గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 15 అక్టోబరు 2020 (13:18 IST)

ప్రధాని మోదీ ఆస్తులు విలువెంతో తెలుసా? జీతం రూ.2లక్షలు

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తాజాగా ఆయన తన ఆస్తులు, అప్పుల వివరాలను బహిర్గతం చేశారు. ఈ గణాంకాలు జూన్‌ 30 నాటికి ఆయన ఆర్థిక స్థితిగతులను వెల్లడిస్తున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీకి ముఖ్య ఆదాయ వనరు ప్రభుత్వం నుంచి పొందే రూ.రెండు లక్షల జీతం. దాన్ని ఫిక్స్‌డ్ డిపాజిట్లలో పెట్టడంతో పాటు, వచ్చే వడ్డీని తిరిగి పెట్టుబడి పెట్టడం వల్ల ఆయన ఆదాయంలో వృద్ధి ఎక్కువగా కనిపిస్తోందని సన్నిహితులు తెలిపారు.
 
అలాగే ఎప్పటిలాగే మోదీ స్థిరాస్తుల్లో ఎలాంటి మార్పులేదు. కుటుంబంతో కలిపి ఆయనకు తన స్వరాష్ట్రం గుజరాత్‌లోని గాంధీ నగర్‌లో ఒక ఇల్లు, స్థలం ఉన్నాయి. వాటి విలువ రూ.1.1 కోట్లు. ప్రధాని ఎక్కువగా పన్ను మినహాయింపు మార్గాలను ఎంచుకుంటున్నారు. అందుకు ఆయన జీవిత బీమా, నేషనల్ సేవింగ్స్‌ సర్టిఫికేట్(ఎన్‌ఎస్‌సీస్‌), ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ బాండ్లలలో పెట్టుబడి పెడుతున్నారు.
 
ఇది ఈక్విటీ మార్కెట్‌పై ఆయనకున్న స్పష్టతను తెలియజేస్తోంది. అయితే, ఇటీవలి కాలంలో ఎన్‌ఎస్‌సీస్‌లో ఆయన పెట్టుబడి పరిమాణం పెరగగా, బీమా ప్రీమియంలో తగ్గుదల కనిపిస్తోంది. జూన్‌ 30 నాటికి ప్రధాని పొదుపు ఖాతాలో మోత్తం రూ.3.38లక్షలు ఉండగా, ఆయన వద్ద నగదు రూపంలో రూ. 31,450 మాత్రమే ఉన్నాయి. 
 
అలాగే ఎస్‌బీఐ గాంధీ నగర్‌ బ్రాంచ్‌లో ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల మొత్తం గత ఆర్థిక సంవత్సరంతో పోల్చుకుంటే రూ.1,27,81,575 నుంచి రూ. 1,60,28,039కు పెరిగింది. గత సంవత్సరం ఎన్నికలు సమయంలో వెల్లడించిన వివరాలతో ఇవి సరిపోలుతున్నాయి.