మంగళవారం, 26 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By సెల్వి
Last Updated : సోమవారం, 18 మే 2020 (09:46 IST)

హైదరాబాదులో ఒక్కరోజే 42 కరోనా కేసులు.. పురుషులకే ఎక్కువ!

హైదరాబాదులో కరోనా వైరస్ 42 మందికి సోకింది. ఆదివారం ఒక్కరోజే ఈ కేసులు నమోదు కావడం గమనార్హం. వీటిలో జీహెచ్‌ఎంసీ పరిధిలోనే 37, రంగారెడ్డి జిల్లాలో రెండు, వలసదారులకు సంబంధించి మూడు కేసులు వచ్చాయి. జీహెచ్‌ఎంసీ పరిధిలోని గోషామహల్‌ సర్కిల్‌-14లో ఉన్న జుంగూర్‌బస్తీలో ఆదివారం ఒకేరోజు 15 మందికి కరోనా సోకింది. 
 
జుంగూర్‌ బస్తీలో నివాసం ఉండే ఓ బ్యాంక్‌ ఉద్యోగి (36)కి ఐదు రోజుల క్రితం వైరస్ సోకింది. వెంటనే అప్రమత్తం అయిన అధికారులు అతని కుటుంబ సభ్యులు, బంధువులను క్వారంటైన్‌కు తరలించారు. వారికి పరీక్షలు నిర్వహించగా ఉద్యోగి తండ్రి (56), అతని భార్య, ఇద్దరు చిన్న పిల్లలు, ఇంట్లోని బంధువులందరికీ కలిపి 15 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. 
 
మరోవైపు పురానాపూల్‌ చౌరస్తాలోని ఎస్‌బీఐ శాఖ నుంచి ఇటీవల నగదు డ్రా చేసుకొని వెళ్లిన ఓ మహిళకు కరోనా పాజిటివ్‌ నిర్ధారణ కావడంతో వైద్యశాఖ అధికారులు బ్యాంక్‌లో పనిచేసే 13 మంది సిబ్బంది, అధికారులను క్వారంటైన్‌కు తరలించారు. 
 
ఇక తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం కేసుల సంఖ్య 1,551కి చేరింది. అందులో వలసదారుల సంఖ్య 57గా ఉంది. ఆదివారం 21 మంది కోలుకోగా మొత్తం డిశ్చార్జి అయినవారి సంఖ్య 992కు చేరింది. ఇప్పటిదాకా మొత్తం 34 మంది మరణించగా ప్రస్తుతం ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నవారు 525 మంది ఉన్నారు. ఇంకా తెలంగాణ రాష్ట్రంలో కరోనా బాధితుల్లో పురుషులే ఎక్కువగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు.