పేటీఎంలో 20వేల ఫీల్డ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్.. 35వేల ఖాళీల భర్తీ
పేటీఎం దేశవ్యాప్తంగా 20 వేల ఫీల్డ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్‌లను నియమించుకోవాలని నిర్ణయించింది. అంతేకాదు ఈ 20,000 మంది ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్‌లకు నెలవారీ వేతనంగా 35 వేల రూపాయలు ఇవ్వనున్నట్లు సమాచారం. కంపెనీ ప్రతినిధి ఈ విషయంపై వ్యాఖ్యానించనప్పటికీ, అండర్ గ్రాడ్యుయేట్లు ఈ ఉద్యోగాలకు అర్హులుగా నిర్ణయించినట్టు తెలుస్తోంది.
మార్కెట్లో ప్రధాన పోటీ, త్వరలోనే పబ్లిక్ ఇష్యూకు రానున్న తరుణంలో పేటీఎం ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ ఉద్యోగుల ద్వారా పేటీఎం, క్యూఆర్ కోడ్, పీవోఎస్ మెషీన్, పేటీఎం సౌండ్ బాక్స్, వ్యాలెట్, యూపీఐ, పేటీఎం పోస్ట్ పెయిడ్, మర్చంట్ లోన్స్, ఇన్సూరెన్స్ స్కీంలను ప్రమోట్ చేయాలని భావిస్తోంది. తద్వారా భారీ వ్యాపార విస్తరణకు కంపెనీ ప్లాన్ చేస్తోంది.
నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పిసిఐ) మే నాటి డేటా ప్రకారం ప్రస్తుత యూపీఐ మార్కెట్లో పేటీఎం కు 11 శాతం వాటా మాత్రమే ఉండగా, 45 శాతం మార్కెట్ వాటాతో ఫోన్ పే మొదటి స్థానంలో, గూగుల్ పే 35 శాతం రెండో స్థానంలో ఉన్నాయి.