భారతీయులు ఏ రంగు కారును ఇష్టపడుతారు?
సాధారణంగా చాలా మంది కార్లు కొనుగోలు చేసేటపుడు తమ జాతకరీత్యా ఏ రంగు అయితే సూటబుల్ అవుతుందో ఆ తరహా రంగు కారును కొనుగోలు చేసేందుకు ఇష్టపడుతారు. కానీ, తాజాగా నిర్వహించిన సర్వేలో మాత్రం భారతీయులు ఎక్కువగా తెలుగు రంగు కారును ఇష్టపడతారని తేలింది.
2018లో 43 శాతం మంది ఆ రంగునే ఎంచుకున్నారట. జర్మనీకి చెందిన రసాయన సంస్థ బీఏఎస్‌ఎఫ్ తన అధ్యయనంలో ఈ విషయాలను వెల్లడించింది. ఆ కంపెనీ బీఏఎస్‌ఎఫ్ కలర్ రిపోర్ట్ ఫర్ ఆటోమోటివ్ ఓఈఎం కోటింగ్స్ పేరుతో ఓ నివేదికను వెలువరించింది.
తెలుపు తర్వాత గ్రే (15 శాతం), సిల్వర్ (15 శాతం) రంగులను ఎంపిక చేసుకున్నారని వెల్లడించింది. తర్వాత స్థానాల్లో ఎరుపు (9 శాతం), నీలం (7 శాతం), నలుపు (3 శాతం) రంగులను ఎంపిక చేసుకున్నారు. భారతీయ కొనుగోలుదారులు ముత్యపు రంగు (పర్ల్ వైట్)నే ఎంచుకుంటున్నారు. ఇక్కడి వాతారణం వేడిగా ఉండటం కూడా ఈ రంగును ఎంచుకోడానికి కారణమని పేర్కొంది.
తెలుపు రంగు వల్ల కార్లు త్వరగా వేడెక్కవు. అలాగే ఆ రంగు విలాసవంతంగా కనిపించడం కూడా ఓ కారణం కావొచ్చు అని ఆ నివేదిక పేర్కొంది. స్పోర్ట్స్ యుటిలిటీ వెహికిల్ (ఎస్‌యూవీ) కార్ల విషయంలో కూడా 41 మంది ఈ రంగు వైపే మొగ్గు చూపుతున్నారు. అలాగే కాంపాక్ట్ సెగ్మెంట్, కాంపాక్ట్ ప్రీమియమ్ సెగ్మెంట్ల విషయంలో కూడా తెలుపుదే పైచేయి.