ఆఫీసుకు వచ్చిన కరోనా ఉద్యోగి.. కార్యాలయంలో ఏడుగురు మృతి
కరోనా వైరస్ విజృంభించడంతో గత ఏడాది మార్చి నుంచి లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. దీంతో కార్యాలయాలు మూతపడ్డాయి. కానీ ఇప్పుడిప్పుడే అన్ లాక్ ప్రక్రియ కొనసాగుతున్న తరుణంలో యధావిధిగా ఉద్యోగోలు విధులకు హాజరవుతున్నారు.
అయితే అన్ లాక్ ప్రక్రియ కొనసాగినా.. కరోనా వ్యాప్తికి మాత్రం ఇంకా బ్రేక్ పడలేదు. కరోనా మృతుల సంఖ్య కూడా తగ్గుముఖం పట్టలేదు. కరోనా లక్షణాలున్న ఒక వ్యక్తి కార్యాలయంలో విధులకు హాజరయ్యాడు. దీంతో ఆఫీస్‌లోని కొందరికి వైరస్ సోకడంతో ఏడుగురు మరణించారు.
క్వారంటైన్‌లో ఉన్న సుమారు 300 మంది ప్రాణ భయంతో హడలిపోతున్నారు. అయితే ఈ ఘటన మనదేశంలో కాదు. అమెరికాలో చోటుచేసుకుంది. అమెరికాలోని ఒరెగాన్ రాష్ట్రంలో ఈ ఘటన జరిగింది. డగ్లస్ కౌంటీకి చెందిన ఒక వ్యక్తి కరోనా లక్షణాలతో బాధపడుతున్నప్పటికీ గత వారం ఆఫీస్‌కు వెళ్లి విధులు నిర్వహించాడు. ఈ క్రమంలో అతడ్ని పరీక్షించగా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది.
మరోవైపు అతడి ద్వారా మరికొందరికి వైరస్ వ్యాపించింది. ఈ క్రమంలో కరోనాబారినపడి ఏడుగురు మరణించారు. దీంతో డగ్లస్ కౌంటీలోని సుమారు 300 మందికిపైగా ప్రజలు స్వీయ క్వారంటైన్ విధించుకున్నారు. ఈ ప్రాంతంలో ఇప్పటికే 37 మంది కరోనా వల్ల మరణించగా 1,315 మందికి వైరస్ సోకింది.