గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By సెల్వి
Last Updated : శనివారం, 19 డిశెంబరు 2020 (12:46 IST)

దక్షిణాఫ్రికాలో కొత్త వైరస్.. కరోనా రెండో వేవే కారణం..

ప్రపంచ దేశాల్లో కరోనా సెకండ్ వేవ్ కొనసాగుతోంది. తాజాగా దక్షిణాఫ్రికాలో కొత్త కరోనా స్ట్రెయిన్‌ను(వైరస్) గుర్తించామని ఆ దేశ ఆరోగ్య శాఖ మంత్రి జ్వెలీ కిజే తెలిపారు. ప్రస్తుతం దేశంలో కొనసాగుతున్న కరోనా రెండో వేవ్ ఈ కొత్త స్ట్రెయిన్ కారణమని తాము నమ్ముతున్నట్టు ఆయన వ్యాఖ్యానించారు. ఈ కొత్త స్ట్రెయిన్‌పై ప్రభుత్వం అధ్యనం జరుపుతోందన్నారు. ప్రజలు కంగారు పడాల్సిన అవసరం లేదని, అప్రమత్తంగా ఉంటూ భౌతిక దూరం నిబంధనలు పాటించాలని జ్వెలీ సూచించారు. 
 
'501.వీ2 అనే కొత్త రకం కరోనా స్ట్రెయిన్‌ను మేము గుర్తించాం. ప్రస్తుతం దేశంలో ఉన్న కరోనా రెండో వేవ్‌ వెనుకాల ఈ కొత్త రకం వైరస్ ఉందనేందుకు తమకు బలమైన ఆధారాలు లభ్యమయ్యాయి. అయితే.. మునుపటి వైరస్ కంటే ఇది ప్రమాదకరమైనదా కాదా, కోలుకున్న వారిని కూడా మళ్లీ కాటేస్తుందా లేదా అనే ప్రశ్నలకు ఇప్పుడే సమాధానం చెప్పలేము.'అని ఆయన తెలిపారు. 
 
ఈ కొత్త వైరస్‌పై ల్యాబ్‌లో పరిశోధనలు జరుగుతున్నాయని ప్రొ. కరీమ్ అనే శాస్త్రవేత్త తెలిపారు. కరోనా కట్టడి కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌కు కరీమ్ నేతృత్వం వహిస్తున్నారు. 'ఈ స్ట్రెయిన్‌ను ల్యాబ్‌లో పెంచుతున్నాం. కరోనా నుంచి కోలుకున్నవారి నుంచి సేకరించిన సీరమ్‌ను దీనిపై ప్రయోగించి, వైరస్ నిర్వీర్యం అయిందో లేదో చూస్తాం. తద్వారా వచ్చే ఫలితాలను బట్టి ఈ కొత్త స్ట్రెయిన్ మునపటి కంటే ప్రమాదకరమైనదో కాదో అంచనా వేస్తాం' అని కరీం తెలిపారు.