వ్యాపార సంస్థలైనా, బ్యాంకులైనా రూ.10 నాణేలను తీసుకోవాల్సిందే: ఆర్‌బీఐ
భారతీయ రిజర్వ్ బ్యాంక్ రూ.10 నాణేల చెల్లుబాటు గురించి ఎన్నిసార్లు స్పష్టత ఇస్తున్నప్పటికీ, ప్రకటనలు జారీ చేస్తున్నప్పటికీ ప్రజల వైఖరిలో మార్పు రావడం లేదు.
ఈ నాణేలను తీసుకోవడానికి చిన్న చిన్న వ్యాపారస్తులు మొదలుకొని సూపర్ మార్కెట్ల వరకు చాలా మంది నిరాకరిస్తున్నారు. ఆర్టీసీ బస్సుల్లోనూ ఈ నాణేలు చెల్లడం లేదు. తెలుగు రాష్ట్రాలతో సహా పలు రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి నెలకొని ఉంది.
రూ.10 నాణేలు చెలామణిలో లేవని ఎవరో చేసిన ప్రచారం కారణంగా వ్యాపారులు వాటిని తీసుకోవడానికి నిరాకరిస్తున్నారు. ఈ నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) మరోసారి స్పష్టత ఇవ్వాల్సి వచ్చింది.
రూ.10 నాణేలతో పాటుగా చెలామణిలో ఉన్న అన్ని రకాల నాణేలు సైతం చెల్లుబాటు అవుతాయని స్పష్టీకరించింది. కొన్ని రకాల నాణేలను వ్యాపారస్తులు, బ్యాంక్‌లు తీసుకోవడానికి అంగీకరించడం లేదని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆర్‌బీఐ ఈ ప్రకటన జారీ చేసింది.