మంగళవారం, 5 నవంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 24 సెప్టెంబరు 2021 (17:23 IST)

రూ.10 లక్షలకు లోపు ఆదాయం వున్నవారికే సబ్సీడీ గ్యాస్?

ప్రస్తుతం దేశంలో పెట్రోల్, డీజల్ ధరలతో పాటు వంట గ్యాస్ ధరలు విపరీతంగా మండిపోతున్నాయి. ఈ ధరల పెరుగుదల సామాన్య, మధ్యతరగతి ప్రజలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. అదేసమయంలో సబ్సీడీకి ఇచ్చే వంట గ్యాస్ సిలిండర్ల ధర కూడా రూ.1000కి చేరువయ్యాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం తీవ్రమైన విమర్శలను ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో వంట గ్యాస్ సిలిండర్‌ సబ్సిడీ కోసమే ఓ కొత్త పథకాన్ని ప్రవేశపెట్టేందుకు కేంద్రం కసరత్తు చేస్తుంది. దీనిపై ఇప్పటికే అంతర్గతంగా చర్చించినట్టు సమాచారం. 
 
పెరిగిన గ్యాస్‌ ధరల నేపథ్యంలో ఎల్పీజీ సిలిండర్‌ ధర వెయ్యికి చేరడంతో వినియోగదారులపై ఈ ధరల భారం పడకుండా ప్రభుత్వమే భరించేలా చర్యలు తీసుకోనున్నట్టు తెలుస్తోంది. ఇందుకోసం కొత్త పథకం ప్రవేశపెట్టే యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉన్నది. ఈ మేరకు రెండు ప్రతిపాదనలను కేంద్రం పరిశీలిస్తున్నది.
 
ఇందులో మొదటి ప్రతిపాదన.. ఎలాంటి సబ్సిడీ లేకుండా గ్యాస్ సిలిండర్లను ఏ వినియోగదారుడికైనా విక్రయించడం. రెండో ప్రతిపాదన.. ఎంపిక చేసిన కొందరు వినియోగదారులకు మాత్రమే సబ్సిడీతో గ్యాస్ సిలిండర్లను సరఫరా చేయడం. ఈ మేరకు గ్యాస్‌ సబ్సిడీపై పరిమితులను కేంద్రం విధించవచ్చని సమాచారం.
 
ఎంపిక చేసిన కొందరి వినియోగదారుల వార్షిక ఆదాయం రూ.10 లక్షలలోపు ఉండాల్సివుంటిద. అంతకు మించివున్నట్టయితే గ్యాస్ సిలిండర్‌పై ఎలాంటి రాయితీ ఇవ్వరు. దీంతో అవసరమైన ప్రజలకే గ్యాస్‌ సబ్సిడీ ఇచ్చేందుకు ఇది దోహదపడుతుందని ప్రభుత్వం భావిస్తుంది. అదేసమయంలో రాయితీపై ఇచ్చే గ్యాస్ సిలిండర్ల సంఖ్యలో కూడా పరిమితి విధించే అవకాశాలు లేకపోలేదు.