బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 27 జులై 2020 (14:56 IST)

రిలయన్స్ కొత్త రికార్డు.. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద చమురు సంస్థగా..?

ఉచిత డేటా పేరిట సంచలనం సృష్టించిన రిలయన్స్ ప్రస్తుతం అనేక రంగాల్లో రాణిస్తోంది. ఆర్ఐఎల్‌లో పెట్టుబడులు పెట్టేందుకు కంపెనీలు పోటీపడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ మరో అరుదైన ఘనత సాధించింది. అమెరికాకు చెందిన ఎక్సాన్‌ మొబిల్‌ను దాటేసి.. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద చమురు సంస్థగా ఆవిర్భవించింది.
 
ముఖ్యంగా రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అనుబంధ సంస్థలైన డిజిటల్‌, రీటైల్‌ వ్యాపారాలు దూకుడుగా ఉండటంతో ఈ కంపెనీ మార్కెట్‌ విలువ గణనీయంగా పెరిగింది. గత శుక్రవారమే కంపెనీ మార్కెట్‌ విలువ 189 బిలియన్‌ డాలర్లను తాకడంతో ఎక్సాన్‌ మొబిల్‌ను దాటేసింది. ఈ రెండింటి మధ్య బిలియన్‌ డాలర్ల తేడా ఉంది.
 
అలాగే రిలయన్స్‌ తన అనుబంధ వ్యాపారాలను అద్భుతంగా వినియోగించుకుంటోంది. రిలయన్స్‌కు సంబంధించిన ఉత్పత్తులను విక్రయించడానికి ఇది మంచి వేదికగా ఉపయోగపడింది. జియో వచ్చిన కొత్తల్లో రిలయన్స్‌ డిజిటల్‌ ఊతకర్రలాగా పనిచేసింది. భారత్‌ రిటైల్‌ రంగంలో పట్టు బిగించాక.. టెలికాం రంగంలోకి వచ్చింది.. డేటా మార్కెట్‌లో తిరుగు లేని ఆధిపత్యం సంపాదించాక ఈ-కామర్స్‌ రంగంలోకి అడుగుపెడుతోంది. ఇలా ఒక్కో రంగంలో రిలయన్స్ పట్టు బిగుస్తోంది. ఈ క్రమంలో కొనుగోళ్లకు కూడా వెనుకాడట్లేదు. 
 
రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ఆదాయాల్లో సింహభాగం ఇప్పటికీ పెట్రో కెమికల్‌, చమురు శుద్ధి వ్యాపారం నుంచే లభిస్తోంది. 2019 జూన్‌ త్రైమాసికంలో కంపెనీ స్థూల ఆదాయంలో 32శాతం కన్జ్యూమర్‌ బిజినెస్‌ నుంచే లభించింది.