శనివారం, 25 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఠాగూర్

పెట్రో ధరలపై నేనేం చెప్పలేను.. ధర్మ సంకటంగా ఉంది : నిర్మలా సీతారామన్

దేశంలో పెట్రోల్ ధరలు నానాటికీ పెరిగిపోతున్నాయి. ఈ ధరల భారతంతో వాహన చోదకుల జేబులకు చిల్లు పడుతోంది. దీంతో కేంద్రంపై ముప్పేట దాడి మొదలైంది. ఈ నేపథ్యంలో చెన్నైలో జరిగిన ఓ కార్యక్రమంలో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ పెట్రోల్ ధరల పెరుగుదలపై స్పందించారు. 
 
ఇది చాలా ఇబ్బందికరమైన అంశమేనని అంగీకరించారు. ఈ సమస్య పరిష్కారానికి ధరలు తగ్గించడమే తప్ప మరో జవాబు లేదని స్పష్టం చేశారు. కానీ ఇంధన ధరల విషయంలో ప్రభుత్వానికి ఎలాంటి నియంత్రణ లేదని, పెట్రోలియం ఉత్పత్తుల ధరలు సాంకేతికంగా చమురు మార్కెటింగ్‌ కంపెనీల నియంత్రణలోనే ఉంటాయని చెప్పారు. 
 
"ఇంధన ధరల పెరుగుదల చాలా ఇబ్బందికరమైన అంశమే. ఇది భయంకరమైన ధర్మ సంకటం. ఈ సమస్య పరిష్కారానికి ధరలను తగ్గించాలనే జవాబు తప్ప మరేదీ కూడా ఎవరినీ ఒప్పించలేదు" అని ఆమె వెల్లడించారు. 
 
చమురు ఉత్పత్తి, ఎగుమతి చేసే (ఒపెక్‌) దేశాలు గతంలో అంచనా వేసిన దానికంటే ఉత్పత్తిని తగ్గించనున్నాయని, ఇది భవిష్యత్తులో పెట్రోలియం ఉత్పత్తుల ధరలపై మరింత ఒత్తిడి పెంచుతుందని శనివారం ఆమె మీడియాతో అన్నారు. 
 
చమురు మార్కెటింగ్‌ కంపెనీలు ముడి చమురును దిగుమతి చేసుకోవడం, శుద్ధి చేయడం, పంపిణీ చేయడం, రవాణా చార్జీలను విధించడం లాంటి పనులు చేస్తాయని తెలిపారు. పెట్రోలియం ఉత్పత్తుల ధరలను తగ్గించే అంశంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్చలు జరపాల్సిన అవసరమున్నదని ఆమె అభిప్రాయపడ్డారు. 
 
ఇంధన ధరలను తగ్గించేందుకు పెట్రోల్‌, డీజిల్‌ను వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) పరిధిలోకి తీసుకొస్తారా? అని విలేకర్లు ప్రశ్నించగా.. దీనిపై రాష్ట్రాలతో సంప్రదింపులు జరపడంతోపాటు జీఎస్టీ కౌన్సిల్‌లో కూలంకషంగా చర్చించిన తర్వాతే నిర్ణయం తీసుకునేందుకు వీలుంటుందని చెప్పారు. 
 
పెట్రోల్‌, డీజిల్‌ను జీఎస్టీ పరిధిలోకి తీసుకొచ్చేందుకు రాష్ట్రాలు అంగీకరిస్తే వాటి ధరలు దేశవ్యాప్తంగా ఒకేలా ఉంటాయని, వీటిపై వచ్చే పన్నును కేంద్రం, రాష్ట్రాలు పంచుకోవాల్సి ఉంటుందని నిర్మలా సీతారామన్‌ వివరించారు.