ఉద్యోగులకు ఎనిమిది నెలల వేతనాన్ని బోనస్‌గా ప్రకటించిన సింగపూర్ ఎయిర్‌లైన్స్!!
సింగపూర్ ఎయిర్‌లైన్స్ సంస్థ తమ ఉద్యోగులకు తీపికబురు చెప్పింది. గత ఆర్థిక సంవత్సరంలో భారీ లాభాలు వచ్చాయి. ఈ లాభాల్లో కొంతభాగం సంస్థలో పని చేసే ఉద్యోగులకు పంపిణీ చేసేందుకు నిర్ణయించింది. ఇందులోభాగంగా, ఉద్యోగులకు 8 నెలలకు సమానమైన జీతాన్ని బోనస్‌గా చెల్లిస్తామని తాజాగా ప్రకటించింది. ఈ విషయాన్ని సీఎన్‌ఎన్ వార్తాసంస్థ తెలిపింది.
2023-24 ఆర్థిక సంవత్సరానికి రికార్డు స్థాయిలో సుమారు రూ.16 వేల కోట్ల నికర లాభాన్ని ఆర్జించినట్లు వెల్లడించింది. ఈ నేపథ్యంలో లాభాల్లో కొంత మొత్తాన్ని ఉద్యోగులకు బోనస్‌గా చెల్లించేందుకు ముందుకొచ్చింది. కరోనా మహమ్మారి వల్ల మూతపడిన చైనా, హాంకాంగ్, జపాన్, తైవాన్ సరిహద్దులు గతేడాది పూర్తిస్థాయిలో తెరచుకున్నాయి. దీంతో ఈ మార్గాల్లో వ్యాపారం తిరిగి ఊపందుకుందని.. యేడాదంతా విమాన ప్రయాణాలకు డిమాండ్ ఏర్పడిందని పేర్కొంది. అందుకే ఇంతటి విజయం సాధ్యమైందని ఎయిర్‌లైన్స్ వెల్లడించింది.
ఇప్పటికే గత యేడాదికిగాను సింగపూర్ ఎయిర్ లైన్స్ ప్రపంచంలోనే అత్యుత్తమ విమానయాన సంస్థగా ఎంపికైంది. ది స్కై ట్రాక్స్ వరల్డ్ ఎయిర్‌లైన్స్ అవార్డును గెలుచుకుంది. గత 23 ఏళ్లలో సింగపూర్ ఎయిర్‌లైన్స్ ఈ అవార్డు సాధించడం ఇది ఆరోసారి కావడం విశేషం. ఉద్యోగుల నిరంతర శ్రమ వల్లే ఈ అవార్డు సాధ్యమైందని సింగపూర్ ఎయిర్‌లైన్స్ సీఈఓ గో చూన్ ఫాంగ్ అన్నారు.
మరోవైపు ఎమిరేట్స్ గ్రూప్ కూడా తమ సిబ్బందికి 20 వారాల (5 నెలలు) జీతాన్ని బోనస్ ప్రకటించింది. మే జీతంతో ఈ మొత్తాన్ని చెల్లిస్తామని వెల్లడించింది. గత ఆర్థిక సంవత్సరంలో రికార్డు స్థాయిలో లాభాలు ఆర్జించినట్లు తెలిపింది. ఎమిరేట్స్ గ్రూప్‌లోని మొత్తం సిబ్బంది సంఖ్య గతేడాది 10 శాతం పెరిగి 1,12,406కి చేరింది. ఈ సంస్థలో 170 దేశాలకు చెందిన ఉద్యోగులు పనిచేస్తున్నారు. 84 దేశాల్లో సేవలు అందిస్తున్నారు.