వచ్చే యేడాదికి ట్వీ20 వరల్డ్ కప్ : ఐపీఎల్‌కు మార్గం సుగమం
అనుకున్నట్టుగానే ట్వంటీ20 ప్రపంచ కప్ వాయిదాపడింది. వచ్చే అక్టోబరు నెలలో ఆస్ట్రేలియా వేదికగా ఈ టోర్నీ జరగాల్సివుంది. కానీ, కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఈ టోర్నీకి ఆతిథ్యం ఇవ్వలేమని ఆస్ట్రేలియా చేతులెత్తేసింది.
ఈ నేపథ్యంలో సోమవారం సమావేశమైన ఐసీసీ ఈ టోర్నీని వచ్చే యేడాదికి వాయిదావేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ఐసీసీ ప్రకటన విడుదల చేసింది. వాస్తవానికి ఈ మెగా ఈవెంట్ అక్టోబరు 18 నుంచి నవంబరు 15 వరకు ఆస్ట్రేలియా గడ్డపై జరగాల్సి ఉంది.
కరోనా వ్యాప్తి మొదలైన తొలినాళ్లలో ఆస్ట్రేలియాలో వైరస్ ప్రభావం పెద్దగా కనిపించలేదు. దాంతో టోర్నీ జరిగేది ఖాయమేననిపించింది. అయితే లాక్డౌన్ ఆంక్షలు సడలించారో, లేదో ఆస్ట్రేలియాలో కరోనా కట్టలు తెంచుకుంది.
భారీ సంఖ్యలో పాజిటివ్ కేసులు రావడంతో అక్కడి ప్రభుత్వం పునరాలోచనలో పడింది. టోర్నీ నిర్వహణపై చివరి వరకు ఊగిసలాడిన సర్కారు, నిస్సహాయత వ్యక్తం చేయడంతో చేసేదేమీలేక ఐసీసీ కూడా టోర్నీని వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది.
ఇక, ఈ యేడాది ప్రపంచకప్ జరగకపోతే, ఆ విరామంలో ఐపీఎల్ నిర్వహించాలని బీసీసీఐ గట్టి పట్టుదలతో ఉంది. ముఖ్యంగా, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఐసీసీ ప్రకటన కోసం కాచుకుని ఉన్నాడంటే అతిశయోక్తి కాదు. లీగ్ నిర్వహణకు ప్రధాన అడ్డంకి తొలగిపోయిన నేపథ్యంలో ఐపీఎల్ షెడ్యూల్ ను ప్రకటించడం ఇక లాంఛనమే కానుంది.