శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 27 నవంబరు 2019 (17:29 IST)

ఏపీలో భారీ వాటర్‌ షెడ్ ప్రాజెక్ట్‌కు ప్రపంచబ్యాంక్ రెడీ

- మంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో ప్రపంచబ్యాంక్ ప్రతినిధుల భేటీ
- అయిదేళ్లలో 70 మిలియన్ డాలర్ల రుణం అందచేతకు సుముఖం.
- రాయలసీమ, ప్రకాశం జిల్లాలో మొదటి దశ వాటర్‌షెడ్ ప్రాజెక్ట్ అమలు.
 
ఆంధ్రప్రదేశ్‌లో భారీ వాటర్‌ షెడ్ ప్రాజెక్ట్ అమలుకు ప్రపంచబ్యాంక్ ముందకు వచ్చింది. ఇప్పటి వరకు దేశంలో కర్ణాటక, ఒడిషాలతో వాటర్‌ షెడ్ ప్రాజెక్ట్ లో భాగస్వామిగా వున్న ప్రపంచబ్యాంక్ తాజాగా ఎపితో కూడా కలిసి పనిచేసేందుకు ఆసక్తి చూపించింది. ప్రపంచబ్యాంక్ నిధులతో దేశంలోనే వాటర్‌ షెడ్ కార్యక్రమాలను అమలు చేసే మూడో రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌‌ను ఎంపిక చేసింది. 
 
దీనిలో భాగంగా అయిదేళ్ల పాటు రాష్ట్రంలో దాదాపు 70 మిలియన్ డాలర్ల మేరకు రుణంగా అందించేందుకు ప్రపంచబ్యాంక్ సంసిద్దత వ్యక్తం చేసింది. ఈ మేరకు బుధవారం అమరావతిలోని సచివాలయంలో ఏడుగురు ప్రపంచబ్యాంక్ ప్రతినిధులతో కూడిన బృందం రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్దిశాఖా మంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో భేటీ అయ్యింది. ఈ సమావేశంలో ఎపిలో వాటర్‌ షెడ్ ప్రాజెక్ట్ పై ప్రపంచబ్యాంక్ ప్రతినిధులతో మంత్రి శ్రీ రామచంద్రారెడ్డి చర్చించారు. 
 
వాటర్‌ షెడ్ ప్రాజెక్ట్ ద్వారా రాష్ట్రంలో నీటియాజమాన్యం, భూసార యాజమాన్యం, మెరుగైన వ్యవసాయ విధానాలు, గ్రామీణ వ్యవసాయరంగ ఆర్థిక అభివృద్ది విధానాలను అమలు చేసే అంశంపై సమీక్ష నిర్వహించారు. ప్రపంచబ్యాంక్‌ రుణంతో రాష్ట్రంలో నిర్వహించబోయే వాటర్‌ షెడ్ ప్రాజెక్ట్ అమలుపై చర్చించారు. వాటర్‌ షెడ్ ప్రాజెక్ట్ లో 70శాతం ప్రపంచబ్యాంక్‌, 30 శాతం రాష్ట్రప్రభుత్వం నిధులను సమకూర్చాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. 
 
రాష్ట్రంలో తక్కువ వర్షపాతం నమోదవుతున్న రాయలసీమ జిల్లాలతో పాటు ప్రకాశం జిల్లాను మొదటిదశ వాటర్ షెడ్ అమలుకు ఎంపిక చేయాలని సూత్రప్రాయంగా నిర్ణయించారు. ఈ ప్రాజెక్ట్ ను రాష్ట్ర గ్రామీణాభివృద్ది, వ్యవసాయ శాఖలు, ఎపి స్పేస్ అప్లికబుల్ సెంటర్, వ్యవసాయ యూనివర్సిటీల కన్సార్టియం ద్వారా పర్యవేక్షణ చేయాలని సమావేశంలో నిర్ణయించారు. 
 
నీటి ఎద్దడితో కూడిన ప్రాంతాల్లో జలవనరులను సంరక్షించడం. ఆధునిక నీటి యాజమాన్య విధానాల ద్వారా నీటి వనరులను సద్వినియోగం చేసుకోవడం ప్రధాన లక్ష్యంగా వాటర్‌ షెడ్ కార్యక్రమాలు వుంటాయని ప్రపంచబ్యాంక్ ప్రతినిధులు వివరించారు. రాష్ట్రంలో నీటి యాజమాన్యంతో పాటు ఎపిశాట్ ద్వారా భూసార పరీక్షలు... ఎరువులు, పోషకాల విషయంలో రైతులకు ఉత్తమ సూచనలను అందించడం, వ్యవసాయంలో అవసరం లేని ఎరువులు, పోషకాల వినియోగానికి స్వస్థి చెప్పేలా వారిలో చైతన్యం కలిగించడం వంటి కార్యక్రమాలను నిర్వహిస్తామని తెలిపారు. 
 
గ్రామాల్లో ఉపయోగం లేని వ్యవసాయ పెట్టబడి వ్యయాన్ని తగ్గించడం, అధిక ఉత్పత్తులను, మెరుగైన సస్య విధానాలను అందించడం ద్వారా గ్రామీణాభివృద్దికి, పల్లె ప్రజల జీవన ప్రమాణాల మెరుగుదలకు కూడా వాటర్‌ షెడ్ ప్రాజెక్ట్ లో చోటు కల్పిస్తున్నట్లు ప్రపంచబ్యాంక్ బృందం వివరించింది. 
 
భూసార నివేదికలను, నేల స్వభావాన్ని బట్టి ఏరకమైన పంటలు సాగు చేయవచ్చు తదితర అంశాలను కూడా వ్యవసాయశాఖ, వ్యవసాయ యూనివర్సిటీల భాగస్వామ్యంతో ఖరారు చేస్తామని వెల్లడించారు. ఈ భేటీలో రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ కమిషనర్‌ గిరిజాశంకర్, వాటర్‌ షెడ్ ప్రాజెక్ట్ డైరెక్టర్‌ వెంకట్ రెడ్డి, ప్రపంచ బ్యాంక్ ప్రతినిధులు గ్రాంట్ మిల్నే, లియా విన్యీ, ఎస్ సి రాజశేఖర్‌, జెవిఆర్ మూర్తి, కస్తురీ బసు,  రంజన్ బి వర్మా తదితరులు పాల్గొన్నారు.