శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. కెరీర్
  3. కెరీర్ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 28 ఆగస్టు 2020 (12:18 IST)

'ఫైనల్' పరీక్షలు రాయకుండా ఎలా ప్రమోట్ చేస్తారు.. కుదరదంతే : తేల్చిన సుప్రీంకోర్టు

ఆఖరి సంవత్సరం పరీక్షలు రాయకుండా డిగ్రీలు ప్రదానం చేయలేమని యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ తేల్చిచెప్పింది. ఇదే విషయాన్ని ఇపుడు సుప్రీంకోర్టు కూడా పునరుద్ఘాటించింది. డిగ్రీ విద్యార్థులు ఆఖరి సంవత్సరం పరీక్షలు రాస్తేనే ఉత్తీర్ణత సాధించినట్టు అవుతారని స్పష్టంచేసింది. 
 
అయితే, విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో చదువుతున్న విద్యార్థినీ, విద్యార్థులకు ఫైనల్ ఇయర్ పరీక్షలు నిర్వహించవలసిన అవసరం ఉందని, అయితే రాష్ట్ర ప్రభుత్వాలు వాటిని వాయిదా వేయవచ్చునని సుప్రీంకోర్టు శుక్రవారం తెలిపింది. కోవిడ్-19 మహమ్మారి నేపథ్యంలో విపత్తు నిర్వహణ చట్టం ప్రకారం ఈ పరీక్షలను వాయిదా వేయవచ్చునని వివరించింది. 
 
ముఖ్యంగా, ఆఖరి సంవత్సరం విద్యార్థినీ, విద్యార్థులను పరీక్షలు నిర్వహించకుండా, తదుపరి తరగతులకు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రమోట్ చేయడానికి వీల్లేదని స్పష్టం చేసింది. యూజీసీ (యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్) ఆదేశాల మేరకు ఫైనల్ ఇయర్ పరీక్షలు నిర్వహించకుండా విద్యార్థులను ప్రమోట్ చేయరాదని వివరించింది. 
 
రాష్ట్ర ప్రభుత్వాలు యూజీసీతో సంప్రదించి, పరీక్షల నిర్వహణకు తేదీలను ఖరారు చేయవచ్చునని తెలిపింది. మహమ్మారి సమయంలో తగిన తేదీని ఖరారు చేసి, ఫైనలియర్ పరీక్షలు నిర్వహించవచ్చునని తెలిపింది. యూజీసీ ప్రకటించిన సెప్టెంబరు 30 గడువును రాష్ట్రాలు తప్పనిసరిగా పాటించాల్సిందేనని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. 
 
ఆఖరి సంవత్సరం పరీక్షలు తప్పనిసరిగా నిర్వహించాలని యూజీసీ జారీ చేసిన మార్గదర్శకాలు సరైనవేనని తెలిపింది. పరీక్షలు నిర్వహించకుండా పై తరగతులకు ప్రమోట్ చేయరాదన్నది కూడా సరైన నిర్ణయమేనని పేర్కొంది. కోవిడ్ దృష్ట్యా పరీక్షలను వాయిదా వేయాలని రాష్ట్ర ప్రభుత్వాలు భావిస్తే, యూజీసీతో సంప్రదించి, కొత్తగా తేదీలను ఖరారు చేసుకోవచ్చునని సుప్రీంకోర్టు శుక్రవారం తీర్పునిచ్చింది.