శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 16 ఏప్రియల్ 2020 (09:44 IST)

ఏపీలో పెరుగుతున్న కరోనా కేసులు.. దేశంలో 12 వేల మార్క్ క్రాస్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య చాపకింద నీరులా పెరుగుతోంది. ఫలితంగా ప్రతిరోజూ ఏదో ఒక ప్రాంతంలో కరోనా కేసులు నమోదవుతూనే ఉన్నాయి. దీంతో రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 525కి చేరింది. వీటిలో ఎక్కువగా గుంటూరు జిల్లాలో 122 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. అలాగే 14 మంది క‌రోనాతో మ‌ర‌ణించ‌గా... 20 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. 
 
ఇకపోతే దేశ వ్యాప్తంగా కరోనా కేసుల నమోదు 12 వేల మార్కును దాటేసింది. గత 24 గంటల్లో 39 మంది ఈ వైరస్‌తో మరణించారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 392కు చేరుకుంది. తాజాగా మృతి చెందిన వారిలో మహారాష్ట్రకు చెందిన 18 మంది, యూపీకి చెందిన ఆరుగురు, గుజరాత్‌కు చెందిన నలుగురు, మధ్యప్రదేశ్‌కు చెందిన ముగ్గురు, ఢిల్లీ, కర్ణాటకకు చెందిన చెరో ఇద్దరు, తెలంగాణ, తమిళనాడు, పంజాబ్, మేఘాలయకు చెందిన ఒక్కొక్కరు ఉన్నారు.
 
గురువారం ఉదయానికి మొత్తం కేసుల సంఖ్య 12380కు చేరుకోగా, ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 414కు చేరింది. వీటిలో 10,197 యాక్టివ్ కేసులని, 1343 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారని తెలిపింది. ఇక, మొత్తం మరణాల్లో 178 ఒక్క మహారాష్ట్రలోనే సంభవించడం గమనార్హం. కేసుల్లోనూ మహారాష్ట్రదే అగ్రస్థానం. అక్కడ ఇప్పటివరకు 2,687 కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాతి స్థానంలో ఢిల్లీ (1561), తమిళనాడు (1204), రాజస్థాన్ (1005) ఉన్నాయి.