ఒడిశా: 26 మందికి పైగా టీచర్లు, విద్యార్థులకు కరోనా
కరోనా వైరస్ కారణంగా మూతపడిన పాఠశాలలు ఒడిశాలో జనవరి 8వ తేదీ నుంచి ప్రారంభమయ్యాయి. కానీ కేవలం మూడు రోజుల వ్యవధిలో 30 మందికిపైగా టీచర్లు, విద్యార్థులు కరోనా బారినపడ్డారు. రాష్ట్రంలోని గజపతి జిల్లాలో గత మూడు రోజుల్లో కొత్తగా 31 కేసులు నమోదయ్యాయని జిల్లా వైద్యాధికారి ప్రదీప్ కుమార్ తెలిపారు. అందులో 90 శాతం మంది ఉపాధ్యాయులు, విద్యార్థులే ఉన్నారన్నారు. స్కూళ్లకు వెళ్లడంతో వీరికి కరోనా వైరస్ సోకిందని చెప్పారు.
ఒడిశాలో 10, 12వ తరగతి విద్యార్థులకు శుక్రవారం నుంచి తరగతులు ప్రారంభమయ్యాయి. అయితే విద్యా సంస్థల ప్రారంభానికి ముందే ఉపాధ్యాయులకు కరోనా పరీక్షలు నిర్వహించారని తెలిపారు. ఇద్దరు విద్యార్థులకు కూడా కరోనా పాజిటివ్ వచ్చిందన్నారు.
కాగా, బోర్డు పరీక్షల దృష్ట్యా నిరాటంకంగా వంద రోజులపాటు తరగతులు నిర్వహించాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. ఈనేపథ్యంలో తల్లిదండ్రుల అనుమతితో తగిన జాగ్రత్తలు తీసుకుని విద్యార్థులు తరగతులకు హాజరుకాలని ప్రభుత్వం సూచించింది. కాగా, రాష్ట్రంలో యూనివర్సిటీలు, కాలేజీల్లో ఈరోజునుంచి చివరి సంవత్సరం విద్యార్థులకు క్లాసులు ప్రారంభమయ్యాయి.