సోమవారం, 25 నవంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By
Last Updated : శుక్రవారం, 15 ఫిబ్రవరి 2019 (12:45 IST)

జాబితా నుంచి పాకిస్థాన్ తొలగింపు : భారత్ కఠిన నిర్ణయం

జమ్మూకాశ్మీర్ దాడికి ప్రతీకారం తీర్చుకునే దిశగా భారత్ అడుగులు వేస్తోంది. జమ్మూకాశ్మీర్‌లో సీఆర్పీఎఫ్ జవాన్ల వాహనంపై ఆత్మాహుతి దాడి జరుగగా ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయిన జవాన్ల సంఖ్య శుక్రవారానికి 49కు చేరింది. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం జాతీయ భద్రతా వ్యవహారాల కమిటీ అత్యవసరంగా సమావేశమైంది. ఇందులో ఆత్మాహుతి దాడితోపాటు తదనంతర పరిణామాలపై చర్చించారు. 
 
ఈ నేపథ్యంలో ఈ దాడిపై కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ మాట్లాడుతూ, పుల్వామా ఉగ్రదాడి అనంతరం.. అత్యంత అభిమాన దేశాల జాబితా నుంచి పాకిస్థాన్‌ను తొలగిస్తున్నట్టు చెప్పారు. తద్వారా పాకిస్థాన్‌ను అంతర్జాతీయంగా ఒంటరిని చేయబోతున్నట్టు వెల్లడించారు. 
 
అదేసమయంలో పుల్వామా ఘటనపై రేపు హోంమంత్రి అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తామని, ఈ దాడి వివరాలను అఖిలపక్ష నేతలకు హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పూర్తి వివరాలు వెల్లడిస్తారని చెప్పారు. 
 
అలాగే, అంతర్జాతీయంగా పాకిస్థాన్‌ను ఒంటరిని చేసేందుకు విదేశాంగ శాఖ తరపున అన్ని ప్రయత్నాలు చేస్తుందన్నారు. దేశంలోకి చొరబాటుదారులు ప్రవేశించకుండా భద్రతను కట్టుదిట్టం చేస్తామని, చొరబాటుదారులకు సాయపడుతున్న వారిని వదిలే ప్రసక్తే లేదని, దేశ ద్రోహులకు సాయం చేసేవారు ఫలితం అనుభవిస్తారని జైట్లీ తెలిపారు.