప్రాజెక్టును కొనసాగిద్దామని చైనా కంపెనీని ఇందులో భాగస్వామిని చేయకూడదని కోరింది. కాగా, ఈ టెండర్ విలువ‌ రూ.1500 కోట్లు ఉంటుంది.