బ్యాట్స్‌మెన్లపై ఎలాంటి కనికరం లేదు.. 48 వికెట్లతో ఆ ముగ్గురు అదరగొట్టారు.. పైనీ
ఆస్ట్రేలియా గడ్డపై భారత్ టెస్టు సిరీస్ నెగ్గిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కోహ్లీ సేనకు ప్రపంచ క్రికెట్ అభిమానుల నుంచి ప్రశంసల జల్లు కురుస్తోంది. తాజాగా ఆసీస్ కెప్టెన్ పైనీ కూడా టీమిండియా ఆటతీరుపై ప్రశంసల వర్షం కురిపించాడు. ప్రపంచ క్రికెట్‌లో భారత బౌలింగ్ అటాక్ అద్భుతంగా వుందని టిమ్ పైనీ తెలిపాడు.
బ్యాట్స్‌మెన్లను టీమిండియా బౌలింగ్ కోలుకోనీయట్లేదని.. అదే ఆసీస్ గడ్డపై భారత్‌కు గెలుపును సంపాదించి పెట్టిందని పైనీ చెప్పుకొచ్చాడు. బ్యాట్స్‌మెన్లపై ఎలాంటి కనికరం లేకుండా బౌలింగ్ చేసే బౌలర్లు టీమిండియా చెంతనున్నారని పైనీ తెలిపాడు.
ఆసీస్ బ్యాట్స్‌మెన్లు టీమిండియా బౌలింగ్ ధీటుగా ఎదుర్కొన్నప్పటికీ.. బౌలింగ్ ద్వారా కోహ్లీ సేన బౌలర్లు కంగారూలను ఒత్తిడిలోకి నెట్టారని పైనీ తెలిపాడు. భారత్‌తో సొంతగడ్డపై జరిగిన టెస్టు మ్యాచ్‌లను మరిచిపోలేమని, ఇదే బౌలింగ్ తీరు కొనసాగితే.. ప్రపంచ కప్‌లో టీమిండియా విజేతగా నిలిచే అవకాశం లేకపోలేదని పైనీ వెల్లడించాడు.
ఇంగ్లండ్‌లో జరుగనున్న వరల్డ్ కప్‌లో భారత్ బ్యాటింగ్, బౌలింగ్‌లో రాణిస్తే.. ప్రపంచకప్ నెగ్గుతుందని తెలిపాడు. టీమిండియా జట్టులో బౌలర్లందరూ ఫిట్‌గా వున్నారని, కొన్ని సందర్భాల్లో బ్యాట్స్‌మెన్లు ఒత్తిడికి గురైనా.. బౌలర్లు జట్టును గెలిపించేస్తారని పైనీ అభిప్రాయం వ్యక్తం చేశారు.
తమ జట్టు ఆటగాళ్లలో కాస్త మార్పు అవసరమని కూడా పైనీ వ్యాఖ్యానించాడు. నాలుగు టెస్టుల సిరీస్‌లో జస్‌ప్రీత్ బూమ్రా, ఇషాంత్ శర్మ, మొహ్మద్ షమీల త్రయం.. ఏకంగా 48 వికెట్లు సాధించడం ఆషామాషీ కాదని పైనీ కితాబిచ్చాడు.
కాగా భారత్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో ఆస్ట్రేలియా బ్యాటింగ్‌లో విఫలమైంది. ఇది ఆసీస్ పేసర్లపైన కూడా ప్రభావం చూపించినట్లైంది. తాజాగా ముగిసిన టెస్టు సిరీస్‌లో ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్లు అత్యధికంగా 79 స్కోరునే వ్యక్తిగతంగా నమోదు చేశారు.
అందుకే 27.90 సగటును మాత్రమే టాప్-6 బ్యాట్స్‌మన్ సాధించారు. బౌలింగ్‌లోనూ ముగ్గురు పేసర్ల బౌలింగ్ సగటు 30.90 మాత్రమే. దీంతో భారత్ టెస్టు సిరీస్‌ను కైవసం చేసుకుంది.