రూ.30 లక్షల ఆడి కారు ధర... ఇపుడు రూ.3 లక్షలే ఎక్కడ?
రూ.30 లక్షల నుంచి రూ.50 లక్షలు విలువ చేసే అత్యంత విలాసవంతమైన ఆడి, బెంజ్, బీఎండబ్ల్యు, స్కోడా వంటి లగ్జరీ కార్లు కారుచౌకకు లభిస్తున్నాయి. అలా లభిస్తున్న ప్రాంతం చెన్నై పట్టణం. గత యేడాది డిసెంబర్ నెలలో చెన్నై మహానగరం వరద నీటిలో కొట్టుమిట్టాడిన సంగతి తెల్సిందే. దీంతో అన్ని రకాల విలాసవంతమైన కార్లు నీటిలో మునిగిపోయారు. చివరకు లగ్జరీ కార్లు ఉత్పత్తి చేసే ప్లాంట్లు కూడా వరద నీటిలో చిక్కుకున్నాయి. దీంతో సెకండ్ సేల్స్ కింద లగ్జరీ కార్లు అత్యంత కారుచౌకకు విక్రయిస్తున్నారు.
గత యేడాది డిసెంబర్ నెలలో సంభవించిన భారీ వరదల కారణంగా చెన్నై నగరం నీట మునిగిన విషయం తెల్సిందే. ఈ కారణంగా వారం రోజుల పాటు అన్ని రకాల వాహనాలు నీటిలోనే ఉండిపోయాయి. ఇలాంటి కార్లను తిరిగి రోడ్డెక్కించడం వాటి యజమానులకు తలకు మించిన భారంగా మారుతోంది. ముఖ్యంగా లగ్జరీ కార్లకు విడిభాగాలు పెద్ద సమస్యగా మారాయి.
బయటి నుంచి స్పేర్‌పార్ట్స్‌ని తెప్పించి షోరూమ్స్‌లో రిపేర్ చేసేసరికి నెలల సమయం పడుతోంది. సాధారణంగా బెంజ్, బీఎండబ్ల్యూ అంటే ధనవంతుల కార్లు. ఇలాంటివారు నెలల తరబడి ఆగడం కంటే.. కొత్త కారును కొనుగోలు చేసుకునేందుకు మొగ్గు చూపుతున్నారు. దీంతో తమ పాత కార్లను ఎంతోకొంత ధరకు అమ్మేస్తున్నారు. అలాగే ఓ మాదిరి కార్లకు కూడా తాత్కాలిక మరమ్మతులు చేయించి వీలైనంత త్వరగా వదిలించుకునే పనిలో ఉన్నారు వాటి యజమానులు. దీంతో చెన్నై సెకండ్ హ్యాండ్ కార్ల మార్కెట్‌లో అమ్మకానికి వచ్చే కార్ల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది.
సాధారణంగా ఆడి ఎ-4 సిరీస్ కారు ధర మామూలుగా మార్కెట్‌లో అయితే రూ.30 లక్షలు. కానీ చెన్నై వేలం బజార్‌లో రూ.3 లక్షల నుంచి రూ..3.50 లక్షలు మాత్రమే పలుకుతుంది. అలాగే, సూపర్ లగ్జరీ బీఎండబ్ల్యు 3 సిరీస్ కార్ కేవలం రూ.7.5 లక్షలు. రూ.1.50 లక్షలకే కొత్త స్కోడా కారు. ఇవి కూడా చెన్నై రేట్లే. మరి వీటిని కొనే సాహసం ఎంతమంది చేస్తారో చూడాల్సి ఉంది.