ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By
Last Updated : గురువారం, 14 ఫిబ్రవరి 2019 (19:45 IST)

ఈ సారి మీరే చూస్తారుగా.. సెంటిమెంట్‌ను మార్చుతాం : పాకిస్థాన్

వచ్చే నెలలో మే నెలాఖరు నుంచి క్రికెట్ ప్రపంచ కప్ టోర్నీ జరుగనుంది. ఇంగ్లండ్ ఆతిథ్యమిస్తున్న ఈ టోర్నీ కోసం వచ్చేనెల 23వ తేదీలోపు క్రికెటర్ల జాబితాను ప్రకటించాలి. ఆ పనిలో అన్ని దేశాల క్రికెట్ బోర్డులు నిమగ్నమైవున్నాయి. 
 
అయితే, అంతర్జాతీయ ఈవెంట్‍ ఫైనల్ మ్యాచ్‌లలో భారత్‌పై పాకిస్థాన్ ఆధిపత్యం చెలాయించింది లేదు. కానీ, ఈ దఫా మాత్రం ఈ సెంటిమెంట్‌ను మార్చుతామని పాకిస్థాన్ మాజీ కెప్టెన్, మాజీ వికెట్ కీపర్ మోయిన్ ఖాన్ చెబుతున్నాడు. 
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, ద్వైపాక్షిక సిరీస్‌లలో ఎపుడు కూడా భారత్‌పై పాకిస్థాన్ పైచేయి సాధిస్తోంది. కానీ, ప్రపంచ కప్ ఈవెంట్లలో మాత్రం పాకిస్థాన్ పేలవ ప్రదర్శన కారణంగా భారత్‌ను ఓడించలేకపోతున్నాం. కానీ, ఈ దఫా ఆ సెంటిమెంట్‌కు ఫుల్‌స్టాఫ్ పెడతామన్నారు. 
 
ఐసీసీ నిర్వహించే క్రికెట్ ప్రపంచ కప్‌లో ఇరు జట్లూ ఆరుసార్లు తలపడ్డాయి. కానీ, ప్రతిసారీ భారత్‌ గెలుస్తూ వస్తోంది. కానీ, ఈ సారి మాత్రం ఆ సెంటిమెంట్‌ను చెరిపేయడంతో పాటు ఆ చెత్త రికార్డును సైతం బద్దలు కొట్టి చరిత్ర తిరిగరాస్తామని మొయిన్ విశ్వాసం వ్యక్తం చేస్తున్నాడు. 
 
ప్రస్తుతం పాక్ బలంగా ఉందని, జట్టులో నైపుణ్యమున్న ఆటగాళ్లకు కొదవలేదన్నాడు. పాకిస్థాన్ కెప్టెన్‌ సర్ఫరాజ్ అహ్మద్ జట్టును ముందుండి నడిపిస్తున్నాడని కితాబిచ్చాడు. భారత్‌పై వరల్డ్‌కప్‌లో గెలిచే సత్తా పాక్ జట్టుకు ఉందని చెప్పిన మొయిన్, రెండేళ్ల కిందట ముగిసిన ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో ఇండియాను పాక్ చిత్తుగా ఓడించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేశాడు.
 
ఇంగ్లాండ్ పరిస్థితులకు తగ్గట్టుగా పాక్ జట్టులో నాణ్యమైన బౌలర్లు ఉన్నారని అతను ధీమా వ్యక్తంచేశాడు. మే, జూన్ నెలల్లో ఇంగ్లాండ్ పిచ్‌లపై ఉండే తేమ పాక్ బౌలర్లకు ఉపకరిస్తుందన్నారు. అలాగే టోర్నీకి మూడు వారాల ముందే ఇంగ్లాండ్ వెళ్లి ప్రాక్టీస్‌లో పాల్గొవడం కూడా పాకిస్థాన్‌కు కలిసి వస్తుందని అభిప్రాయపడ్డాడు. కాగా, 2019 వరల్డ్‌కప్‌లో భారత్-పాక్‌లు జూన్ 16వ తేదీన తలపడనున్నాయి.