మంగళవారం, 28 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 17 ఏప్రియల్ 2020 (13:41 IST)

ఆంధ్రాలో ఏం జరుగుతోంది... పెరిగిపోతున్న కరోనా కేసులు!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తికి కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. గ్రామ వలంటీర్ల వ్యవస్థతోపాటు గ్రామీణ హెల్త్ వర్కర్ల ద్వారా కూడా వైరస్ వ్యాప్తి నిరోధక చర్యలు చేపట్టారు. అయినప్పటికీ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. 
 
గత 24 గంటల్లో జరిగిన కోవిడ్ 19 నిర్ధారణ పరీక్షల్లో మరో 38 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ తెలిపింది. రాష్ట్రంలో నమోదైన మొత్తం 572 పాజిటివ్ కేసులకుగాను 35 మంది డిశ్చార్జ్‌కాగా, 14 మంది మరణించారని తెలిపింది. ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 523 అని తెలిపింది. 
 
ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు, గుంటూరు జిల్లాల్లో అత్యధికంగా 126 చొప్పున కేసులు నమోదయ్యాయని ఏపీ సర్కారు చెప్పింది. గుంటూరులో 122 మంది ఆసుపత్రుల్లో చికిత్స తీసుకుంటుండగా, నలుగురు ప్రాణాలు కోల్పోయారు. కర్నూలులో 124 మంది ఆసుపత్రుల్లో చికిత్స తీసుకుంటుండగా ఇద్దరు మృతి చెందారు.
 
ఈ రెండు జిల్లాల తర్వాత అత్యధికంగా నెల్లూరులో 64 కేసులు నమోదు కాగా 61 మందికి చికిత్స అందుతోంది. ఒకరు డిశ్చార్జ్‌ కాగా ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఇప్పటివరకు ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. మరోవైపు కరోనా కట్టడి కోసం ముఖ్యమంత్రి జగన్ నిరంతరం ఉన్నతాధికారులతో సమీక్షలు నిర్వహిస్తూ తగు సూచనలు, సలహాలు ఇస్తున్నారు. 
 
గత 24 గంటల్లో నమోదైన పాజిటివ్ కేసులను జిల్లాలవారీగా పరిశీలిస్తే అనంతపూరులో 5 (మొత్తం 26), చిత్తూరులో 5 (28), గుంటూరులో 4 (126), కడపలో 1 (37), కృష్ణ 4 (52), కర్నూలులో13 (126), నెల్లూరులో 6 (64) చొప్పున నమోదయ్యాయి. 
 
మిగిలిన జిల్లాల్లోని నమోదైవున్న మొత్తం కేసుల వివరాలను పరిశీలిస్తే, ఈస్ట్ గోదావరిలో 17, ప్రకాశంలో 42, విశాఖపట్టణంలో 20, వెస్ట్ గోదావరిలో 34 చొప్పున నమోదయ్యాయి. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో మాత్రం ఇప్పటివరకు ఒక్క కేసు కూడా నమోదు కాలేదు.