మంగళవారం, 15 అక్టోబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 5 అక్టోబరు 2021 (09:51 IST)

తగ్గేదే లే అంటున్న చమురు కంపెనీలు... మళ్లీ పెట్రో బాదుడు

ధరల పెంపుపై ఏమాత్రం తగ్గేదే లే అని చమురు కంపెనీలు అంటున్నాయి. అందుకే మరోమారు పెట్రో వడ్డన విధించాయి. రెండు రోజుల పాటు స్థిరంగా ఉన్న పెట్రోల్ ధరలు మంగళవారం మళ్లీ పెరగడంతో ప్రజలపై అదనపు భారం పడింది. పైపైకి ఎగబాకుతున్న పెట్రో ధరలతో సామాన్యులు సతమతమవుతున్నారు.
 
మంగళవారం మళ్లీ పెట్రోల్, డీజిల్ ధరలను పెంచాయి. ఫలితంగా దేశ ఆర్థిక రాజధాని నగరమైన ముంబైలో మంగళవారం పెట్రోల్ లీటరు ధర 108.67 రూపాయలకు పెరిగింది. ఢిల్లీలో పెట్రోల్ లీటరుపై 25 పైసలు, డీజిల్ లీటరుకు 30 పైసలు పెరిగింది. దీంతో పెట్రోల్ లీటరు ధర రూ.102.64, డీజిల్ లీటరు ధర రూ.91.07కు చేరింది. 
 
ముంబైలో పెట్రోల్ లీటరు ధర రూ.108.67, డీజిల్ లీటరు ధర రూ.98.80కి పెరిగింది. చెన్నైలో లీటర్ పెట్రోల్ ధర రూ.100.23, లీటర్ డీజిల్ ధర రూ. 95.59గా ఉన్నాయి. కోల్‌కత్తాలో పెట్రోల్ రూ. 103.36, డీజిల్ రూ. 94.17కు పెరిగాయి. 
 
ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం, హిందుస్తాన్ పెట్రోలియం వంటి ప్రభుత్వ రంగ చమురు శుద్ధిదారులు అంతర్జాతీయ మార్కెట్లలో ముడి చమురు ధరలు, రూపాయి-డాలర్ మారకపు రేట్లను పరిగణనలోకి తీసుకొని ప్రతిరోజూ ఇంధన రేట్లను సవరిస్తున్నారు.