శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 15 ఏప్రియల్ 2020 (23:16 IST)

ఎబోలా మందు కరోనాకు విరుగుడు.. ఐసీఎంఆర్ గుడ్ న్యూస్

ఇండియన్ కౌన్సిల్ అఫ్ మెడికల్ రీసెర్చ్(ఐసీఎంఆర్) గుడ్ న్యూస్ చెప్పింది. ప్రపంచ దేశాలను అట్టుడికిస్తున్న కరోనా వైరస్‌కు మలేరియా ట్యాబ్లెట్లు విరుగుడుగా పనిచేస్తున్నట్లు ఇప్పటికే వైద్యులు ప్రకటించిన నేపథ్యంలో.. కరోనాకు మందు కనిపెట్టేందుకు ప్రపంచ వ్యాప్తంగా పరిశోధనలు జరుగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఐసీఎంఆర్ డైరెక్టర్ డాక్టర్ రామన్ గంగాఖేడ్కర్ కీలక వ్యాఖ్యలు చేశారు. 
 
ఎబోలా వైరస్ చికిత్సకు ఉపయోగించిన 'రెమెడెసివర్‌' డ్రగ్ కరోనాపై ప్రభావం చూపగలదని గంగాఖేడ్కర్ సంచలన ప్రకటన చేసారు. గిలియడ్ సైన్స్ ఇంక్ సంస్థ తయారు చేసిన ఈ ప్రయోగాత్మక మందు ప్రారంభ దశలో మంచి రిజల్ట్స్ చూపిస్తోందన్నారు. అటు వెంటిలేటర్‌పై ఉన్న ముగ్గురు కరోనా పేషంట్లలో ఇద్దరికీ ఈ 'రెమెడెసివర్‌' డ్రగ్ పని చేసినట్లు న్యూ ఇంగ్లాండ్ జర్నల్ అఫ్ మెడిసిన్ ఓ నివేదికను ప్రచురించిందని గంగాఖేడ్కర్ గుర్తు చేశారు. 
 
అయితే ఇది క్లినికల్ ట్రయిల్ కాదని.. కేవలం పరిశీలనాత్మక అధ్యయనం మాత్రమేనని ఐసీఎంఆర్ డైరెక్టర్ స్పష్టం చేశారు. ఈ డ్రగ్ ఇచ్చిన కొందరి వ్యక్తులను పరిశీలించగా, 68 శాతం లేదా ముగ్గురులో ఇద్దరు పేషంట్లకు ఈ మందు తర్వాత వెంటిలేటర్ సాయం అవసరం లేదని తేలింది. 
 
భారత్‌లో ప్రస్తుతం ఈ రెమెడెసివర్‌ అందుబాటులో లేదని ఐసీఎంఆర్ తేల్చి చెప్పేసింది. గిలియడ్ సంస్థ తయారు చేసిన ఈ డ్రగ్ ట్రయిల్స్‌లో ప్రపంచ ఆరోగ్య సంస్థతో పాటు ఐసీఎంఆర్ కూడా పాల్గొంటోంది. ఈ మందును తయారు చేస్తే కరోనాకు వాడొచ్చునని ఐసీఎంఆర్ వెల్లడించింది.