గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: శుక్రవారం, 29 జనవరి 2021 (19:19 IST)

వాహన తయారీ కేంద్రం ప్రారంభించిన వార్డ్‌విజార్డ్‌: 6000 మందికి ఉద్యోగావకాశాలు

ఈవీ విభాగంలో సుప్రసిద్ధ కంపెనీలలో ఒకటైన, జాయ్-ఈ బైక్‌ మరియు వ్యోమ్‌ ఇన్నోవేషన్స్‌ వంటి బ్రాండ్లు సొంతం చేసుకున్న వార్డ్‌విజార్డ్‌ ఇన్నోవేషన్స్‌ అండ్‌ మొబిలటీ లిమిటెడ్‌ తమ అత్యాధునిక కర్మాగారాన్ని గుజరాత్‌లోని వదోదర వద్ద విద్యుత్‌ ద్వి చక్ర వాహనాలను తయారుచేసేందుకు ప్రారంభించింది.
 
ఈ కంపెనీ దాదాపు 45 కోట్ల రూపాయలను ఈ నూతన ప్లాంట్‌లో పెట్టుబడిగా పెట్టడంతో పాటుగా మొదటి దశలో ఒక షిఫ్ట్‌లో ఒక లక్ష ద్వి చక్ర వాహనాలను ఒక సంవత్సరానికి ఉత్పత్తి చేయనుంది. కంపెనీ నాలుగు నూతనమోడల్స్‌, అత్యున్నత పనితీరు కలిగిన విద్యుత్‌ బైక్‌లు- బీస్ట్‌, థండర్‌ బోల్ట్‌, హరికేన్‌, స్కైలైన్‌ విడుదల చేసింది. ఈ నూతన ప్లాంట్‌ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆరువేల మందికి ఉపాధిని అందించనుంది.
 
వర్ట్యువల్‌గా ఈ కర్మాగారాన్ని గౌరవనీయ భారత హోంశాఖామాత్యులు శ్రీ అమిత్‌ షా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రంజన్‌బెన్‌ భట్‌, పార్లమెంట్‌ సభ్యులు, వదోదర మరియు శ్రీ రాజేంద్ర త్రివేది, స్పీకర్‌, గుజరాత్‌ రాష్ట్ర అసెంబ్లీ పాల్గొన్నారు.
 
ఈ సందర్భంగా శ్రీ యతిన్‌ గుప్తా, ఛైర్మన్‌ అండ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌, వార్డ్‌విజార్డ్‌ గ్రూప్‌ మాట్లాడుతూ, ‘‘విద్యుత్‌ బైక్‌లకు డిమాండ్‌ గణనీయంగా పెరుగుతుంది. 2025 నాటికి ఈవీ ద్విచక్రవాహన మార్కెట్‌లో 25% వాటా సొంతం చేసుకోగలమని ఆశిస్తున్నాము. కంపెనీకి ప్రస్తుతం 10కు పైగా ఈ బైక్‌లు, ఈ-స్కూటర్‌లు ఉన్నాయి. రాబోయే 3-4 సంవత్సరాలలో  500-600 కోట్ల రూపాయల ఆదాయాన్ని కంపెనీ లక్ష్యంగా చేసుకోవడంతో పాటుగా విద్యుత్‌ మూడు చక్రాల వాహనం ఆవిష్కరించడానికి సైతం లక్ష్యంగా చేసుకుంది’’ అని అన్నారు.